Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అనుబంధానికి మరో ముడి

  • నేడు రాఖీపౌర్ణమి

సోదర ప్రేమకు ప్రతిరూపం రక్షాబంధన్… సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక…అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య.. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే పండుగ… రాఖీ వచ్చిందంటే ఇల్లంతా సందడే సందడి… చిన్నాపెద్దా తేడాలేకుండా అందరి సంబరమిది… ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంతా దేశవ్యాప్తంగా లక్షలాది మంది జరుపుకుంటారు.. శ్రావణపూర్ణిమ, జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఒడిషాలో ఆవని ఆవిట్టం అని, బిహార్ , మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కజరిపూర్ణిమగా చేసుకుంటారు. గోవా, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రల్లో ఈ పండుగతోనే కొత్త రుతువు ప్రారంభమైనట్లు అక్కడి వారు భావిస్తారు..

Rakhi-Festival

రాఖీ వెనుక అనేక పురాణ గాథలున్నాయి. అన్నాచెల్లెళ్లు మాత్రమే కట్టుకునే రాఖీలను పూర్వం ఓ భార్య భర్తకు కట్టినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. రాక్షసులకు దేవతలకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ పోరులో రాక్షసుల పరాక్రమాన్ని చూసిన దేవేంద్రుడు పిరికిపందయై యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంద్రుని భార్య శచీదేవి తన భర్త విజయాన్ని కోరుతూ విష్ణువును పూజించి, ఓ దారాన్ని ఇంద్రుని చేతికి కడుతుంది. ఇంద్రుడు విజయం సాధిస్తాడు. అంతేకాకుండా చరిత్రలో అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముని తన సోదరుడిగా భావించి రాఖీ కట్టినట్లు తెలుస్తోంది. ఇలా చాలా కథలున్నాయి. బ్రిటన్, కెనడా,నేపాల్ తదితర దేశాల్లో కూడా రాఖీ జరుపుకుంటున్నారు.

బంగారం, వెండి, ముత్యాలు, సిల్క్ దారం, పేపర్ క్విల్లింగ్‌లతో తయారుచేసిన రాఖీలు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. వారివారి తాహతును బట్టి అన్నదమ్ముల చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతుంటారు. రకరకాల మిఠాయిలను తయారుచేసి తినిపిస్తుంటారు. దూరంగా ఉన్నవారికి ఆన్‌లైన్ ద్వారా రాఖీలను పంపుతున్నారు. రాఖీలు కట్టించుకున్న సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తోంది.

Comments

comments