Home ఆఫ్ బీట్ రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్థతాం

రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్థతాం

ramanuja

‘గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపె ఘన గురుదైవము’ అని రామానుజుని ఘనంగా కీర్తించారు అన్నమాచార్యులు. ‘ప్రథమో అనంత రూపశ్చ ద్వితీయో లక్ష్మణస్థతా తృతీయో బలరామశ్చ కలౌ రామానుజో మునిః’
రాముని అనుజుడే భగవద్రామానుజుడు అంటే లక్ష్మణుడు అని కొందరు, లక్ష్మణుడు అంటే ఆదిశేషుని అవతారం కనుక ఆయన ఆదిశేషుని అపరావతారమని విశ్వసించారు భక్తులు..అభిమానులు.

రామానుజుడు 1027వ సంవత్సరంలో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో కేశవచార్య, కాంతిమతి దంపతులకు జన్మించారు. వైష్ణవ పూర్వాచార్యుల పరంపరలో మధ్యలోని వారైనా..ఆయనది గురుపరంపరలో ముందు వరుస. శాస్త్రం కన్నా సామాన్యుడే మిన్నఅన్ని విషయాలనూ సానుకూల దృక్పథంతో దర్శించే రామానుజుడు భగవత్ భాగవతాచార్య, భాగవతోత్తముల దూషణలను సహించలేడు. అలా వ్యవహరించి వేద వాక్యాలను విపరీతార్థంలో వ్యాఖ్యానించిన గురువు యాదవ ప్రకాశకులతోనే విభేదించాడు.శిష్యుని ప్రతిభా విశేషాలు గురువుకు కంటగింపై ప్రాణహాని కలిగించాలని బుసకొట్టే దాకా వెళ్లింది. అయినా ఆయన స్వయం కృషి ఆగలేదు. శాస్త్రాభ్యాసం మానలేదు. ఆదర్శగురువుగా మారడమేకాదు మరెందరో ఆదర్శ గురువులుగా ఆన శిష్యులను తీర్చిదిద్దాడు.
సమాజాన్ని వదలడం సన్యాసం కాదు
సన్యసించడం అంటే సంసారతాపత్రయాలను వదిలి సమాజసేవకు మళ్ళడం అంటాడు రామానుజుడు. సన్యాసికి కావాల్సింది జ్ఞానసాఫల్యమా? జీవిత సాఫల్యమా? అంటే రామానుజుడు జీవిత సాఫల్యమేనంటాడు. దానికే తొలి ఓటు వేస్తాడు. రామానుజుడికి పూర్వం జ్ఞానార్జనకే అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. కేవలం జ్ఞానం వల్ల ఒరిగేదేమీలేదన్నది రామానుజుడి సిద్ధాంతం. ఈయనకన్నా ముందు ఆదిశంకరుడు కూడా అదే మాట అన్నాడు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డకృ కరణే అన్నది ఆయన వాదన. జన్మసార్థకం కావాలంటే ఏం చేయాలి అంటే భజగోవిందం అంటాడు శంకరుడు. గోవిందుని భజించడం అంటే భజన చేస్తూ కూచోడం కాదు. గోవిందుడికి సేవచేయాలి అని అర్థం. భజ అనే శబ్దానికి సేవ అని అర్థం (భజ సేవాయాం). ఎవరు గోవిందుడు అంటే ఈ భూమికి అంటే ఈ దేశానికి ఆనందాన్ని కలిగించేవాడు అని అంటాడు. దేశం అంటే మట్టికాదు కనుక ఈ దేశవాసులకు సేవలందించమని అర్థం చేసుకోవాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు కనుక మనషులకు చేసే సేవ మాధవుడికీ ప్రీతిని కలిగిస్తుంది. కనుక మనషులకు సేవ చేయండి అని ఆదిశంకరుడు చెప్పాడు. రామానుజుడి వాదన కూడా అదే! సామాజిక బాధ్యతలు గుర్తించి ఆచరిస్తే తప్ప సన్యాసానికి సార్థకతలేదన్నది ఆయన వాదన.
దళితులు కారు ధన్యులు
ఆదిశంకరుడు దళితుని శివునిగా భావించి కాళ్ళమీదపడి దణ్ణం పెడితే రామానుజుడు వారికి ఆలయ ప్రవేశం కల్పించాడు. వారు తెచ్చిన పదార్థాలతో ప్రసాదం చేసి స్వామికి నివేదించాడు. మనుషుల్ని కులాలు, మతాలవారీగా చీల్చేస్తే సామాజిక జీవనం విచ్ఛిన్నం అవుతుందని రామానుజుడు నమ్మేవాడు. ఒక వర్గానికే పరిమితమనుకునే ‘మోక్ష మార్గం’ సర్వులకు సమానమని చాటి చెప్పాడు. గుహ్యమంత్రంగా అగ్రవర్ణాల వారు లోలోన జపించుకునే నారాయణాష్టాక్షరీ మంత్రాన్ని సమాజపరం చేసి సనాతనుల ఆలోచనలపై తిరుగుబాటు చేశాడు. తిరుకొట్టియూర్ ఆలయ గోపురం ఎక్కి ‘ద్వయ మంత్రాన్ని బహిరంగంగా వినిపించి రామానుజుడు ఆధ్యాత్మిక అభ్యుదయవాదిగా నిలిచిపోయాడు. ఈ కాలంలో మనం చెప్పుకుంటున్న సమభావన, సమజీవన సమైక్యతావాదాలను ఆనాడే ప్రతిపాదించాడు. సర్వసమతావాదిగా సమాజంపై చెరగని ముద్రవేశాడు.
జ్ఞాన ఉద్యమానికి ఆద్యుడు రామానుజుడు
శ్రీరంగంలో రామానుజుడు గద్యత్రయాన్ని ప్రతిపాదించాడు. శరణాగతి, శ్రీరంగ, వైకుంఠ గద్యలను గద్యత్రయం అంటారు. అందుకు సంతసించిన రంగనాథ పెరుమాళ్ వరం అనుగ్రహించబోగా ‘నేను శరణాగతి చేశాను కనుక నా సంబంధీకు లందరికీ పరమపదాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. తనకే సొంతమైన వరాన్ని స్వార్థానికి ఉపయోగించు కోక సర్వమానవ హితాన్ని కాంక్షించి అందరి పరం చేశాడు. ఆధునిక భావజాలంతో ఆయన ‘జ్ఞానఉద్యమం’ ప్రారంభించాడు. అందరూ ఒక్కటే..అంతా సమానమే అని తెలుసుకుని పాటించడమే ఈ జ్ఞాన ఉద్యమం ఆశయం. తన అనంతరం కూడా ఇది కొనసాగడానికి 74 మంది శిష్యులను తయారుచేసి వారికి దీని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యతలు అప్పగించాడు.
దివ్యతిరుపతులకు నవ్య రూపం
ఆదిశంకరుడిలాగే రామానుజుడు కూడా ఆసేతు శీతాచలం పర్యటించి సమాజంలో పలు సంస్కరణలు తెచ్చాడు. అనేక దివ్య దేశాలు సందర్శించినా కాంచీపురం, శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాలతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ సన్నిధిలో సన్యాసాశ్రమం స్వీకరించి త్రిదండధారణ చేశాడు. శ్రీరంగంలో ఉభయ విభూతి నాయకత్వం వహించి ‘ఉడయవర్‌”గా కీర్తినందుకున్నాడు. తిరునారాయణపురం (మేల్కోటే)లో దివ్యసేవలు అందించాడు. తిరుమలలో వేంకటేశ్వరుని నిత్య కైంకర్యాలు, సేవలు ఎలా ఉండాలో నిర్ధారించాడు. తిరుమలేశుడు విష్ణువా? శివుడా అని వాదులాడే రోజులలో నిర్ణయం శ్రీవారికే వదిలేసి భక్తుల మధ్య సమన్వయం సాధించాడు. శంఖం, చక్రం, శూలం గర్భాలయంలో పెట్టించి ఏది తీసుకోవాలో శ్రీవారి ఇష్టానికే వదిలేశాడు. మరునాడు తలుపులు తెరిచి చూస్తే స్వామి శంఖం, చక్రం ధరించి ఉండడంతో అంతా ఆయనను విష్ణువుగానే గుర్తించారు. దాంతో పేచీలేకుండానే సమస్య పరిష్కారమైంది.
గురువుకే గురువు..
రామానుజుడు గురువుకే గురువు. ఆయన గోష్ఠి నిర్వహించేటప్పుడు ఆచార్యుగురువు పెరియనంబి సాష్టాంగ నమస్కారం చేసి ‘శ్రీరామ శ్రీకృష్ణులకు విశ్వామిత్ర, సాందీపుల మాదిరిగా నేను రామానుజుడికి నామమాత్రపు ఆచార్యుడిని..
ఆయనకు తెలియక కాదు, నాకు తెలిసీ కాదు. దైవికంగా గురువునయ్యాను’ అని స్వయంగా విద్యాబుద్ధులు చెప్పిన గురువే అన్నాడు. ఆ ఒక్కమాటే చాలు రామానుజుడు ఎంత బుద్ధివిశిష్ఠుడో అర్థం చేసుకోడానికి. రామానుజుడికి 700 మంది జీయర్లు, 12 వేల మంది భాగవతులు, అసంఖ్యాకంగా మహిళలు శిష్యులయ్యారని చరిత్ర చెబుతోంది. పూర్వాచార్యులు తమకు గల అధికారాన్ని బట్టి కొందరిని మాత్రమే తరింప చేయగా, భగవద్రామానుజులు జీవనదిలా ఒకేసారి అందరినీ తరింపచేశాడు అన్నాడు నాథముని ఆళ్వార్.
భక్తి ఉద్యమాలకు బలమైన నాయకుడు
విశిష్టాద్వైత సిద్ధాంత నిరూపణతో పాటు సర్వమానవాళిని చైతన్యపరిచేందుకు, పరతత్త్వం సులభంగా బోధపడేందుకు, సహజ, సమభావాలతో ధార్మిక బోధనలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచాడు. జ్ఞానమార్గంతో పాటు భక్తిమార్గం, సనాతన ఆచరణపై విస్తృత ప్రచారం చేశాడు. అటు తర్వాత దేశంలో బయలుదేరిన అనేక ఉద్యమాలపై రామానుజుల ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తుంది.
ఎన్నో సేవలు మరెన్నో బిరుదులు
* వేదానికి వక్రభాష్యాలు చెబుతున్న కాలంలో రామానుజులు వాటికి సరైన అర్థాన్ని చెప్పి శారదాదేవి శోకాన్ని నివారించి  ఆమెతో ‘భాష్యకారా’ అని పిలిపించుకున్నాడు. తిరుమలలో హుండీ ఎదురుగా ఈ భాష్యకార సన్నిధి ఉంది.
* తమిళనాడులోని కాంచీపురం వరదరాజ సన్నిధిలో సన్యసించిన ఆయనను స్వామివారే ‘యతిపతి’ అని సంబోధించారు.
అక్కడ ‘యతిపతి సన్నిధి’ దివ్యంగా దర్శనమిస్తుంది.
* రామానుజాచార్యుడు తిరునారాయణపురం వీడి వస్తున్నప్పుడు తన శక్తిని విగ్రహంలో ప్రవేశపెట్టారు.
అప్పట్లో ఆ విగ్రహం మాట్లాడేది. ఆ రోజులలోనే అది ‘పేశుం యతిరాజర్ సన్నిధి (మాట్లాడే స్వామి సన్నిధి) గా ప్రసిద్ధికెక్కింది.
* తమిళనాడులోని మధురాంతకంలో రామానుజుడికి పంచ సంస్కారాలు అనుగ్రహించినవాడు పెరియనంబి. అక్కడ రామానుజుడు నిత్యం తిరుప్పావైని అనుసంధానిస్తున్నందుకు ఆయనను ‘తిరుప్పావై జీయర్’ అని ఆశీర్వదించారు.
* తిరుమలలో రామానుజ గోష్ఠికి పాలు, పెరుగు సమర్పిస్తూ వచ్చిన యాదవ స్త్రీకి ముక్తిని ప్రసాదించారని ప్రతీతి. తిరుమలలో ఆలయానికి ఎదురుగా ఇప్పటికీ ‘గొల్ల భామ మండపం’ కనబడుతుంది.