సినీ రంగంలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ ఇతర రంగంలోనూ విజయాల శాతం ఇంత దారుణంగా ఉండదు. చిత్ర పరిశ్రమలో ఎంతటి వాళ్లకైనా ఫెయిల్యూర్లు సహజం. ఎంతో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటూ వెళ్లినా పరాజయాలు తప్పవు. కాబట్టి ఫెయిల్యూర్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కానీ ఒకప్పుడు తనకు అంతగా పరిణతి లేదని…. దీంతో ఫెయిల్యూర్లకు కుంగిపోయేవాడినని స్టార్ హీరో రామ్చరణ్ చెప్పాడు. తన కెరీర్లో హిట్లతో పాటు పెద్ద ఫ్లాపులు కూడా ఉన్నాయని చరణ్ అన్నాడు. అయితే గతంలో సినిమా ఫ్లాప్ అయినప్పుడు తట్టుకోలేక బయటకు ఎక్కడకి వెళ్లేవాడిని కాదని తెలిపాడు. ఓ సమయంలో తాను ఇంట్లో బెడ్రూమ్కే పరిమితమైన రోజులు కూడా ఉన్నాయని చెప్పాడు. కొన్ని రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేవాడినని… ఆ సమయంలో ప్రపంచం మొత్తం తన మీద పడిపోతున్నట్లు ఫీలయ్యేవాడినని చరణ్ తెలిపాడు. “ఇప్పుడు హిట్లు, ఫ్లాపులను ఒకేలా చూడటం అలవాటైంది. జీవితంలో తప్పులు సహజం. ఆ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. సక్సెస్ కంటే ఫెయిల్యూరే ఎక్కువగా నేర్పిస్తుంది. ఫెయిల్యూర్లను అంగీకరించినప్పుడే మనల్ని మనం సరిచేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే నేను తప్పులు చేయడానికి భయపడను”అని రామ్చరణ్ పేర్కొన్నాడు. ఒడిదుడుకులతో సాగిన చరణ్ కెరీర్ ప్రస్తుతం బ్లాక్బస్టర్ మూవీ ‘రంగస్థలం’తో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అతను బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.