Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జడ్చర్లను కరుణించని వరుణుడు

Jadcharla-rainమహబూబ్‌నగర్: ఆరుగాలం ఎండనక వాననక కష్టించి నేలనే నమ్ముకుని పంటలను సాగుచే రైతులు వర్షాలు లేక పంటలు సాగు చేయలేక ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఇతర మండలాలలో కొంతవరకు వర్షాలు కురుస్తున్నా జడ్చర్ల మండలంలో మాత్రం వర్షాలు కురవటం లేదు. వరుణదేవుడు కరుణించక పోవడంతో అన్నదాతలు విలవిల లాడుతున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులకు ఈ ఖరీఫ్‌లో వర్షాలు పూర్తిగా కనుమరుగవడంతో పంటలు లేక ఇతర పనులు చేయక రైతులు దిక్కుతోచని స్థితిలో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు కురవడంతో రైతులందరు మెట్ట పంటలైన మొక్కజొన్న, జొన్న, పత్తి తదితర పంటలను సాగుచేశారు. కాని మరల వర్షాలు కురవక పోవడంతో విత్తిన విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలకెత్తిన మొలకలు నీటి తడి లేక అవి ఎండి పోయాయి. అదే విధంగా కొంత ఆలస్యంగా వేసిన పంటలు కొంత వరకు పూత వచ్చే దశలో వర్షాలు రాక అవి కూడా ఎండి పోతున్నాయి. దీంతో సాగుకోసం అప్పులు తీసుకు వచ్చి పంటలపై వెచ్చించిన రైతులకు అప్పులు పెను భారంగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పుల బాధలు భరించని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పంట పొలాల్లో పంటచేలు లేక బీళ్లు దర్శన మిస్తున్నాయి. ఇటువంటి దుస్థితి ఎన్నడు చూడ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో సాధరణంగా వర్షపాతం మే నెలలో 25మిల్లీలీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 4.4మి.మీ మాత్రమే కురిసింది. జూన్‌లో 87మిల్లీ లీటర్లకు గాను 57.2 వర్షం కురవగా జూలైలో 133మిల్లీలీటర్లకు గాను 18.6 వర్షం కురిసింది. ఆగష్టులో 118కు గాను 87మిల్లీలీటర్ల వర్షం పడింది. వర్షాకాలంలో కురవాల్సిన వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోకుండా నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తుంది.

Comments

comments