Home సినిమా ‘సైరా ‘చరిత్ర సృష్టిస్తుంది

‘సైరా ‘చరిత్ర సృష్టిస్తుంది

Ram Charan Shocking Decision About Syra Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పిస్తున్న చిత్రమిది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ ప్రధాన తారాగణంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బుధవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. చిరంజీవి తల్లి అంజనాదేవి, ఆయన భార్య సురేఖ కలిసి ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అంజనాదేవి మాట్లాడుతూ “సినిమా టీజర్ అదిరిపోయింది. చాలా బావుంది”అని అన్నారు. చిత్ర సమర్పకురాలు సురేఖ కొణిదెల మాట్లాడుతూ “సైరా చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు”అని తెలిపారు. చిత్ర నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ “12 ఏళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ ఈ కథను మా నాన్నకు చెప్పారు. చివరికి సైరా సినిమా ఇప్పుడు ఓకే అయి సెట్స్‌పైకి వచ్చింది.

పరుచూరి సోదరుల వల్ల ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు సూరితో ధృవ చిత్రం నుండి ప్రయాణిస్తున్నాను. ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. అమిత్ త్రివేది మ్యూజిక్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన చిన్న టీజర్‌లోనే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు”అని అన్నారు. చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగు నేల మీద తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకు ముందు ఆయన గురించి నాకు కూడా తెలియదు. ఈ సినిమా కోసం ఏడాది పాటు రీసెర్చ్ చేశాం.చిరంజీవితో ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా చేస్తుండడంతో ఎంతో గర్వంగా ఉంది. చిరంజీవి ఫైట్స్ నుంచి ప్రతి విషయంలోనూ చాలా కష్టపడుతున్నారు. ఆయన డూప్ లేకుండా ఫైట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని చూశాక ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అని అర్థమైంది. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ చరణ్. సినిమా నిర్మాణంలో ఏమాత్రం రాజీపడకుండా సినిమాకు అవసరమైన అన్నింటినీ ఆయన సమకూరుస్తున్నారు. అమిత్ త్రివేది మ్యూజికల్ జీనియస్.

సినిమాకు ఆయన అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేయడం నా అదృష్టం”అని అన్నారు. రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ “మెగాస్టార్ సినిమాకు మాటలు రాస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. ఖైదీ నంబర్ 150 చిత్రానికి పనిచేసిన నేను సైరా సినిమాకు కూడా చేయడంతో నా జీవితం తరించిపోయింది. ఇప్పుడు చూసిన టీజరే ఇలా ఉంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిందే. చిరంజీవి ఈ చిత్రం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడే సినిమా సూపర్ హిట్ అయిపోయింది. చిరంజీవి తల్లిగారు, చరణ్ తల్లిగారు కలిసి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇద్దరు మాతృమూర్తుల ఆశీస్సులతో ఈ సినిమా విడుదల కాబోతోంది. తల్లి ఆశీస్సులకు మించింది ఏదీ లేదు ఈ భూమ్మీద. ఇద్దరు తల్లుల ఆశీస్సులతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుందో మీరు ఊహించుకోండి”అని పేర్కొన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “చిరంజీవి జీవితం, మా జీవితం ఖైదీ అనే సినిమాతో బాగా ముడిపడి ఉంది. అప్పుడే మేము ఒకళ్ల ఇంట ఒకళ్లం, ఒకళ్ల మనస్సులో ఒకళ్లం ఖైదీలైపోయాం.

సాయిమాధవ్ బుర్రా మాటలు చాలా బాగా రాస్తున్నాడు. సురేందర్ రెడ్డిని చరణ్ ఎందుకు ఎంపిక చేసుకున్నాడో సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది”అని చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ “సైరా 30 సెకన్ల టీజర్‌ను చూసి నా బిపి పెరిగిపోయింది. టీజర్‌కే ఇంత ఉంటే రేపు మూడు గంటల సినిమాకు ఇంకెంత బిపి రావాలి? నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి నటన ఆయన కళ్లలోనే ఉంటుంది. ఓ అద్భుతమైన నటుడికి అద్భుతమైన సాంకేతిక నిపుణులు తోడైతే మహాభారత యుద్ధంలో ధర్మరాజు యుద్ధం చేసినట్లే. ఇక్కడ మా ధర్మరాజు రామ్‌చరణే. చిరంజీవి అర్జున్‌డిగా యుద్ధం చేస్తున్నారు. ఆయన గెలిచి తీరుతారు. మేము 356 సినిమాలు రాశాం. మాకు ఆనందాన్ని కలిగించినవి 10, 15 సినిమాలు ఉంటాయి. అయితే ‘సైరా’ సినిమా రాసినందుకు మేము గర్వపడుతున్నాం. ఏదైనా ‘సైరా నరసింహారెడ్డి’ చరిత్ర సృష్టిస్తాడు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఫైట్ మాస్టర్ లీ విట్టేకర్, సుష్మిత తదితరులు పాల్గొన్నారు.

‘సైరా..’ నా తండ్రి కల

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్‌చరణ్. ఈ చిత్రం టీజర్ విడుదలైన సందర్భంగా చరణ్‌తో ఇంటర్వూ విశేషాలు…

సూరి చెప్పిన తర్వాతే…
దర్శకుడు అనే వాడు ఏ కథనైనా హ్యాండిల్ చేయగలడు. నిజం చెప్పాలంటే నా నమ్మకం కన్నా సూరి ఈ ప్రాజెక్టును ‘నేను తీయగలను’ అని చెప్పిన తర్వాతే ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. ‘ధృవ’ చిత్రం చేసిన తర్వాత ఓ రోజు సూరితో పరుచూరి సోదరులను కలవమని… వారివద్ద ఓ మంచి కథ ఉందని చెప్పాను. సూరి ‘సైరా’ కథ విన్నారు. మా నాన్నతో మీరు ఈ సినిమా చేస్తే బావుంటుందనగానే ఏ డైరెక్టర్ అయినా వెంటనే ఓకే అంటాడు. కానీ ఆయన కొంత సమయం తీసుకొని చివరికి ఈ సినిమా చేయడానికి అంగీకరించారు.
ఇది నా అదృష్టం…
సైరా చిత్రానికి ఎంత బడ్జెట్‌ను అని స్పష్టంగా చెప్పలేను కానీ భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైరా 12 సంవత్సరాలుగా నా తండ్రి కల. ఆయన 35 సంవత్సరాల కెరీర్‌లో ఇలాంటి చిత్రంలో నటించలేదు. నేను ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టాను… ఇది ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయంకంటే ఇలాంటి ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.
వేసవిలో విడుదల…
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.
బర్త్‌డే కానుకగా…
మా నాన్న బర్త్‌డే కానుకగా టీజర్‌ను విడుదల చేశాం. ఆయనకు ఓ సర్‌ప్రైజ్‌లాగా ఈ టీజర్ రూపుదిద్దుకుంది. టీజర్‌లో చివరి షాట్ ‘కొదమసింహం’ సినిమాను గుర్తు చేసేలా ఉందని అంటున్నారు. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. అది మా డైరెక్టర్, స్టంట్ మాస్టర్ ఐడియా. ‘కొదమసింహం’ నా ఫేవరేట్ మూవీ. ఆ సినిమా చూసే హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను.
రెండు వారాల్లో థియేటర్లలో టీజర్…
ఒకేసారి నెట్‌తో పాటు థియేటర్లలో టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ జంతు సంరక్షణ శాఖ నుండి అనుమతి రాలేదు. ఇంకో రెండు వారాల్లో వారి దగ్గరి నుండి అనుమతి లభిస్తుంది. రాగానే టీజర్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తాం.
అని రికార్డులు బ్రేక్ చేయాలి…
‘సైరా నరసింహారెడ్డి’ అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల ఇండస్ట్రీకి చాలా లాభం కలుగుతుంది. నిర్మాతగా నాకు ఓ మైల్‌స్టోన్ మూవీ ఇది.