Search
Sunday 18 November 2018
  • :
  • :

ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్సలు

Surgery

గోషామహల్: అరుదైన శస్త్రచికిత్సలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు మరో రెండు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి మరో మారు తమ ఘనతను చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్సల వివరాలను వెల్లడించారు. నగరంలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల ఓ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో 3 నెలల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్టులు బాలికకు వయస్సు పెరుగుతున్నా వజీనా ద్వారం పెరగక పోవడమే కారణమని గుర్తించారు.

కాగా బాలిక నెలసరి రాకుండా గర్భసంచిలోనే రక్తస్రావం కావడంతో కడుపునొప్పికి గురవుతుండటంతో ఆమెను తదుపరి పరీక్షల కోసం ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి రిఫర్ చేయడంతో బాలికకు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్, ఇతర వైద్య బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి వజీనా మార్గాన్ని సరిచేయాలని నిర్ణయించారు. బాలికకు గల సమస్యను కుటుంబ సభ్యులకు వివరించి వారి అనుమతితో బాలికకు శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స ద్వారా తొడ భాగంతో చర్మాన్ని సేకరించి బాలికకు కొత్తగా వజీనాను సృష్టించారు. పక్షం రోజుల పాటు బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి బాగుందని, భవిష్యత్తులో ఆమె వైవాహిక జీవితానికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని డాక్టరఠ్ నాగప్రసాద్ తెలిపారు. ఇదే శస్త్రచికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షన్నర వరకు ఖర్చవుతుందని, ఈ శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు.

మూసుకుపోయిన చెవికి శస్త్రచికిత్స….
పుట్టుకతో చెవి మూసుకుపోయి అంధవికారంగా మారిన కలకత్తాకు చెందిన బాలికకు ఉస్మానియా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు సాధారణ రూపానికి తెచ్చారు. కలకత్తాకు చెందిన నందితాదాస్(10) పుట్టుకతో చెవి మూసుకుపోయింది. ఎడమ చెవితో వినగలిగినా చెవి లేక పోవడం తో నందితాదాస్ ముఖం అంధవికారంగా కనిపించేంది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వివాహ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని గ్రహించి కలకత్తాలోని వైద్యులకు చూపించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు మూడు దశలలో శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులు అనుమతి మేరకు కలకత్తా వైద్యులు 2016లో అక్కడే ఆమెకు మొదటి దశ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం కుటుంబ పరిస్థితుల నేపథ్యం లో బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఈ క్రమంలో రెండవ దశ శస్త్రచికిత్స నిమిత్తం తల్లిదండ్రులు బాలికను ఉస్మానియా ఆసుప త్రిలో చేర్పించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిని గమనించిన ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు నిర్ణయిం చారు. ఈ మేరకు గతేడాది నందితాదాస్‌కు రెండవ దశ వస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ నాగప్రసాద్ నేతృత్వంలోని వైద్య బృందం గత మే నెలలో ఆమెకు మూడవ దశ శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేశారు. శస్త్రచికిత్స ద్వారా ఆమె శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మాన్ని సేకరించి మూసుకుపోయిన ఆమె చెవికి సాధారణ రూపం తెచ్చా రు. రెండు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్, ఇతర వైద్యుల బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జివిఎస్ మూర్తి, ఆర్‌ఎంఓ-1 డాక్టర్ అంజయ్యలు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ చేస్తున్నామన్నారు.

Comments

comments