Home తాజా వార్తలు భవిషత్తు తరాలకు వెలుగు చుక్క

భవిషత్తు తరాలకు వెలుగు చుక్క

 best Nirmal Gram award

నేపథ్యం మాది కరీంనగర్ జిల్లా, కొహెడ మండలం, ఉత్తమ నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు పొందిన రామచంద్రాపురం. అమ్మనాన్నకు ఇద్దరు పిల్లలం చెల్లే నేను. చెల్లెకు పెళ్లి చేశాం. మాకు భూమి లేదు. నాన్న కొంత కాలం ముంబయిలో కూలి పనికి వలస పోయి కుంటుంబాన్ని పోషించాడు. అయినా మాకు ఇబ్బందులు తప్పలేదు. ఇప్పుడు మా ఊర్లో ఉపాధి లేక మేమందరిలాగే బతుకుతెరువు కోసం కరీంనగర్ పట్టాణానికి వలసవచ్చాం . ఇప్పటికీ మా నాన్న వాచ్‌మెన్‌గా, అమ్మ ఇండ్లలో పనులు చేస్తూ నన్ను చదివిస్తున్నారు. నా పీజీ అయిపోయింది. ఇప్పుడు పిహెడ్‌డి ప్రయత్నాల్లో ఉన్నాను.
సేవా కారక్రమాల గురించి.. మా గ్రామం పుట్టి 400 సంవత్సరాలు గడిచింది.మాది దళిత కాలని. ఆ కాలనీలో యువకులం అందరం కలిసి అందరం చైతన్యంగా ఉండాలనే ఉద్దేశంతో “చైతన్య యూత్‌” గా ఏర్పడి తరువాతి కాలంలో అదే సంఘాన్ని “తెలంగాణ యువ శక్తి ”గా ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేశాం. మా ఊరి చరిత్రలో మొట్టమొదటిసారిగా అంబేడ్కర్ 126 వ జయంతి ఉత్సవాలను జరిపాం. లైబ్రరీని స్థాపించినప్పటికీ దాన్ని పూర్తిగా విజయవంతం చేయలేక పోయాం. మా చుట్టుపక్కల గ్రామల్లో మూఢ నమ్మకాల మీద అవగాహన, ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, పరిసరాల శుభ్రత ,బాల్య వివాహాల ను అరికట్టడం, బాల కార్మికుల నిర్మూలన, మద్యపాన నిషేధం, అందరూ చదువుకోవాలి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలా నాకు చిన్నప్పటి నుండే సేవ కార్యక్రమాల పట్ల చాలా ఉత్సాహం, ఆసక్తి ఉండేది. తరువాత ఇంటర్ అయిపోగానే కరీంనగర్ జిల్లాకు చదువుల తల్లి అయిన “ఎస్ ఆర్ ఆర్‌” కాలేజిలో డిగ్రీ చదువుతూ, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ 20 పైగా గ్రామాల్లో క్యాంపెయిన్ చేశాను. గ్రామాల్లో మొక్కలు నాటి ,చెత్త ఊడ్చి, హాస్పిటల్,స్కూల్, వంటి పరిసరాల శుభ్రత గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే వాళ్లం.

రాష్ట్రపతి అవార్డు … ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా… 2015 నవంబర్ 19 న ఎన్‌ఎస్‌ఎస్ ఉత్తమ వాలంటీర్‌గా రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా వ్యక్తిగతం కోసం కాకుండా ప్రకృతిని కాపాడి, కలుషితం లేని మంచి సమాజాన్ని నిర్మించడానికి ఈ అవార్డు నాకు, నా లాంటి యువకులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. 8వ తరగతిలో ఉన్నప్పుడే నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ సభ్యుడిగా చేరాను. 2009 జూన్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ మనోహరాచారి రోల్ మెంట్ కార్యక్రమంలో ఆయన మాటలు నేను స్ఫూర్తి గా తీసుకున్నాను. ఎన్ ఎస్ ఎస్ లో చేరిన తర్వాత నాగాలాండ్ లో జరిగిన ఉత్తర ఈశాన్య రాష్ట్రాల యూత్ ఫెస్టివల్, కర్ణాటకలోని జీజాపూర్ జాతీయ సమైక్యతా శిబిరం, అదే రాష్ట్రంలో దొడ్డ బల్లాపుర లో జరిగిన జాతీయ సమైక్యత శిబిరం, తెలంగాణలో కొండన్న పల్లిలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరాల్లో పాల్గొన్నాను. 201౩ లో పాలమూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ భాగ్యరాజ్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ వాలంటీర్ అవార్డును అందుకున్నాను. అదే సంవత్సరం శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సలహా సభ్యుడిగా నన్ను నియమించారు . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్ జరిగింది. అందులో ఆర్గనైజింగ్ కమిటీ సభుడిగా బాధ్యతలు నిర్వహించాను. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజి స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్ ఉత్తమ వాలంటీర్‌గా బంగారు పథకాన్ని అందుకున్నాను. ఇప్పటికి చాల సార్లు రక్త దానం చేశాను. ఇంకా చాల కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాను.
ఈ పనులన్నీ చేయడానికి నన్ను ప్రోత్సహించి నాకు ఆదర్శంగా నిలిచిన మా గురువులు నారదాసు లక్ష్మణ రావు, డా॥ మనోహరా చారి, డా॥ కల్వకుంట రామకృష్ణ చారి, పొన్నం అనిల్ కుమార్, సిద్ధంవేణు, బివి.రామ కృష్ణారావు వంటి వారు నా కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంటారు.
సమాజం కోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు
ఇప్పడు ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో టిఆర్‌ఎస్వి అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నాను. శాతవాహన యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ సలహాదారుడిగా పనిచేస్తున్నాను. మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలనుకుంటున్నాము.
అవకాశం వస్తే రాజకీయల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేయాలని ఉంది. రైతుల కోసం 2016 లో మా మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేయాలనుకున్నా కాని అప్పుడు అవకాశం రాలేదు. మరోసారి ప్రయత్నిస్తా. ఇంకా తెలంగాణ రాష్ట్రసమితిలో కొనసాగుతున్నా కాబట్టి , రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.