Home తాజా వార్తలు టీమిండియా తాత్కాలిక కోచ్‌గా రమేశ్‌ పవార్‌

టీమిండియా తాత్కాలిక కోచ్‌గా రమేశ్‌ పవార్‌

Ramesh Powar Named Interim Coach of India Women's Team

ముంబయి: భారత మహిళల క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌ని నియమిస్తూ బిసిసిఐ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మహిళల జట్టు కోచ్‌ తుషార్‌ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ క్రీడాకారిణులు కోచ్‌ పద్ధతి సరిగా లేదంటూ బిసిసిఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్‌ రాజీనామా చేశారు. దీంతో కొత్త కోచ్‌ ఎంపికయ్యే వరకూ ఆ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా రమేశ్ పవార్‌ని బిసిసిఐ కోరింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది. అప్పటి నుంచే రమేశ్‌ జట్టుతో కలవనున్నాడు. మహిళల జట్టు కోచ్‌ కోసం ఇప్పటికే బిసిసిఐ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుకు తుది గడువును జులై 20గా నిర్ణయించింది. అభ్యర్థుల వయసు 55లోపు ఉండాలని, జాతీయ జట్టు లేదా రాష్ట్రానికి చెందిన ఫస్ట్‌ క్లాస్‌ జట్టుకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక 40 ఏళ్ల రమేశ్ పవార్‌ టీమిండియా తరఫున రెండు టెస్టులు, 31 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు. వన్డేల్లో 34 వికెట్లు, టెస్టుల్లో 6 వికెట్లు పడగొట్టారు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 148 మ్యాచుల్లో 470 వికెట్లు తీశారు.