Home జాతీయ వార్తలు రాతల నోట్లపై పుకార్లు నమ్మొద్దు

రాతల నోట్లపై పుకార్లు నమ్మొద్దు

Raghuram-Rajanముంబయి:  కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆర్‌బిఐ కొట్టిపారేసింది. ఈ నోట్లను వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి చలామణి నుంచి తప్పిస్తున్నట్లు తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. వాట్సప్ ద్వారా వస్తున్న రూమర్స్‌ను నమ్మవద్దని, రాతలు ఉన్న నోట్లు కూడా చట్టబద్ధమైనవేనని ఆర్‌బీఐ(రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ రఘరామ్ రాజన్ ఆడియో సందేశంలో పేర్కొన్నారు. వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా జనవరి నుంచి రాతలున్న నోట్లు చెల్లవని ప్రచారం జరుగుతోందని, అటువంటి నోట్లను తాము నిషేధించడం లేదని తెలిపారు. అవన్నీ చెల్లుబాటవుతాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. అయితే సరిగ్గా లేని నోట్లను చెలామణి నుంచి తొలగించి కొత్త వాటిని చేర్చాలన్నది ఆర్‌బీఐ విధానమని, అంతేగాని ఆ నోట్లు చెల్లవని కాదని స్పష్టం చేశారు. అలాంటి నోట్లను ఎక్కడైనా, ఎవరైనా వాడుకోవచ్చని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని రాజన్ సూచించారు. వచ్చే ఏడాది నుంచి నోట్లపై రాతలుంటే అవి చెల్లవని, బ్యాంకులు కూడా స్వీకరించవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ వెంటనే స్పందించింది.