Home తాజా వార్తలు హెచ్చు తగ్గులు ఉంటాయి

హెచ్చు తగ్గులు ఉంటాయి

RBI, Sebi securities on financial markets

రూపాయి కదలికలు, డెరివేటివ్స్ గడువు తేదీ
ట్రేడ్ వార్ పరిణామాలను గమనించాలి : నిపుణులు

న్యూఢిల్లీ : ఈ వారం దేశీయ మార్కెట్ సూచీలను రూపాయి కదలికలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు తేదీ వంటి అంశాలు శాసించనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశంపైనా దృష్టి పెట్టాలని, ఈవారం హెచ్చుతగ్గులకు అవకాశముందని తెలిపారు. అయితే గతవారం మార్కెట్ బేరిష్ ట్రేడ్ తర్వాత ఈ వారం సూచీల్లో కొంత ఊరట కనిపించవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి కదలికల ప్రభావం మార్కెట్‌పై కనిపించనుందని, ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ 72.91కి చేరి అత్యంత కనిష్టానికి చేరింది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ ఇప్పటికీ రికార్డు కనిష్ట స్థాయిలోనే ఉంది. మరోవైపు అంతర్జాతీయ అంశాలను చూస్తే అమెరికాచైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా మరింతగా సుంకాలను పెంచింది. దీంతో అమెరికాతో చర్చలను చైనా రద్దు చేసుకుంది.

చైనాతో వాణిజ్య వివాదంతో మేలు జరుగుతుందని అమెరికా ఆశాభావంతో ఉంది. దీంతో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండనున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. డెరివేటివ్స్ గడువు గురువారం (27న) ముగియనుంది. దీంతో ట్రేడర్లు అక్టోబర్ సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్ చేసుకునే అవకాశముంది. అమెరికా ఫెడరల్ రిజర్వు బుధవారం(26న) పాలసీ సమీక్ష నిర్ణయాలను ప్రకటించనుంది. ఈసారి సమావేశంలో కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిరుద్యోగిత 18ఏళ్ల కనిష్టానికి చేరడం, ద్రవ్యోల్బణం 2 శాతం లక్ష్యానికి చేరువకావడం వంటి అంశాల నేపథ్యంలో వడ్డీ పెంపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గత వారం చివర్లో లిక్విడిటీ భయాలతో దేశీయంగా ఫైనాన్షియల్ రంగ కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ప్రభావం వచ్చే వా రంసైతం కనిపించే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ముడిచమురు ధరలు, ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు)లు, డిఐఐ(దేశీయ ఇన్వెస్టర్లు)ల పెట్టుబడుల తీరు వంటి అంశాలనూ గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

3 శాతానికి పైగా పతనమైన సెన్సెక్స్
గత వారం సెన్సెక్స్ 3.28 శాతం అంటే 1,249.04 పాయింట్ల నష్టపోయింది. ఆఖరికి 36,841 పాయింట్ల వద్ద ముగిసింది. దివాన్ హౌసింగ్, యస్ బ్యాంక్ వంటి షేర్లు భారీగా పతనం కాగా, మార్కెట్ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిఫ్టీ 11,143 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్ రంగ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దివాన్ హౌసింగ్ ఏకంగా 50 శాతం, యస్ బ్యాంక్ 29 శాతానికిపైగా పతనమైంది. మొత్తంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థలో తలెత్తిన పరిస్థితులు ఇతర ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) షేర్లపై ప్రభావం చూపాయని, మరోవైపు ఆర్‌బిఐ యస్ బ్యాంక్ సిఇఒ పదవీ కాలం కుదింపు వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు, డిఫాల్ట్ వార్తలు షేరును కుప్పకూలేలా చేశాయి. కంపెనీ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చినా కౌంటర్లో అమ్మకాలకు అడ్డుకట్టపడలేదు. ట్రేడింగ్ చివరకు కొంత కోలుకొని షేరు ధర 42 శాతం పైన నష్టపోయి రూ.350 వద్ద ముగిసింది.

ఒక్క రోజులో కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.10వేల కోట్లు ఆవిరయ్యాయి. డిహెచ్‌ఎల్‌ఎఫ్ దెబ్బకు ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. మరోవైపు ప్రైవేటురంగ యస్ బ్యాంక్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ పదవీకాలం పొడగింపును ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అంగీకరించకపోవడంతో ఆ ప్రభావం షేర్లపై పడింది. శుక్రవారం ఆరంభ ట్రేడింగ్ నుంచే భారీ నష్టాలతో మొదలైన బ్యాంకు షేరు విలువ ఒక దశలో 34 శాతం తగ్గి 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ ఆఖరికి 30 శాతం నష్టంతో రూ.225 వద్ద ముగిసింది. అయితే రాణా కపూర్‌ను బ్యాంకు సిఇఒగా మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఆగస్టులో యస్ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బిఐ నిరాకరించి, రాణా పదవీకాలాన్ని 2019 జనవరి 31 వరకు కుదించింది.దీంతో గతవారం బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీలవిలువ రూ.1,50,70,832 కోట్ల నుంచి రూ.5,66,187 కోట్లు కరిగిపోయాయి.

ఫైనాన్షియల్ మార్కెట్లపై ఆర్‌బిఐ, సెబీ నిఘా

ఫైనాన్షియల్ మార్కెట్ల పరిణామాలను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పరిశీలిస్తున్నాయి. శుక్రవారం ఈక్విటీ, డెబిట్ మార్కెట్లలో భారీ పతనం నేపథ్యంలో అవసరమైతే చర్యలు చేపట్టాలని ఈ సంస్థలు భావిస్తున్నాయి. సోమవారం మార్కెట్లలో అలజడి నెలకొనకుండా చర్యలు చేపట్టేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తున్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్ డిఫాల్ట్‌ల నేపథ్యంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ కూడా ఎన్‌బిఎఫ్‌సి రంగానికి రుణ సహకారం అందించాలని చూస్తోంది.