Home జాతీయ వార్తలు పౌర స్పృహ సమాజం

పౌర స్పృహ సమాజం

ram

  గౌరవానికి, మర్యాదకు భంగం కలిగించవద్దు

  దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి కోవింద్ పిలుపు

న్యూఢిల్లీ : ఇతరుల అభిప్రాయాలతో విభేధించవచ్చు కాని, వారి గౌరవానికి, మర్యాదకు భంగం కలిగించని రీతిలో ‘పౌర స్పృహ కలిగిన సమాజం’ ఏర్పడాలని రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన జాతినుద్ధేశించి మొదటి ప్రసంగం చేశారు. ఒక చారిత్రక సందర్భం కలిగిన అభిప్రాయాలను ఎగతాళి చేయకుండా, వారి గౌరవం, హుందాతనాలకు నష్టం కలిగించని విధంగా అభిప్రాయ భేదాలు ఉంటే మంచిదని సూచించారు. బాలీవుడ్ చిత్రం ‘పద్మావత్’పై హింస, ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థలు క్రమశిక్షణ, నైతికంగా  ఉన్నతంగా ఉండే విధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  దేశంలో దారిద్య్రాన్ని సాధ్యమైనంత త్వరలో పారదోలడం మన ముందున్న పవిత్రమైన బాధ్యత అని అన్నారు.  నగరాలు లేదా గ్రామాల్లో  పౌర స్పృహ కలిగిన సమాజం కేవలం పౌర స్పృహ కలిగిన పొరుగువారు ఉన్నప్పుడే ఏర్పడుతుందని రాష్ట్రపతి చెప్పారు.  మన మనం పొరుగువారిని గౌరవించడం, వారి ఏకాంతాన్ని, హక్కులను పరిరక్షించడం ద్వారా ఇది సాధ్యపడుతుందని అన్నారు. రక్తం, స్వేదం ధారపోసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చినవారందరినీ గుర్తు చేసుకోవలసిన రోజు గణతంత్ర దినోత్సవమని రాష్ట్రపతి అన్నారు. మహాత్మగాంధీ నేతృత్వంలో మిలియన్ల మంది ప్రజలు చేసిన పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సైనికులు, వైద్యులు, రైతులు, నర్సులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు… ఇలా ప్రతి ఒక్కరూ దేశానికి తమ తమ మార్గాల్లో సేవలందిస్తున్నారన్నారు. అదేవిధంగా తల్లులను కూడా ఆయన ప్రశంసించారు. దేశమంటే మనుషులని, వారే దేశానికి అత్యున్నత భాగస్వాములని పేర్కొన్నారు. నిజానికి ప్రజలే దేశానికి మూలస్తంభాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. స్వాతంత్య్ర సమర యోధులు కేవలం దేశానికి స్వాతంత్య్రం తేవడం కోసం మాత్రమే కాకుండా సామాజిక మార్పు కోసం పోరాడారన్నారు. వారు బోధించిన పాఠాలు ఇప్పటికీ అన్ని రంగాలకూ ఉపయోగపడతాయని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రేరణగా నిలుస్తాయన్నారు.   దేశ జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్ళ లోపు వయసువారేనని, వారే మన దేశానికి భవిష్యత్తు చెప్పారు. యువతకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తోందని, వాటి నుంచి లబ్ధి పొందాలని కోరారు. దేశంలో బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇది ఒకటని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చాలా కృషి జరుగుతున్నా, ఇంకా చేయవలసింది చాలా ఉందని రాష్ట్రపతి చెప్పారు. బాలికలకు తప్పనిసరిగా సమానావకాశాలు కల్పించాలన్నారు. పిల్లల్లో శారీరక, అభిజ్ఞాత్మక అభివృద్ధి అనేవి చాలా కీలకమని, ఇదే దేశానికి భవిష్యత్ అని అన్నారు. వీటన్నింటి కోసం మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.