Home తాజా వార్తలు శతాధికం

శతాధికం

ready for election at any time

వందకుపైగా సీట్లు మనవే

ఎన్నికలకు ఎవర్ రెడీగా ఉండండి
ముగ్గురికి తప్ప సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు
కొంతమంది ఎంఎల్‌ఎలపై ఫిర్యాదులు ఉన్నాయి
వారు తమ విధానాలు మార్చుకోవాలి
మమ్మల్ని విమర్శించే కాంగ్రెసోళ్లూ పార్టీలోకి రావాలని చూస్తున్నారు : పార్టీ కీలక సమావేశంలో కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : ‘ఎన్నికలకు నేను సిద్దంగా ఉన్నా…. మీరూ సిద్ధంగా ఉండండి… ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికలెప్పుడు వచ్చినా మళ్ళీ మనదే అధికారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లకుపైగా గెలవబోతున్నాం. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి’ అని పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షు డు, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేయడం పార్టీ నేతల్లో నైతికబలాన్ని పెంచింది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడిన అంశాలను పార్టీవర్గాలు మీడియాకు అనధికారికంగా వివరిస్తూ, ప్రభు త్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తితో ఉన్నారని, మరింత పెద్దఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం చూస్తుం టే ఎన్నికలు గడువు శతాధికం తరుముకొస్తున్నట్లే కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిట్టింగ్ శాసనసభ్యుల్లో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నొక్కిచెప్పిన కెసిఆర్ ముగ్గురికి తప్ప దాదాపు అందరికీ ఈసారి టిక్కెట్లు ఇస్తామని భరోసా కల్పించారు. కొంతమంది ఎమ్మెల్యేలపై ఆ నియోజకవర్గాల ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వారు తమ విధానాలను వెంటనే మార్చుకోవాల్సిందిగా సిఎం హెచ్చరించారని పేర్కొన్నాయి. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ఏదైనా సమస్య ఉంటే మాత్రం దానిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామంటూ ధైర్యం నూరిపోశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. టిక్కెట్లు రానివారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్నారు. నిత్యం టిఆర్‌ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసే కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని కానీ ఇప్పటికే హాస్‌ఫుల్ అయినందున కొత్తవారిని చేర్చుకోడానికి అవకాశం లేదన్నట్లు సిఎం సంకేతాలిచ్చారని తెలిపాయి.

కొంగరకొలన్ ‘ప్రగతి నివేదన’పై సూచనలు :
నాలుగున్నర సంవత్సరాలల్లో ప్రభుత్వం సాధించిన విజయాలపై సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని కొంగరకొలన్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభ నభూతో… నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహిస్తామని సిఎం ధీమా నూరిపోశారు. సాధించిన ప్రగతితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు, హామీ ఇవ్వకపోయినా అమలుచేస్తున్న పథకాల గురించి ఈ సభలో ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారని పార్టీ వర్గాలు ఉదహరించాయి. ఈ సభలో కెసిఆర్ సుమారు గంటన్నర పాటు ప్రసంగించనున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారని, పాతిక లక్షల మందితో నిర్వహించే ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యతను ప్రతి నాయకుడూ తన భుజస్కంధాలపై వేసుకుని పనిచేయాలని సూచించినట్లు వివరించాయి. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 25 వేల మందికి తగ్గకుండా జనసమీకరణ జరగాలని, మహిళల సంఖ్య గణనీయంగా కనిపించాలని నొక్కిచెప్పినట్లు పేర్కొన్నాయి. ఎన్నికల సమరానికి ‘ప్రగతి నివేదిన’ బహిరంగసభ నాందిగా ఉంటుందని, ఈ వేదిక ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని మోగిద్దామంటూ పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారని తెలిపాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఎన్నికలపై పూర్తి నిర్ణయాధికారాన్ని తనకే అప్పజెప్పినట్లు గుర్తుచేసిన కెసిఆర్ ‘మీ నిర్ణయాన్ని కూడా తెలపండి’ అంటూ ఈ సమావేశంలో పార్టీ శ్రేణుల్ని కోరారని, దీనికి స్పందనగా ‘మీకే అధికారాన్ని కట్టబెడుతున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మేతమే’ నంటూ హర్షధ్వానాలతో మద్దతును, అంగీకారాన్ని తెలియజేశారని ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై సంతృప్తిని వ్యక్తంచేసిన కెసిఆర్ ‘ఎన్నికల విషయాన్ని నాకు వదిలిపెట్టేయండి. మీరంతా సమిష్టిగా మీమీ నియోజకవర్గాల్లో కలిసి పనిచేయండి’ అంటూ సూచించారని వివరించాయి. ప్రగతి నివేదన సభకు అవసరమైన ప్రచార సామాగ్రిని పలువురు నేతలకు పార్టీ కార్యాలయం పంపిణీ చేసింది.

ముందస్తుపై స్పష్టత ఇచ్చిన కెసిఆర్?
ఢిల్లీ పర్యటన తర్వాత ‘ముందస్తు’పై స్పష్టత వస్తుందంటూ పార్టీ శ్రేణులతో కెసిఆర్ వ్యాఖ్యనించినట్లు తెలిసింది. మంత్రులతో మూడు రోజుల క్రితం సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. దాదాపు ‘ముందస్తు ఎన్నికలు’ అనివార్యం అనే అభిప్రాయంలో ఉన్న పార్టీ శ్రేణులకు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని, సెప్టెంబరు 2వ తేదీన ‘ప్రగతి నివేదన’ సభ ద్వారానే యావత్తు తెలంగాణ ప్రజలకు స్పష్టతను ఇద్దామని సంకేతాలిచ్చినట్లు తెలిసింది. కెసిఆర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటనపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి భారీ స్థాయిలో ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్న ఉద్దేశ్యంతోనే శుక్రవారం ఎస్‌సి, ఎస్‌టిలకు 101 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం, అన్ని వెనకబడిన కులాలకు ‘ఆత్మగౌరవ భవనాలు’, పలు కార్పొరేషన్లకు నామినేటెడ్ చైర్మన్ పదవుల భర్తీ తదితర కీలక నిర్ణయాలు తీసుకున్నారని పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.