Search
Saturday 17 November 2018
  • :
  • :

పరిష్కారం చెప్పండి

 Raghuram Rajan advice sought on tackling NPA problem

బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిలు
సలహా ఇవ్వాలంటూ రాజన్‌కు పార్లమెంట్ ప్యానెల్ లేఖ

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌కు పార్లమెంట్ ప్యానెల్ నుంచి పిలుపు వచ్చింది. దేశీయ బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిలకు పరిష్కారం చూపాలని, దీనికి గాను తమ ముందు హాజరు కావాలని ప్యానెల్ రాజన్‌కు లేఖ రాసింది. ఇటీవల ప్యానెల్ ఎదుట హాజరైన మాజీ సిఇఎ(ప్రధాన ఆర్థిక సలహాదారుడు) అరవింద్ సుబ్రమణ్యం మాజీ గవర్నర్ రాజన్‌ను ప్రశంసించిన తర్వాత ఈ ఆహ్వానం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం దేశీయ బ్యాంకుల్లో ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) సంక్షోభం, వీటికి పరిష్కారం కోసం రాజన్ తమ వద్దకు రావాలని సీనియర్ బిజెపి నేత మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో ప్యానెల్ ఆహ్వానించింది.

ఈమేరుకు జోషి రాజన్‌కు లేఖ రాశారని అధికార వర్గాలు వెల్లడించాయి. రఘురాం రాజన్ 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్ల పాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వద్ద ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్యను ముందే గుర్తించిన ఘనత రాజన్‌కే చెందుతుందంటూ ప్యానెల్ ఎదుట సుబ్రమణ్యం ఇటీవల ప్రశంసించారు. దీని తర్వాత ప్యానెల్ రాజన్‌కే ఆహ్వానం పలకడం గమనార్హం. గత నెలలో ప్యానెల్ ఎదుట సుబ్రమణ్యం హాజరై మొండి బకాయిలపై వివరాలను అందించారు. ఎన్‌పిపిలపై ఆయన పలు సందేహాలు వ్యక్తం చేసి, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెద్ద రుణాలు తీవ్ర ప్రభావం చూపాయని ప్యానెల్‌కు చెప్పారు.

దీని కారణాలు, పరిష్కారం ఆయన చెప్పలేదు. బ్యాంకర్లలో భయానక వాతావరణం నెలకొందని, వారు చిన్న రుణాలతో పాటు భారీ రుణాల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. మొండి బకాయిలపైఇప్పటికే ఆర్థిక కార్యదర్శి హష్ముఖ్ అధియా, బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక మంత్రిత్వశాఖ సీనియర్ అధికారిని ప్యానెల్ ప్రశ్నించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల బోర్డు మీటింగ్ వివరాలు, పెద్ద రుణాలకు ఆమోదాలతో సహా పలు డాక్యుమెంట్లను ఇవ్వాలని కూడా ప్యానెల్ సభ్యులు కోరారు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు రూ.8.9 లక్షల కోట్లకు చేరాయి. 2017 డిసెంబర్ ముగింపు నాటితో పోలిస్తే మొత్తం విలువ 10.11శాతం పెరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) రూ.7.7 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకుల్లో మోసాల సంఖ్య పెరగడం కూడా తీవ్రం ఆందోళన కలిగిస్తోంది.

Comments

comments