Search
Sunday 23 September 2018
  • :
  • :

ఈసారి రెపో రేటు ఎటు?

rbi

 ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా వడ్డీ రేటు
పెరగవచ్చంటున్న నిపుణులు
 నేటి నుంచి ఆర్‌బిఐ పాలసీ సమావేశాలు

ముంబై: ద్రవ్యోల్బణం ఆందోళనలు పెరగడం, పెట్టుబడులు తరిలిపోవడం వంటి అంశాల నేపథ్యంలో ఈసారి వడ్డీ రేటు పెంపునకే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మొగ్గుచూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి(జూలై 30) నుంచి వడ్డీ రేటుపై ఆర్‌బిఐ పాలసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మూడు రోజులపాటు కొనసాగనుండగా, తుది నిర్ణయం బుధవారం వెలువడనుంది. ఈవారం ఆర్‌బిఐ నిర్ణయాలకు అనుగుణంగా స్టాక్‌మార్కెట్లు ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్‌బిఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపిసి) పరపతి విధానాలపై చర్చించనుంది. పరపతి నిర్ణయాలను ఆర్‌బిఐ బుధవారం మధ్యాహ్నం ప్రకటించనుంది. జూన్ 6న నిర్వహించిన పాలసీ సమీక్షలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును పావు శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. చమురు ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ధరల ద్రవ్యోల్బణం రిస్కులు పెరుగుతోంది. ఆర్‌బిఐ నిర్ణయించిన ద్రవ్యోల్బణం లక్షం 4 శాతంను తాజాగా మించింది. వృద్ధి రేటు గణాంకాలు చూడడానికి బాగున్నప్పటికీ ద్రవ్యోల్బణం ఆందోళన కల్గిస్తున్న కారణంగా ఆర్‌బిఐ వడ్డీ రేటు పెంచే అవకాశముందని యాక్సిస్ అస్సెట్ మేనేజ్‌మెంట్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ హెడ్ ఆర్.శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆర్‌బిఐ ద్రవ్యపరపతి సమీక్షలో ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రమాణికంగా తీసుకుంటుంది. పెరిగిన ద్రవ్యోల్బణ గణాంకాలను చూస్తే ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌బిఐ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను అక్టోబర్‌మార్చి 4.7 శాతంగా అంచనా వేయగా, అంతకుముందు 4.4 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బిఐ రెపో రేటును 0.25 శాతం మేరకు పెంచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌బిఐ ఈ వడ్డీ రేట్లను పెంచడం విశేషం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో అదే సమయంలో దేశీయంగా ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గుచూపుతోంది. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లు కూడా పాలసీ సమీక్షలు చేపట్టనున్నాయి. వీటి నిర్ణయం కూడా దేశీ స్టాక్ మార్కెట్లను నిర్దేశించనున్నాయి.
డబ్లుపిఐ ద్రవ్యోల్బణం నాలుగేళ్ల గరిష్ఠానికి..
జూన్‌లో టోకు ధరల సూచి(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. కూరగాయలు ప్రియం కావడం, ఇంధన ధరల పెరుగుదలతో గత నెలలో 5.77 శాతం నమోదైంది. ఇది మే నెలలో 4.43 శాతంగానే ఉంది. గతేడాది జూన్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 0.99 శాతంగానే ఉండడం గమనార్హం. జూన్‌లో పెరిగిన ద్రవ్యోల్యణం కారణంగా ఆగస్ట్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈవారంలో క్యూ1 ఫలితాలు
ఈవారంలో పలు కంపెనీలు ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించాయి. ఈనెల 30న యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐడియా సెల్యులర్, టెక్ మహీంద్రా, ఐడిఎఫ్‌సి, శ్రీసిమెంట్ త్రైమాసిక ఫలితాలు ఉంటాయి. మంగళవారంనాడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాబర్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, వేదాంతా క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. వచ్చే వారం రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఐబి హౌసింగ్, మారికో, నెస్లే ఇండియా, టైటన్ వంటి కంపెనీలు ఫలితాలు విడుదల చేయనున్నాయి. వీటితోపాటు జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపి) గణాంకాలు 31న వెల్లడికానున్నాయి. మే నెలలో ఐఐపి 3.6 శాతం పుంజుకున్న విషయం తెలిసిందే.

Comments

comments