Home తాజా వార్తలు రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణం

రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణం

Ramnath-Kovind

న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. కోవింద్ చేత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్ ప్రమాణస్వీకారం చేయించారు. పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కొత్త ప్రమాణస్వీకారం చేసిన కోవింద్ కు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. అధికార ఎన్డిఎ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన రామ్‌నాథ్‌ విపక్ష అభ్యర్థి మీరాకుమార్‌పై 65.5 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా కోవింద్‌ గుర్తింపు పొందారు.

బాధ్యతలు చేపట్టేముందు జాతిపిత మహాత్మాగాంధీకి కోవింద్ నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ఆయన సతీమణి సవితతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ కోవింద్ దంపతులు మహాత్ముడి స్మారకస్థూపం వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.

Ram Nath Kovind takes oath as a India’s 14th president in Parliament Central Hall.