Home తాజా వార్తలు రైస్ మిల్లర్‌పై పిడి కేసు

రైస్ మిల్లర్‌పై పిడి కేసు

Ration rice smuggling in suryapet

మన తెలంగాణ/ హైదరాబాద్ : రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన రైస్‌మిల్ యజమాని ఇమ్మాడి సోమనర్సయ్యపై పిడి కేసు నమోదయింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన సోమనర్సయ్య సంతోష్ రైస్ ఇండస్ట్రీస్ పేరు తో రైస్‌మిల్ నడిపిస్తున్నారు. గత కొంత కాలంగా వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ రేషన్‌కార్డు దారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి వాటిని రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకు న్న పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయనపై నిఘా పెట్టా రు.

అతని బియ్యం వ్యాపారానికి సంబంధించిన వివరాలు సేకరించారు. అప్పటికే ఆయనపై 9 క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ నిఘాను మరింత పెంచింది. అతనిపై ఉన్న బియ్యం అక్రమ రవాణా కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌కు అందచేసింది. పూర్తిగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ బుధవారం సోమనర్సయ్యపై పిడి కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో సోమనర్సయ్యపై 2015 సెప్టెంబర్ 9న తొలి కేసు నమోదయింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు.