Home తాజా వార్తలు మేఘ బీభత్సం

మేఘ బీభత్సం

Rain Fall In Hyderabad today

మన తెలంగాణ/హైదరాబాద్‌సిటీబ్యూరో : ఈదురుగాలులతో కూడిన భారీవర్షం మరోమారు నగరాన్ని వణికించింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిన నగరం తరువాత కురిసిన భారీ వర్ష బీభత్సానికి నగరం అతలాకుతలమయ్యింది. గురువారం మధ్యాహ్నం 3.40గంటలకే నగరంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. వేగంగా ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన శబ్దాలు రావడంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరం పూర్తిగా అంధకారంగా మారింది. ప్రధాన రహదారులపై నీరు ప్రవహించడం తో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మొత్తానికి నగరంలో కురిసిన అకాల వర్షం నగరాన్ని ముంచెత్తింది. ఉస్మాన్‌గంజ్‌లో విద్యు త్ తీగ లు తెగిపడి, విద్యుదాఘాతంతో జియాగూడ కు చెందిన సాదిక్ ఖాజిమ్(45)అనే  వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.

దక్షిణ కర్ణాటక నుంచి తమిళనా డు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, మెహిదీపట్నం, మోండా మార్కెట్, ప్యాట్నీ, బేగంపేట్, అడ్డగుట్ట, తిరుమలగిరి,అప్జల్‌గంజ్, కర్మాన్‌ఘాట్, మల్కాజిగిరి, లక్డీకాపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, బోరబండ, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, కోఠి, ఆర్టీసీ క్రాసురోడ్డు, మియాపూర్, కూకట్‌పల్లి, కొండాపూర్, అంబర్‌పేట్, ఉప్పల్, హైటెక్‌సిటీ, పాతబస్తీ, చంపాపేట్,కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లిలతో పాటు తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిలిచిన విద్యుత్ సరఫరా…. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, కోఠి, సుల్తాన్‌బజార్, ముషీరాబాద్, నాంపల్లి, ముషీరాబాద్,అంబర్‌పేట్, కూకట్‌పల్లి, ఉప్పల్, చర్లపల్లి పారిశ్రామిక వాడల్లోనికి పలు ప్రాంతాలతో పాటు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అనేక ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు నగరంలో అంధకారం నెలకొంది.
భారీగా ట్రాఫిక్‌జామ్…. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు,విద్యుత్ స్థంబాలు విరిడిపడి భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. రోడ్లపైనే చెట్లు పడటంతో పలు రహదారుల దారి మళ్లించారు. లక్డీకాపూల్ నుంచి ఇందిరాపార్కు వచ్చే తెలుగుతల్లి ప్లై ఓవర్ సుమారు 2గంటల పాటు మూసివేశారు. దీంతో సచివాలయం, లిబర్టీ, హిమాయత్‌నగర్‌వైపు ఒక్కసారిగా వాహనాలు రావడంతో గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఇంతేకాకుండా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, ఖైరతాబాద్, పోలీస్‌లైన్, ప్యారడైస్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్‌లతో పాటు తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
జలమయమైన రహదారులు…. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల నగర రహదారులు జలమయమయ్యాయి. మ్యాన్‌హోల్స్‌ల్లోంచి నీరు వెళ్లకపోవడంతో గంటల తరబడి రోడ్లపైనే నీరు నిలిచింది. దీంతో వర్షం తగ్గినప్పటికీ రోడ్లపై నీరు వెళ్లేంత వరకు గంటల తరబడి రోడ్ల పక్కన నిలుచోవాల్సి వచ్చింది. వెంటనే స్పందించిన బల్దియా, జలమండలి, విద్యుత్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.