Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రవితేజ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ ‘రాజా ది గ్రేట్’

raviteja

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ “సాయికార్తీక్ బ్రహ్మాండమైన పాటలను ఇచ్చాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ మోహనకృష్ణతో కలసి ఈ సినిమా కోసం తొలిసారి పనిచేశాను. ఇక నాతో పాటు పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, అలీ, రఘుబాబు, చిత్రం శ్రీను, పోసాని సహా అందరం ఎంజాయ్ చేస్తూ నటించాం. రాజేంద్రప్రసాద్, రాధికతో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. దిల్‌రాజు మంచి ఫిల్మ్‌మేకర్. మెహరీన్ చాలా అందంగా ఉంటుంది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా దర్శకులే. అనిల్ రావిపూడి కథ చెప్పిన విధానం, పద్ధతి నాకు నచ్చింది. తను ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొడతాడు”అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “సాయికార్తీక్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే… ఈ సినిమాతో తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. రవితేజతో నాకు 20 ఏళ్ల పరిచయం ఉంది. ‘రాజా ది గ్రేట్’ సినిమా విషయానికొస్తే… హీరో గుడ్డివాడు అని చెబితే… అందరూ హీరోకు కళ్లు వస్తాయా? ఇంటర్వెల్ తర్వాత కళ్లు వస్తాయా? అని అడిగారు. ఈ కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లింది. ఈ స్క్రిప్ట్ వినగానే రవితేజ నాకు ఫోన్ చేసి ‘అనిల్ ఇరగ్గొట్టాడు. ఈ సినిమా నేను చేస్తున్నాను”అని అన్నారు. పూర్తయిన సినిమా చూశాక చాలా నమ్మకం వచ్చింది. ‘ఇడియట్’ రవితేజ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్, బెస్ట్ ఫిల్మ్. తర్వాత ‘విక్రమార్కుడు’ సినిమా బెస్ట్. ఇప్పుడు అతనికి ది బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ పర్‌ఫార్మెన్స్ మూవీ ‘రాజా ది గ్రేట్’. కమర్షియల్ సినిమా కొత్తగా రావాలంటే అది హీరోతోనే సాధ్యం. హీరో ముందుకొస్తే కొత్త కథలొస్తాయి”అని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఓ గుడ్డివాడి క్యారెక్టర్‌తో సినిమా చేద్దామని నిర్మాత దిల్‌రాజుకు చెబితే ఆయన వెంటనే ఓకే అన్నారు. ఈ కథ నచ్చి రవితేజ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయన ఎనర్జీ లెవెల్స్‌కు తగ్గట్లు ఆయన క్యారెక్టరైజేషన్ మారిపోయింది. ఆయన కారణంగానే ‘రాజా ది గ్రేట్’ సినిమా నెక్స్ లెవెల్‌కు వెళ్లింది. ఈ సినిమాను ఇంత గొప్పగా చేయడానికి కారణం దిల్‌రాజు, శిరీష్‌లు. ఎంతో స్వేచ్ఛనిచ్చి వారు నాతో ఈ సినిమా చేయించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెహరీన్, రాజేంద్రప్రసాద్, సతీష్ వేగేశ్న, సంపూర్ణేష్‌బాబుతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments