Home ఎడిటోరియల్ కథువా బాలిక కన్నీటి గాథ

కథువా బాలిక కన్నీటి గాథ

Rape-on-Girl-in-Jammu-Kashm

ప్రతి జాతి చరిత్రలోను క్లిష్టమైన పరిస్థితులు, మలుపులు ఎదురవుతాయి. అలాంటి మలుపే ఇప్పుడు జమ్ములోని కథువా పట్టణంలో ఎదురైంది. కథువా అంటే స్థానిక దోగ్రా భాషలో తేలు అని అర్థం. ఈ పట్టణంలో వందలాది మంది కలిసి అత్యాచారం కేసులో నిందితులకు బాహాటంగా మద్దతిస్తున్నారు. ఒక ఎనిమిదేళ్ళ బాలికను అనేక రోజుల పాటు ఒక గుడిలో బంధించి, చిత్రహింసలు పెట్టి, మత్తుమందిచ్చి, అనేకసార్లు మానభంగం చేసి చివరకు అత్యంత పైశాచికంగా బండరాయితో చితక్కొట్టి చంపేసిన నిందితులు వాళ్ళు. ఎనిమిది మంది నిందితులు. అందులో నలుగురు పోలీసులు, ఒకడు టీనేజర్ కూడా ఉన్నాడు. ఈ అమానుషం తర్వాత పోలీసులు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఆ చిన్నారి దుస్తులను కడిగేశారు.

ఈ నిందితులను కాపాడ్డానికి ఇప్పుడు అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. జాతీయపతాకాలు చేతబట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో పాలకపక్షం భారతీయ జనతాపార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా జాతీయోత్సాహంతో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో లాయర్లు “జై శ్రీరాం” నినాదాలు చేస్తూ తిరిగారు. ఈ కేసులో పోలీసులు చార్జిషీటు ఫైలు చేయకుండా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కోర్టులో జడ్జిగారు కూడా ఈ చార్జిషీటును స్వీకరించడానికి తటపటాయించి, చివరకు హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే అనుమతించారు. అమానుషమైన ఈ రేప్ కేసులో నిందితులకు మద్దతుగా కథువా పట్టణం బంద్ జరిగింది. ఇదంతా జరుగుతుంటే ప్రతిపక్షాలు, సెక్యులర్ కండువా భుజాన్నేసుకు తిరిగే కాంగ్రెసు పార్టీలోని పెద్దలు, టివిల్లో చర్చల్లో గొంతులు చించుకునే మేధావులు అందరూ నోరు విప్ప లేదు. సాధారణంగా ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోయే వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. నిర్భయ కోసం వీధుల్లోకి వచ్చిన వారు కూడా పెదవి విప్పడం లేదు.

కారణమొక్కటే కనిపిస్తోంది. కథువాలో మెజారిటీ ప్రజలు నిందితులు హిందువులు. ఆ చిన్నారి ముస్లిం బాలిక. ఈ 21 శతాబ్దికి పూర్వం భారతదేశం ఇంత నగ్నంగా, క్రూరంగా విద్వేష, విభజన భావాలకు గురైన సందర్భాలు చాలా తక్కువ. ఒక చిన్నారి సామూహిక మానభంగం, హత్యలను కూడా సమర్ధించే స్థాయికి దిగజారడం ఇంతకు ముందు జరగలేదు. ఇంతకు ముందు జాతీయపతాకాన్ని ఇంతగా అవమానించింది లేదు. ఉత్తరప్రదేశ్, దాద్రిలో ఒక ముస్లిమును హతమార్చిన హంతకుడి శవపేటికపై జాతీయపతాకాన్ని కప్పడం వంటి అవమానకరమైన సంఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

భారతదేశం ఇంతకు ముందెన్నడూ ఇంత చీకటిలో కూరుకుపోయి, దాన్ని గుర్తించడానికి కూడా నిరాకరించడం మునుపెన్నడూ జరగలేదు. సంచార జాతికి చెందిన ముస్లిం చిన్నారి, ఎనిమిదేళ్ళ ఆసిఫా తమ గుర్రాలను మేపుతూ ఆడుకుంటున్నప్పుడు ఆమెను అపహరించి, అమానుష నేరానికి పాల్పడిన ఈ సంఘటన అనేకమందిని కలచివేసింది. విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి నిరుపమ మీనన్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి ముస్లిములను తరిమేయడానికి తీవ్రవాద హిందు సంస్థలు పన్నిక కుట్రే ఈ చిన్నారి మానభంగం, హత్యగా పేర్కొన్నారు. అనేక మంది హిందువుల భావాలు ఇక్కడ ఇలాగే ఉన్నాయని, ఈ విద్వేషం ఒక పథకం ప్రకారం తారస్థాయికి చేరుకుందని, చివరకు భారతదేశం జాతివివక్ష దశకు చేరుకుంటుందని అన్నారు. కేవలం హిందువులు మాత్రమే దేన్నయినా హక్కుగా కోరగలిగిన హిందూరాష్ట్ర వైపు నడుస్తుందని చెప్పారు.

ఈ కేసులో పోలీసుల విచారణ పూర్తయ్యింది. కాని, హిందు (కొందరు సిక్కు) లాయర్లు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేయకుండా జమ్ముకశ్మీర్ క్రయిం బ్రాంచ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. జడ్జి కూడా చార్జిషీటు స్వీకరించడానికి తటపటాయింపుల్లోనే ఉన్నారు. రాజస్థాన్ కు చెందిన ఒక బిజెపి శాసనసభ్యుడు హిందువులకు పిలుపునిస్తూ ముస్లిములు తమ ఇండ్లకు రాకుండా నిషేధించాలని, వారిని వెళ్ళగొట్టాలని అన్నాడు. ఈ శతాబ్దిలో భారతదేశం ఇలాంటి చాలా పరిణామాలు చవిచూసింది. హత్యలకు ప్రేమ కారణమైంది. మతపరమైన స్వచ్ఛత కోసం నేరాలు జరిగాయి. ఆవు విషయంలో హత్యలు జరిగాయి. కథువా కేసు ఇందులో పరాకాష్ఠ. ఇక్కడ అమానుషానికి గురైంది ఒక చిన్నారి. ఇందులో మతం ఉంది. మతవిద్వేషం ఉంది. అంతేకాదు, చట్టబద్ద పాలన విషయంలో గతంలో ఎన్నడూ లేనంత నిర్లక్ష్యం ఉంది.భారతదేశంలో పిల్లలపై అత్యాచారాలు జరగలేదని కాదు. చాలా వార్తలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఈ కేసుల పట్ల నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. కొన్ని అత్యాచారాలు అమానుషంగా అత్యంత క్రూరంగా జరిగినవి ఉన్నాయి. ఇలాంటి నేరస్తులకు మరణశిక్షలు విధించాలన్న ఆగ్రహమూ చాలా సార్లు కనబడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు మరణశిక్షలను ఒప్పుకున్నాయి.

ఈ రాష్ట్రాలు బిజెపి పాలిత రాష్ట్రాలే. కాని అలాంటిదే కేసు కథువాలో జరిగినప్పుడు, ఒక చిన్నారిని అమానుషంగా అత్యాచారం చేసి చంపేసినప్పుడు బిజెపి మౌనం వహించడమే కాదు, దోషులను సమర్ధించడానికి బిజెపి నేతలు ముందుకు వస్తున్నారు. కథువాలో అమానుషానికి, దేశంలో పిల్లలపై జరిగిన ఇతర నేరాలకు మధ్య తేడా ఇదే. ఇలాంటి ఇతర నేరాల విషయంలో దోషులకు పాలకపార్టీ తరఫున, ప్రజల తరఫున ఇలాంటి మద్దతు లభించలేదు. దానికి కారణం వారి మతమే. కథువా బార్ అసోసియేషన్ సిబిఐ విచారణ కోరుతోంది. ఎందుకంటే, రాష్ట్రప్రభుత్వం అక్కడి ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోలేదంట. రాష్ట్రప్రభుత్వంలో బిజెపి కూడా ఉంది మరి. ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోలేదనే వాదన చాలా పాత, భయంకరమైన వాదన. మెజారిటీ ప్రజల మనోభావాలు కాబట్టి ఇలాగే చేయాలన్న వాదన దారుణం. దేశంలో చాలా సందర్భాల్లో ఈ వాదనే ఉపయోగిస్తున్నారు. సినిమాలు, పుస్తకాలు, కార్టూన్ల సెన్సార్ షిప్ విషయంలో కాని, 1984 సిక్కు వ్యతిరేక అలర్లలో, 2002 గుజరాత్‌లో ముస్లిం వ్యతిరేక అల్లర్లలో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచడానికి కాని ఈ వాదననే ఉపయోగించారు. ప్రజల మనోభావాలు అనే వాదనలో గుంపుల విషయంలో చట్టం మౌనం వహించాలన్న ధోరణి ఉంది.

కశ్మీరు వంటి ఉద్రిక్త కల్లోల ప్రాంతంలో, వేర్పాటువాద భావాలు గతంలో ఎన్నడూ లేనంతగా తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో, హిందూ ముస్లిం సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు కనబడుతున్నప్పుడు ఇది మరింత ప్రమాకరంగా కనబడుతోంది. బిజెపి, ప్రధాని మోడీ నిజంగా భారత ప్రయోజనాలను కోరుతున్నట్లయితే, కథువాలో ఈ పరిస్థితిని నివారించాలి. అదేమంత కష్టం కాదు. చట్టాన్ని పనిచేయనీయమని చెప్పాలి. గుంపులను నిరోధించడానికి బిజెపి చేయవలసింది న్యాయానికి, చట్టానికి కట్టుబడడం, మైనారిటీల వ్యవహారం వచ్చేసరికి వదిలేస్తున్న విలువలకు కట్టుబడడం. అలా చేయడం వల్ల అతివాద, రేడికల్ మద్దతుదారులను బిజెపి కోల్పోవచ్చు. ఆ ఓటు బ్యాంకును కోల్పోవచ్చు. బిజెపి ఇలా చేస్తుందా? బిజెపి అధికార ప్రతినిధులే దోషులను సమర్ధిస్తు మాట్లాడుతున్నప్పుడు, మోడీగారి వైఖరి కూడా ఇదే అన్నట్లు కనిపిస్తున్నప్పుడు, ఇదంతా సాధ్యం అయ్యేలా లేదు.

  *  సమర్ హలంకర్