Home తాజా వార్తలు కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రాజీవ్‌శర్మ భేటీ

కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రాజీవ్‌శర్మ భేటీ

Rajiv Sharma meeting with Central Election Commission

అటార్నీ జనరల్ వేణుగోపాల్‌నూ కలిసిన ముఖ్యసలహాదారు

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభు త్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రత్యే క ప్రతినిధి కెఎం సహాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన అనంతరం చోటుచేసుకున్న మార్పుల గురించి ప్రస్తావించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం ఇచ్చిన లేఖలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఏడు మండలాలను, కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన అనంతరం ఇక్కడి మూడు ఎస్‌టి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తగ్గిన గ్రామాలు, ఓటర్ల సంఖ్యతో పాటు భౌగోళిక హద్దుల్లో వచ్చిన మార్పులను ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే అంశంలో కూడా పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాన్ని, రాజ్యాంగ సవరణ అవసరమయ్యే లీగల్ అంశాల గురించి కూడా చర్చించినట్లు తెలిసింది.

ఇదే సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శితో కూడి ఈ ఇరువురూ భేటీ అయ్యి విస్తృతంగా చర్చించారు. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన జమిలి ఎన్నికలు, ‘ముందస్తు’ ఎన్నికలు అంశాలపై కూడా ఈ ముగ్గురితో ప్రస్తావించినట్లు తెలిసింది. సాంకేతికపరంగా తెలంగాణకు సంబంధించి ఉత్పన్నమయ్యే అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. తెలంగాణ యువత ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన జోనల్ వ్యవస్థకు సంబంధించిన ఫైల్ కూడా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నందున దానిపైన కూడా లీగల్ అంశాలను న్యాయశాఖ కార్యదర్శితో చర్చించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లడానికి ముందు ఈ ఇద్దరు ప్రతినిధులు కేంద్ర అధికారులతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ‘ముందస్తు’ అసెంబ్లీ ఎన్నికలే అనివార్యమైతే ఎదురయ్యే సాంకేతిక చిక్కులతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో కేంద్ర ఎన్నికల కమిషనర్ నుంచి వివరాలు తీసుకున్నట్లు సమాచారం.