Search
Saturday 17 November 2018
  • :
  • :

220 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్…

 Railway Green signal to build railway flyover with 220 crore
వికారాబాద్ జిల్లా: ప్రతిపాదనలో ఉన్న వికారాబాద్, మంజూరైన పాత తాండూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు రూ.210 కోట్లు వెచ్చించేందుకు రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ నుంచి 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇప్పిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ స్పష్టం చేశారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉండగా పియూష్ గోయెల్‌ను కలిసి ప్రతిపాదనలు అందజేశారు. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే ప్రధాన రహదారిపై చాలా కాలంగా ఫ్లైవర్ ఓవర్ బ్రిడ్జీ నిర్మించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్, మన్మాడ్, షిరిడీ, బీదర్, జహీరాబాద్ వైపు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఫ్లైఓవర్ లేనందున రైలు వెళ్లేంత వరకు వికారాబాద్, తాండూరు రాకపోకలు సాగించే వాహనాలకు ఆటంకం ఏర్పడుతోంది. గతంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హయాంలో ప్రతిపాదనలు పంపించినా బడ్జెట్‌లో పొందుపర్చలేదు. రోడ్లు భవనాలశాఖ అధికారుల రూపొందించిన అంచనా ప్రతిపాదనల మేరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.110 కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం, భూసేకరణకు భారీ వ్యయం అవుతుంది. అందులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చితే కేంద్రం నుంచి మిగిలిన నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు. ఇలా ఉండగా పాత తాండూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీకి మాత్రం రెండేళ్ల క్రితమే కేంద్రం నిధులు మంజూరు చేసింది.

వికారాబాద్ నుంచి ముంబయి, బెంగుళూరు, తిరుపతి వంటి దూర ప్రాంతాలకు వెళ్లే రైలుమార్గం తాండూరు మీదుగా వెళుతుంది. బస్‌స్టేషన్ నుంచి మహబూబ్‌నగర్ మార్గంలో 15 ఏళ్ల క్రితమే ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జీ నిర్మించారు. ప్రస్తుతం పాత తాండూరు ప్రాంతంలో కూడా రైల్వే క్రాసింగ్ ఉంది. పెద్ద రైలు మార్గం అయినందున ప్రతి 10 నిముషాలకు ఒకసారి రైల్వేగేటు వేస్తారు. దానివల్ల వాహనదారులు నిత్యం అసౌకర్యానికి గురవుతున్నారు. రూ.25 కోట్లతో పాత తాండూరుకు ఫ్లై ఓవర్ నిర్మిస్తామని 2009లో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అది నెరవేరలేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పాత తాండూరు రైల్వే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ.51 కోట్ల అంచనా ప్రతిపాదనలు రూపొందించారు.

2016లో రాష్ట్రంలోని పలు ఆర్‌ఓబి, ఆర్‌యుబిల నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంటు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో పాత తాండూరుకు రూ.51 కోట్లకు సంసిద్ధత తెలిపింది. అప్పట్లో ఖాజీపేట వద్ద అండర్ బ్రిడ్జీ, జహీరాబాద్, ఆదిలాబాద్, మన్యంకొండ, పెద్దపల్లి వద్ద కూడా బ్రిడ్జీలకు మోక్షం లభించింది. అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల కేంద్రం నుంచి వాటా లభించక పనులు చేపట్టలేకపోయారు. ప్రస్తుతం వాటి నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. పాత తాండూరులో ఫ్లై ఓవర్ నిర్మించాలంటే స్థానికులు భారీగా ఆస్తులు కోల్పోనున్నారు. వారికి పునరావసం, నష్టపరిహారం కల్పించి ఫ్లై ఓవర్ నిర్మించాలంటే రూ.110 కోట్ల ప్రతిపాదనలు రూపొందించింది. అందులో సగం వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు నిధులు ఇప్పించాలని పియూష్ గోయెల్‌కు మంత్రి మహేందర్ లేఖ అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన రైల్వేమంత్రి వచ్చే బడ్జెట్‌లో కేటాయింపునకు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Comments

comments