ముంబయి: బుల్లితెర నటీ ప్రత్యూష బెనర్జీ బలవన్మరణం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఓ సస్సెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ, రోజుకో ట్వీస్టుతో సాగుతోంది. అయితే ఆమె మృతికి పరోక్షంగా కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం బాత్ రూమ్‌లోకి చొరబడి అందులోని కిటికీలోంచి దూకి చనిపోతానని బెదిరించాడు. ప్రత్యూష మృతి తర్వాత రాహుల్‌పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అతడు ఈ నెల 3 నుంచి శ్రీ సాయి ఆస్పత్రిలో చేరి మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడు. అయితే, శుక్రవారం అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి దాదాపు రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాహుల్ బాత్ రూంలోకి దూరి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించడంతో చివరకు వైద్యులు అతడిని బ్రతిమాలి బయటకు రప్పించారు. అనంతరం కొంత కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.