Thursday, April 25, 2024

తెలంగాణకు వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Rain

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా శుక్ర(మార్చి 6), శనివారాల్లో నల్గొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ, వరంగల్ పట్టణం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం నాడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. అకాల వర్షాలతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్‌లోని కందుల కొనుగోలు కేంద్రంలో కందులు తడిసిపోయాయి. గత నాలుగు రోజులుగా కొనుగోలు చేసిన దాదాపు ఐదు వేల కందుల బస్తాలను సకాలంలో ఎగుమతి చేయలేకపోయారు. మార్కెట్ యార్డ్‌లో ఓపెన్ ప్లేస్‌లో భద్రపర్చారు. దీంతో అవి తడిసి ముద్దయ్యాయి. పలువురు రైతులు విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకొచ్చిన కందులు కూడా తడిసి ముద్దయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కందులు తడిసిపోయాయని రైతులు చెబుతున్నారు. నాణ్యత దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.

Rain forecast for Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News