Home లైఫ్ స్టైల్ ‘రెరా’లో నమోదు చేసుకొవాల్సిందే..!

‘రెరా’లో నమోదు చేసుకొవాల్సిందే..!

Real estate lenders consultants should register their names

నిర్మాణంలోని బహుళ అంతస్థుల భవనాలు
డ్రాఫ్ట్ , ఫైనల్ లేఅవుట్ వెంచర్లు
నమోదులేని పథకాల విక్రయాలకు జరిమానాలు
జాగ్రత్తలుపడాల్సింది పోర్టల్స్, బ్రాండ్ అంబాసిడర్లు
హెచ్‌ఎండిడి, డిటిసిపి లేఅవుట్లకు గుర్తింపు

ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాల్లో ఏమి జరిగిందో ప్రస్తావన అనవసరం. కానీ, ఇప్పుడు అమ్మకాలు, కొనుగోలులో, నిర్మాణాలు, లేఅవుట్ల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనం స్పష్టంగా ఉండాల్సిందే. నియమనిబంధనల మేరకు ప్రతి రియల్టర్ వ్యవహరించాల్సిందే. కొనుగోలుదారులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విక్రయదారులు తమతమ నిర్మాణాలు, లేదా లేఅవుట్లను అభివృద్ధిపరిచి అప్పగించాల్సి ఉన్నది. అలా జరగని నేపథ్యంలో నష్టపరిహారం, జరిమానాలు, లైసెన్సులపై కఠినచర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక చట్టం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరా అథారిటీ(రెరా) అమలులోకి వచ్చింది. ఈ చట్టం జనవరి 1, 2017 తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. ఈ తేదీ నుండి ఎవరైనా 8 ఫ్లాట్లకు మించిన బహుళ అంతస్థుల భవనం నిర్మించినా, 500 చ.మీ.లకు పైబడిన స్థలంను అభివృద్ది పరిచిన వరారెవరైనా రెరాలో నమోదు చేసుకోవాలి. ప్రతి రియల్టర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ పోర్టల్స్, భూవ్యాపారాలు చేసే కన్సల్టెంట్లు సైతం తమ పేర్లను, సంస్థలను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నది.

నమోదు లేకుంటే జరిమానాః జనవరి 1, 2017 నుండి తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీ వద్ద రియల్టర్లు, డెవలపర్లు, ఏజెంట్లు, పోర్టర్లు, బ్రోకర్లు, కన్సల్టెంట్లు భూ, నిర్మాణాలకు సంబంధించి వ్యాపారం చేసే వారందరూ తమతమ పేర్లను, సంస్థలను రిజిస్ట్టర్ చేసుకోవాలి. ఏ రాష్ట్రంలో నమోదు చేసుకున్నవారు ఆ రాష్ట్రంలోనే క్రయవిక్రయాలు జరపాలి. ఇతర రాష్ట్రాల్లో ఈ నమోదు చెల్లుబాటుకాదు. నమోదు చేసుకోకుండా భూ, స్థిరాస్తి(ప్లాట్లు, ఫ్లాట్లు) వ్యాపారాలను చేయరాదు. అలాచేసిన వారికి ప్రతిరోజు రూ. 10 వేల వరకు జరిమానా విధించబడుతుంది. రెరా లో నమోదుచేసుకోపి ప్లాట్లను, ఫ్లాట్లను విక్రయించరాదు. నమోదు లేని ప్లాట్లు, ఫ్లాట్లును అమ్మకాలు జరిపితే సంబంధిత ఆస్తి విలువలో 5 శాతం జరిమానా విధిస్తారు. ఆ జరిమానాను చెల్లించకుండా తమతమ వ్యవహారాలను కొనసాగిస్తే 10 శాతం జరిమానాగా విధిస్తారు. అయినా మార్పురాని పక్షంలో ఏడాదిపాటు జైలు శిక్ష విధించే అధికారం రెరాకు ఉంటుంది.

ఐదేళ్లు గ్యారంటీ ఇవ్వాలి: హెచ్‌ఎండిఎ పరిధిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారు, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రి ప్లానింగ్ పరిధిలోకి వచ్చే లేఅవుట్లు, భవన నిర్మాణాలను సైతం రెరాలో నమోదు చేయాల్సి ఉంది. నమోదు ప్రకారంగా రియల్టర్లు తమతమ నిర్మాణాలు, లేఅవుట్లలో మౌలిక వసతులను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. వాటికి ఐదేళ్ళ పూచీకూడా ఇవ్వాలి. అలా చేయని వాటిల్లో డెవలపర్లు, ఏజెంట్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. భూమికి సంబంధించి టైటిల్ డీడ్ గ్యారంటీ ఇవ్వాలి. తమ ప్రచారానికి ముద్రించిన బ్రోచర్‌లోని అన్ని వసతులను డెవలపర్లు కల్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో అందుకు రెరా తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

2017 నుండి అమలు : తెలంగాణ రాష్ట్రంలో 2017, జనవరి 1 నుండి రెరా అమలులోకి వచ్చింది. ఈ తేదీ అనంతరం చేపట్టిన రియల్ వ్యాపారానికి సంబంధించిన వెంచర్లన్నిటినీ రెరాలో నమోదుచేసుకోవాల్సిందే. అయితే, రెరా సంస్థ కార్యాలయం ప్రారంభం కానందున వారందరికీ వెసులుబాటు లభించింది. సంస్థ కార్యకలాపాలు, నిర్వాహణ మొదలయ్యాక మూడు నెలల సమయం ఇవ్వడం జరుగుతుందని, ఆ సమయంలో ప్రచారంలో ఉన్నవి, నిర్మాణ, అభివృద్ధి దశలో ఉన్న వెంచరర్లు రెరాలో రిజిష్టర్ చేసుకోవాలి. లేని పక్షంలో చర్యలు తప్పవు. డ్రాఫ్ట్ లేఅవుట్, అయినా ఫైనల్ లేఅవుట్ అయినా రెరాలో నమోదు తప్పని సరి. డ్రాఫ్ట్ లేఅవుట్ తీసుకుని ప్లాట్లు విక్రయాలు పూర్తిచేసుకుని ఫైనల్ లేఅవుట్‌ను తీసుకోని వారు కూడా రెరాలో నమోదు చేసుకోవాలి.

పోర్టల్స్, అంబాసిడర్లు జాగ్రత్తః రియల్ ఎస్టేట్ రంగంలో బ్రాండ్ అంబాసిడర్లు, వెంచర్లను ప్రచారంచేసే సంస్థలు, అడ్వర్టైజ్‌మెంట్ చేసే వారు రెరాలో నమోదు కానవసరంలేదు. కానీ, కమిషన్ తీసుకుని లేదా మార్జిన్‌పెట్టుకుని క్రయవిక్రయాలు జరిపేవారు రెరాలో రిజిష్టర్ అయి ఉండాలి. పోర్టల్స్ కూడా ఇష్టానుసారంగా ప్రచారం చేయడానికి వీలులేదు. రెరాలో నమోదుకాబడిన ప్రాపర్టీలను మాత్రమే పోర్టల్స్‌లో తెలియపరచాలి. అలాగే పత్రికలు, ప్రసార మాధ్యమాలు రెరాలో నమోదైన నంబర్ ఉంటేనే వాటిని అనుమతించాల్సి ఉంటుంది. రెరా అనుమతిలేని ప్రాపర్టీలను ప్రచారం, ప్రసారం చేయడంతో భవిష్యత్తులో కొనుగోలుదారుల నుండి సవళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బ్రాండ్ అంబాసిడర్లు తాము తెలియజేస్తున్న వెంచర్లకు, నిర్మాణాలకు రెరాలో నమోదు నెంబర్ ఉన్నదా..? లేదా..? అనేది చేసుకోవాలి. వెంచర్లలో పేర్కొన్నట్టు అన్నిరకాల అభివృద్ధి జరుగుతుందా..? లేదా..? అనేది చూసుకొని చేయాలి. లేదంటే కొనుగోలు దారుల నుండి ఎదురయ్యే సవాళ్ళకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి రెరాలో నమోదుకానటువంటి ఆకర్షణీయమైన అంశాలను లేదా వసతులను బ్రోచర్లులో తెలియపరుస్తారు. ప్రచారకర్తలతో చెప్పిస్తారు. మరిన్ని అదనపు విషయాలను వెల్లడిస్తారు. అనంతరం ఆ వసతులను కల్పించకుండానే వెళ్ళిపోతారు. దీనిని కొందరు వినియోగదారుల ఫోరంలో కొనుగోలుదారుల సవాల్ చేస్తే మాత్రం బ్రాండ్ అంబాసిడర్లు కూడా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఒప్పందాల్లోనూ మార్పులుః రెరా అమలు నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు అందులో తమ పేర్లు, సంస్థలను రిజిష్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చట్టం రావడంతో డెవలపర్లు, కాంట్రాక్టర్లు, సైట్ ఇంజనీర్ల మధ్య నిర్మాణాలు, లేఅవుట్ల అభివృద్ధి విషయంలో జరిగే ఒప్పందాల్లోనూ మార్పులు ఉంటాయి. ఇప్పటి వరకు వీరి మధ్య నాణ్యత విషయంలో స్పష్టంగా షరతులు ఉండేవి కావు. కానీ, రెరా చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో నాణ్యత, క్యూరింగ్, నిర్మాణ నిర్థిష్ట కాలం వంటి వాటిల్లో ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది.

ప్రధానంగా నిర్మాణ కాలం, నాణ్యతపై షరతులు, బాధ్యత వహించడం స్పష్టంగా రాసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కొనుగోలుదారులు నాణ్యతపై ప్రశ్నిస్తే అందుకు బాధ్యత కాంట్రాక్టర్లు వహించేట్టు ఒప్పందాలు రాసుకోవడం తప్పనిసరి. అయితే, ఈ షరతులు రావడంతో కాంట్రాక్టర్లు తమ ధరలను పెంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సాధారణ నిర్మాణాలకు చ.అ. నిర్మాణ ధర రూ. 1300లుగా, ఏడంతుస్థుల భవనాలకు రూ. 1400 నుండి మొదలు, ఏడంతస్థులకుపై భవనాలకు రూ. 2000 వరకు ఉంటుందని, ఇప్పుడు రెరా అమలుతో కాంట్రాక్టర్లు కనీసంగా చ.అ.కు రూ.50 100లు పెంచే అవకాశాలున్నాయి. ఫలితంగా నిర్మాణాల ధరలు కాస్తంత ప్రియం కానున్నాయి. అందుకు తగినట్టుగా నాణ్యతలు, వసతులు కల్పించడం జరుగుతుంది.

సెప్టెంబర్‌లో ప్రారంభంః రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యాయం వచ్చే నెల సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నది. రెడ్‌హిల్స్‌లోని డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రిప్లానింగ్ ప్రధాన కార్యాలయంలోని కింది అంతస్థులో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయం ప్రారంభమయ్యాక ప్రస్తుత నిర్మాణంలో ఉన్నవి, వెంచర్లుగా వెలుస్తున్నవి రెరాలో నమోదుచేయడం తప్పనిసరి. నమోదుకు కనీసం మూడు నెలల గడువును ఇవ్వాలని రెరా నిర్ణయించింది. ఈ మూడు నెలల కాలంలో నమోదు చేసుకోనివారిపై చర్యలుంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, లేఅవుట్లు, డ్రాఫ్ట్‌లేఅవుట్లు, ఫైనల్ లేఅవుట్లు తీసుకోనివారు కూడా రెరాలో నమోదు చేసుకోవాలని అథారిటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

                                                                                                                                  -మంచె మహేశ్వర్, మన తెలంగాణ