Search
Thursday 18 October 2018
  • :
  • :

మోడీపై విచారణ చేపట్టాలి…

Rahul's demand for Rafale Agreement

రాఫెల్ ఒప్పందంపై రాహుల్ డిమాండ్,  అంబానీ జేబులో 30 వేల కోట్లు వేసిన ప్రధాని, దసాల్ట్ ఏవియేషన్‌పై ఒత్తిడి వల్లే రిలయన్స్ ఎంపిక,  526 కోట్ల విమానం 1,670 కోట్లకు కొనుగోలు.

న్యూఢిల్లీ : రాఫెల్ జెట్స్ కొనుగోలు ఒప్పందంలో నరేంద్ర మోడీ పాత్రపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోడీ అవినీతిపరుడని, 36 యుద్ధ విమానాలు కొనాలనే ఒప్పందం ద్వారా అనిల్ అంబానీ జేబులో 30 వేల కోట్లు మోడీ వేశారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ భారత్‌లో సహ భాగస్వామిగా అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ని ఎంచుకుందని ఫ్రాన్స్ పత్రికల్లో వార్తలు రావడంతో, ఈ వ్యవహారంలో మోడీ పాత్రపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ డిమాండ్ చేశారు. తన ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాలను మాత్రం ఆయన చూపించలేదు. మరోవైపు రిలయన్స్ డిఫెన్స్‌ని దసాల్ట్ ఏవియేషన్ ఎంచుకోవడంలో తమ పాత్రలేదని భారత్ ప్రభుత్వం వాదిస్తోంది. తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రక్షణ మంత్రి అకస్మాత్తుగా ఫ్రాన్స్ ఎందుకు వెళ్లారని, అంత అత్యవసం ఏమిటని మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నిజానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అవినీతిపరుడని ఆయన ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని మోడీ అధికారంలోకి వచ్చారని, కాని మోడీ అవినీతికి పాల్పడినారని ఈ దేశంలోని యువతకు చెప్పదలచుకున్నానని రాహుల్ అన్నారు.

దసాల్ట్ ఏవియేషన్‌పై ఒత్తిడి తేవడం వల్ల దాని భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ని ఎంచుకుందని ఫ్రాన్స్‌లోని ఇన్‌వెస్ట్‌గేటివ్ పబ్లికేషన్ మీడియాపార్ట్ మంగళవారం ఓ వార్త రాసింది. అయితే తాము ఎవరి ఒత్తడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయించి రిలయన్స్ డిఫెన్స్‌ని ఎంచుకున్నామని దసాల్ట్ ప్రకటించింది. రాఫెల్ ఒప్పందకాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఫ్రాంకోయిస్ హాలెండి, దసాల్ట్ స్వతంత్రంగా భాగస్వామిని ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదని , భారత్ ప్రభుత్వం రిలయన్స్ డిఫెన్స్ పేరుని సూచించిందని గత నెల ఫ్రెంచ్ మీడియాపార్ట్ రాసింది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో యుద్ధ విమానాన్ని 1,670 కోట్లకు భారత్ కొనుగోలు చేయాలి. నిజానికి ఈ విమానం విలువ 526 కోట్లు మాత్రమేనని, ఈ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిజానికి రాఫెల్ ఒప్పందం జరగడానికి కేవలం 12 రోజుల ముందు 2015లో రిలయన్స్ డిఫెన్స్‌ని అంబానీ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ తెలిపింది. ఈ ఒప్పందం సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌ని ఎందుకు భాగస్వామిని చేయలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే ఈ ఆరోపణని రిలయన్స్ డిఫెన్స్ తోసిపుచ్చింది.

మరోవైపు రాఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, భారత భద్రతని ఎగతాళి చేస్తున్నారని బిజెపి ఆరోపించింది. 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రక్షణ ఒప్పందంలో భారీగా అవినీతికి పాల్పడిందని బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. అంతేకాకుండా భారత రక్షణని ప్రమాదంలో పడేసిందని పాత్ర ఆరోపించారు. రాఫెల్ ఒప్పందం గొప్ప మలుపు అని ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవ అంటున్నారని, రాహుల్ దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారని, ఎవరి మాటలు నిజమో ప్రజలే నిర్ణయిస్తారని బిజెపి ప్రతినిధి పాత్ర అన్నారు.

Rahul’s demand for Rafale Agreement

Comments

comments