Home తాజా వార్తలు అభిమానులకు చెర్రీ లేఖ..!

అభిమానులకు చెర్రీ లేఖ..!

Ramcharanహైదరాబాద్: సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన ‘వినయ విధేయ రామ’ మూవీ కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించిన ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేదనేది కాదనలేని వాస్తవం. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, చెర్రీ కాంబోతో సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ టీజర్, ట్రైలర్ లను విడుదల చేసి మరింత హైప్ తీసుకొచ్చింది. కానీ, సినిమా థియేటర్లలోకి వచ్చిన తరువాత సీన్ రివర్స్ అయింది. మొదటి ఆట నుంచే మూవీలో అంత విషయం లేదనే టాక్ రావడంతో ‘వివిఆర్’ ఢీలాపడిపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాతలు లాభాలకు అమ్ముకున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయారని సమాచారం. అయితే ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వచ్చిన ‘వినయ విధేయ రామ’ చెర్రీతో పాటు మెగా అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సందర్భంగా చరణ్ అభిమానులు, ప్రేక్షకులకు ఓ లేఖ రాశారు.

చెర్రీ లెటర్ లో ఇలా ఉంది. “ప్రియమైన అభిమానులు మరియు ప్రేక్షకులకు.. నా పట్ల మరియు నా సినిమాల పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు. నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు మరియు ప్రదర్శనదారులకు కృతజ్ఞుడనై ఉంటాను. మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను మీకు అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్‌లో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. అన్ని వేళలా తమ మద్దతు నాకు అందించిన మీడియా మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ మరియు అభిమానానికి ధన్యవాదాలు. ప్రేమతో.. మీ రామ్ చరణ్” అని లేఖలో పేర్కొన్నాడు.

Ramcharan writes letter to fans