Home ఆఫ్ బీట్ అద్భుతం..పాలరాతిఆలయం

అద్భుతం..పాలరాతిఆలయం

Ranakpur Jain Temple

 

మనదేశంలో అనేక జైన ఆలయాలు ఉన్నాయి. కానీ ఆరావళి పర్వత సమీపంలోని రాజస్థాన్ రనక్‌పూర్ గ్రామంలో ఉన్న ఈ జైన ఆలయం దేశంలోనే అతిపెద్దది. మొదటి తీర్థంకరుడి గౌరవార్థం నిర్మించిన అద్భుతమైన పాలరాతి నిర్మాణం. ఈ జైన ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

జైనుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపుపొందింది. ఆలయం మొత్తంగా పాలరాతితో నిర్మించటం వల్ల పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ కట్టడం. రనక్‌పూర్‌లో ఉన్న జైన ఆలయంలో ఎన్నో విశిష్టతలున్నాయి. 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో 29 మండపాలున్నాయి. 80 డోమ్‌లున్నాయి. 1444 మార్బుల్ పిల్లర్స్ మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కో పిల్లర్ ఒక్కో కళాఖండంలా కనిపిస్తుంది. స్తంభాలపై చెక్కిన శిల్పాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. ప్రముఖ జైన వ్యాపారవేత్త ధర్మ షా ఈ ఆలయాన్ని నిర్మించి, ఆయన రాజ్‌పుత్ సామ్రాట్ రానా కుంభకు ఈ ఆలయాన్ని బహుమతిగా ఇచ్చారు.

జైనమతాన్ని స్థాపించిన ఆదినాథ్ గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించాడు ధర్మ షా. రానా కుంభను కలిసి, ఆలయ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఇవ్వడమే కాకుండా, దగ్గరలో ఒక నగరాన్ని కూడా నిర్మించమన్నాడు రానా కుంభ. ఆయన ఆదేశానుసారం ధర్మ షా ఆలయంతో పాటు, నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి రానా కుంభ పేరు మీదుగా రనక్‌పూర్ అని పేరు వచ్చింది. ఆ కాలంలోనే ఈ ఆలయ నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఆలయ నిర్మాణం పూర్తవడానికి సుమారు 50 ఏళ్లు పట్టింది. కళాత్మక తోరణాలు, విలువైన రాళ్లు, అందంగా చెక్కిన శిల్పాలతో ఆలయం విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

ఆలయంలో ఎటువైపు నిలబడి చూసినా, దేవుని విగ్రహం కనిపించడం విశేషం. మూడు అంతస్థుల్లో ఉన్న ఈ పాలరాతి నిర్మాణం సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు సాధించింది. 17వ శతాబ్దంలో విదేశీయులు దండయాత్రలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తరువాత 20వ శతాబ్దంలో ఆలయాన్ని పునఃనిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి విదేశీ పర్యాటకులు సైతం ఇక్కడికి రావడం గమనార్హం.

Ranakpur Jain Temple of Rajasthan is largest in country

Telangana Latest News