Home సినిమా ‘దేవ్’ సక్సెసే నాకు ‘వాలంటైన్స్ డే’ సెలబ్రేషన్స్

‘దేవ్’ సక్సెసే నాకు ‘వాలంటైన్స్ డే’ సెలబ్రేషన్స్

కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవ్’. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌తో ఇంటర్వూ విశేషాలు…
మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తా…
‘దేవ్’ చిత్రంలో నేను మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తాను. చాలా మొండి పట్టుదల గల అమ్మాయి పాత్రలో నటించాను. ఇది కఠినమైన పాత్ర అని చెప్పాలి. కానీ నా పరిధిలో నేను ఈ పాత్రలో మెరుగ్గా నటించేందుకు ప్రయత్నించాను.
అతనితో రెండో చిత్రమిది…
కార్తీ అద్భుతమైన నటుడు. అతనితో కలిసి నటించిన రెండో చిత్రమిది. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక కార్తీ ఎప్పుడూ తోటి నటీనటులను బాగా ప్రోత్సహిస్తారు. అతనితో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది.
చివరికి వాలంటైన్స్ డే రోజున…
మా షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ చేసుకుంటూ వెళ్లాం. రిలీజ్ డేట్ కూడా ముందే అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి వాలంటైన్స్ డే రోజున ‘దేవ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ రోజున అమ్మానాన్నలతోనే…
ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ‘దేవ్’ సక్సెసే నాకు ‘వాలంటైన్స్ డే’ సెలబ్రేషన్స్. అయితే ఈసారి వాలంటైన్స్ డే రోజున మా అమ్మానాన్నలతోనే ఉంటాను.
చాలా బిజీగా ఉన్నా…
గత ఏడాది నాకు తెలుగులో అవకాశాలు రాలేదని… నాకు ఇక సినిమాలు లేవని వచ్చిన వార్తలను నేను కూడా చదివాను. నిజానికి నేను మూడు తమిళ్ సినిమాలు, రెండు హిందీ సినిమాలు చేస్తున్నాను. వాటి షూటింగ్‌లలో చాలా బిజీగా ఉన్నాను. ఆ ఐదు సినిమాలు ఈ ఏడాదిలోనే వరుసగా విడుదలవుతాయి.
తదుపరి చిత్రాలు…
క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీ మామ’లో నేను హీరోయిన్‌గా చేయనుండడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో మంచి పాత్రలో కనిపిస్తాను. ‘వెంకీ మామ’ షూటింగ్ నెక్స్ వీక్ నుంచి ఉంటుంది. అలాగే వచ్చే వారం నుండి నా కొత్త హిందీ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది.

 Rakul Preet Singh Interview