Search
Wednesday 21 November 2018
  • :
  • :

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేడే టిఆర్ఎస్ ఓట్ల కీలకం

Rajya Sabha deputy chairman election is key to TRS votes

ఎన్‌డిఎ అభ్యర్థి హరివంశ్, యుపిఎ తరపు హరిప్రసాద్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీ, మొత్తం సభ్యులు 245 మంది
సాధారణ మెజారిటీ 123, విజయంపై ఇరువర్గాల ధీమా
అత్యంత కీలకం కానున్న బిజెడి, టిఆర్‌ఎస్ ఎంపిల మద్దతు
బిజెడికి 9 మంది , టిఆర్‌ఎస్‌కు ఆరుగురు సభ్యులు 

మన తెలంగాణ/ న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి గురువారం జరుగనున్న ఎన్నిక రసవత్తరంగా మారిం ది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ఏర్పడే అవగాహనలకు ఈ ఎన్నిక పరోక్ష సంకేతాలు ఇవ్వనుంది. ఎన్‌డిఎ తరఫున జనతాదళ్ (యునైటెడ్ )కు చెందిన హరివంశ్ నారాయణ్ పోటీచేస్తుండగా ప్రతిపక్షాల తరఫున కాంగ్రెస్ పార్టీ ఎంపి బికె హరిప్రసాద్ బరిలోకి దిగారు. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో గెలుపొందడానికి 123 సభ్యులు మద్దతు అవసరం. తొలుత ప్రతిపక్షాల కూటమికి అనుకూలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, మారిన సమీకరణల నేపథ్యం లో ఎన్‌డిఎ అభ్యర్థి హరివంశ్ గెలుపొందడం దాదాపు లాంఛనమే కానుంది. ఈ కూటమికి బిజెడి సభ్యులను కలిపితే 125 మంది ఎంపిల బలం ఉంది. గురువారం రాజ్యసభ ప్రారంభం కాగానే కొన్ని ప్రభుత్వ పత్రాలు, స్థాయీ సంఘాల నివేదికలు సభ ముందుంచుతారు.

ఆ వెన్వెంటనే డిప్యూటీ చైర్మెన్ ఎన్నికను చేపడతారు. ఇద్దరు అభ్యర్థుల తరుపున తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇం దులో ఎన్‌డిఎ అభ్యర్థి హరివంశ్‌ను సమర్థిస్తూ బిజెపి అధ్యక్షులు అమిత్‌షా సహా, శివసేన, అకాళీదళ్, జెడి(యు) ఎంపిలు నాలుగు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టనుండగా, వాటిని ఎఐడిఎంకె, ఆర్‌పిఐ (అథవాలే) సభ్యులు మద్దతివ్వనున్నారు. దీంతో బిజెపిపై అసంతృప్తిగా ఉన్న శివసేన, అకాళీదళ్‌ల ఓటింగ్‌లో పాల్గొంటాయా? లేదా? అనే అనుమానాలకు తెరపడినట్లయింది. మరోవైపు ప్రతిపక్షాల అభ్య ర్థి హరిప్రసాద్‌కు మద్దతుగా ఐదు తీర్మానాలను సభ ముందు ప్రతిపాదిస్తారు. కాంగ్రెస్, బిఎస్‌పి, ఆర్‌జెడి, ఎస్‌పి, ఎన్‌సిపిలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నాయి. ఆర్‌జెడి ఎంపి మీసా భారతి ప్రవేశపెట్టే తీర్మానానికి టిడిపి ఎంపి వై.ఎస్.చౌదరి సమర్థించనున్నారు. అనంతరం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు.

బిజెడి, టిఆర్‌ఎస్‌లే కీలకం : ఈ ఎన్నికలో బిజెడి, టిఆర్‌ఎస్ పార్టీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. మంగళవారం రాత్రి వరకు ప్రతిపక్షాల తరఫున ఎన్‌సిపి ఎంపి వం దన చవాన్ పోటీ చేస్తారని భావించినప్పటికీ, బుధవారం నాటకీయ పరిణామాల మధ్య కర్నాటకకు చెందిన హరిప్రసాద్ ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. బిజెడి మద్దతు లభించే అవకాశాలు లేకపోవడంతో పోటీ చేయడం అనవసరమని ఎన్‌సిపి నేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారని ఆ పార్టీ ఎంపిలు వ్యాఖ్యానించారు. దాంతో చివరి నిమిషంలో హరిప్రసాద్ పేరును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖరారు చేసిందని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం బిజెడి నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, టిఆర్‌ఎస్ నేత, తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్‌లతో టెలిఫోన్‌లో మాట్లాడి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరిన విషయం తెలిసిందే. రాజ్యసభలో బిజెడికి తొమ్మిది మంది ఎంపిలు, టిఆర్‌ఎస్‌కు ఆరుగురు ఎంపిలు వున్నారు. ఇప్పటికే 13 మంది ఎంపిలు ఉన్న అన్నాడిఎంకె ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇద్దరు సభ్యులు ఉన్న పిడిపి ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. పిడిపి ఎవరికి మద్దతిస్తుందనే అంశంపై జమ్మూ కాశీర్మ్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా(ఎన్‌సి), మహబూబాబ ముఫ్తీ(పిడిపి)ల మధ్య జోరుగా ట్విట్టర్ వార్ సాగింది.

డిఎంకె నేత కరుణానిధి మరణంతో ఆ పార్టీ ఎంపిలు నలుగురు ఎన్నికలో పాల్గొనడానికి వస్తారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ప్రతిపక్షాల అభ్యర్ధికి యూపిఏతో పాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం, సిపిఎం(5), సిపిఐ(2), బిఎస్‌పి(4), జెడి(ఎస్)(1),కెసి(ఎం)(1),ఐయుఎంఎల్ (1),ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దత్తు లభించనుంది. ఇద్దరు సభ్యులు ఉన్న వైసిపి కూడా ప్రతిపక్ష అభ్యర్థికే తమ ఓటు అని చెబుతోంది.అయితే ఒక్కొక్క ఎంపి వున్న ఆపార్టీల మద్దతు కూడగట్టాడానికి ఎన్‌డిఏ, ప్రతిపక్షాలు తమతమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.బిజెడి తన మద్దతు ఎవరికో అధికారికంగా ప్రకటించనప్పటికీ జెడి(యు)కే ఓ టేసే అవకాశం ఉంది. ఒకవేళ బిజెడి ఓటింగ్‌కు ఉంటే మాత్రం ఎన్నిక పోటాపోటీ అయ్యే అవకాశం ఉంది.

రాజ్యసభలో బలాబలాలు :
బిజెపి : 73, కాంగ్రెస్ : 50, అన్నాడిఎంకె : 13, తృణమూల్ కాంగ్రెస్ : 13, సమాజ్‌వాదీ : 13, బిజెడి : 9, ఇండిపెండెంట్లు : 4, జెడియు : 6, టిఆర్‌ఎస్ : 6, తెలుగుదేశం : 6, డిఎంకె : 4, బిఎస్‌పి : 4, ఎన్‌సిపి : 4, నామినేటెడ్ : 4, ఆర్‌జెడి : 5, సిపిఎం : 5, శివసేన : 3, అకాలీదళ్ : 3, ఆమ్ ఆద్మీ పార్టీ : 3, వైఎస్సార్‌సిపి : 2, సిపిఐ : 2, పిడిపి : 2, జెడిఎస్ : 1, కేరళ కాంగ్రెస్(ఎం) : 1, ఐఎన్‌ఎల్‌డి : 1, ఐయుఎంఎల్ : 1, బిపిఎఫ్ : 1, ఎస్‌డిఎఫ్ : 1, ఎన్‌పిఎఫ్ : 1, ఆర్‌పిఐ : 1.

Comments

comments