Home తాజా వార్తలు విమానం ట్యాంపర్ అయితే.. ఎడ్ల బండిలో పోతామా?: రజత్‌కుమార్

విమానం ట్యాంపర్ అయితే.. ఎడ్ల బండిలో పోతామా?: రజత్‌కుమార్

Rajat Kumar

 

ఇవిఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు అసంబద్ధం
సిఇఒ రజత్‌కుమార్
హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇవిఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్)లే వినియోగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ట్యాంపరింగ్‌పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. విమానంలో ఏదో ట్యాంపరింగ్ అయిందని విదేశాలకు వెళ్లేవారు ఎడ్ల బండిలో వెళ్ళరు కదా అని ఆయన ప్రశ్నించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఓటర్ల అవగాహన కేంద్రాన్ని సోమవారం సిఇఒ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇవిఎంలపై ఆరోపణలు చేసేవారు కోర్టుల్లో ఎందుకు ఎన్నికల పిటిషన్ వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇవిఎంలపై 38 సార్లు కోర్టుకు వెళ్లారని, అయినా నిరూపించలేకపోయారన్నారు.

ఇవిఎంలపై సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందన్నారు. మన రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొన్ని పార్టీల నేతలు ఇలానే మాట్లాడారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయొద్దని ఆయన కోరారు. ట్యాపరింగ్ అనుమానాలు, ఆరోపణలతోనే వివిప్యాట్ విధానం అమలులోకి తెచ్చారన్నారు. అయినా కొన్ని పార్టీలు తిరిగి బ్యాలెట్ పేపర్ కావాలంటున్నాయన్నారు. ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడమేనన్నారు. ఇటువంటి డిమాండ్లతో దేశం తిరోగమన దిశలోకి వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇసిఐఎల్‌లో పని చేసానని చెప్పుకున్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని, అతను నిజంగా పని చేసి ఉంటే ఇక్కడే ఎందుకు చెప్పలేదని సిఇఒ ప్రశ్నించారు. అయినా దీనిపై ఇసిఐఎల్ సంస్థ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టతనిచ్చాయని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సాహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఇవిఎంలపై మరింత అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Rajat Kumar Responds on EVMs Tampering