Home జాతీయ వార్తలు అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్లు

అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్లు

Rahul-Gandhi

జయపూర్ (ఒడిశా) : తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి పోరాడతామని, స్త్రీలపై అకృత్యాలను ఎంతమాత్రం సహించబోమని, వారికి సత్వర న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒడిశాలో తమ పార్టీకి అధికారమిస్తే ఇంజనీరింగ్ అయినా, మెడికల్ లేదా మరే కోర్సు చదివినా… మహిళలందరికీ ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. ‘మహిళలకు సాధికారికత రావాలంటే రాష్ట్రాల శాసనసభల్లో, లోక్‌సభలో వారికి రిజర్వేషన్లు కల్పించడం చాలా అవసరం. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా పట్టుదలతో ఉంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. ఒడిశా కోరాపుట్ జిల్లా జయపూర్‌లో జరిగిన మహిళా సదస్సులో రాహుల్ వారితో మాట్లాడారు. పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు వారికి గణనీయంగా మేలు చేశాయని, అయితే ఒడిశా వంటి రాష్ట్రాల్లో మహిళామంత్రులు అతి తక్కువగా ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు.
బడాబాబులకు రూ. 3.5 లక్షల కోట్ల రుణ మాఫీ
ప్రధాని నరేంద్రమోడీ పేద రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు. రైతులకు రోజుకు కేవలం రూ. 3.50 ఇచ్చి, 1520 మంది పారిశ్రామికవేత్తలకు 3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారని ఆరోపించారు. కేంద్రం ప్రారంభించిన పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయలు ఇవ్వడం వారిని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు విరుచుకుపడ్డారు. గిరిజనులు ఎక్కువగా ఉండే కోరాపుట్ జిల్లాలో జరిగిన ర్యాలీలో రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాఫెల్ ఒప్పందం గురించి మాట్లాడుతూ రాహుల్…జెట్ ఫైటర్ ఒప్పందం విషయంలో ప్రధాని స్వయంగా ఓ కొత్త కాంట్రాక్ట్ తయారుచేసి, సమాంతర చర్చలు జరిపారని తెలిపారు.

Rahul Gandhi Speech At Public Meeting In Odisha