Home తాజా వార్తలు ఆ ప్రాంతాల్లో 4గంటల వరకే పోలింగ్

ఆ ప్రాంతాల్లో 4గంటల వరకే పోలింగ్

EC Rajat Kumar

 

హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో ఓటర్ వెరిఫికేషన్ వ్యవస్థను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజత్ కుమార్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రేపు ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటరుగుర్తింపు కార్డులు లేని వారి కోసం సహాయకేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అందరికీ ఎపిక్ కార్డులు అందించామని, ఓటు వేయడానికి నిర్దేశించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఓటరు తమ హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని, దివ్యాంగులు ఓటు వేసేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వరకు వారికి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని.. వీల్ ఛైర్లు, రెయిలింగ్స్, ర్యాంప్ లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు.

మావోయిస్టు ప్రభావిత  నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరుగుతుందని, ఆ నియోజకవర్గాల్లో ఓటేసేవాళ్లు సాయంత్రం 4 వరకు పోలింగ్ బూత్‌కు చేరుకోవాలని సూచించారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో నిలుచున్న వాళ్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని..ఆ తర్వాత పోలింగ్ బూత్‌కు వచ్చేవాళ్లను ఓటు హక్కు వినియోగించు కోవడానికి అనుమతించరని ఆయన తెలిపారు. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని, 5 దాటిన తర్వాత పోలింగ్ బూత్‌కు చేరుకునేవాళ్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

rajat kumar press meet at secretariat