Home రంగారెడ్డి రియల్ జోష్…

రియల్ జోష్…

land

*జోరందుకున్న రియల్ ఎస్టేట్ రంగం
*ఖజానాకు కాసుల గలగల
*ఏడాదిలో రెట్టింపైన భూముల ధరలు
*కనీస అనుమతులు లేకుండానే
అవుట్‌లు

మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
రియల్ రంగం దూకుడు ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే రియల్ రంగం పడిపోతుందని భయపడ్డ జిల్లా వాసులు ఒక్కసారిగా పెరుగుతున్న భూముల ధరలను చూసి షాక్ తింటున్నారు. సంవత్సరం క్రితం కోటి రూపాయలు ఎకరం పలికిన భూములు ప్రస్తుతం మూడు కోట్లు పెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నగర శివారులకు పరిమితం అయిన రియల్ వ్యాపారం కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం గ్రామాలకు సైతం విస్తరించింది. కొత్త కలెక్టరేట్‌లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలతో పాటు గ్రామీణ మండలాల్లో సైతం భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ ప్రాంతాలలో ఇప్పటికే గజం భూమి లక్ష రూపాయలు పలుకుతుండగా కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటు  చేస్తున్న కొంగర కలాల్ వంటి ప్రాంతాల్లో గత సంవత్సరం పలికిన ధరలకు మూడు ఇంతలు పలుకుతున్నాయి. నగర జీవనంతో విసిగి వేసారి స్వంత ఇంటి కళతో జిల్లాలోని శివారు మండలాల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో భూముల ధరలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. హయత్‌నగర్, సరూర్‌నగర్, శంషాబాద్, గండిపేట్, మొయినాబాద్, ఇబ్రహింపట్నం, మహేశ్వరం మండలాల వైపు నగర ప్రజలు పరుగెడుతుండటంతో కలసివస్తున్న అవకాశంను రియల్టర్‌లు సద్వీనియోగం చేసుకుంటున్నారు. గత సంవత్సరం గజం భూమి 6-7 వేలు పలికిన చోట ఇప్పుడు 12-15 వేలు పలుకుతున్న ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో సైతం రియల్ దూకుడుగా సాగుతుంది. జిల్లా పరిధిలో మెజారీటి ప్రాంతం ఇప్పటికే పట్టణీకరణ చేందగా గ్రామీణ మండలాల్లో సైతం భూముల ధరలు కోట్లు పరిగెత్తుతున్నాయి. కీసర, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లో భూములు తెలంగాణ రాకముందు ఉన్న ధరలకు పోల్చితే రెండింతలు అధికం అయ్యాయి. హైద్రాబాద్- బీజాపూర్ రూట్‌లో మొయినాబాద్, చెవెళ్ల మండలాల్లో భూముల ధరలు ఆకానికి తాకుతున్నాయి. వికారాబాద్ కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన అనంతరం వికారాబాద్ , తాండూర్, పరిగి నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలలో సైతం భూములకు మంచి డిమాండ్ వచ్చింది. వికారాబాద్ చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ భూములు కాస్తా లేఆవుట్‌లుగా మారగా మరికొన్ని ఫాంహౌస్‌లుగా మారిపోయాయి.
కాసుల గలగల….
రియల్ దూకుడుతో సర్కార్ ఖజనా నిండటంతో పాటు అధికారులకు, రియల్టర్‌లకు పంట పండుతుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో వంద లేఆవుట్‌లు ఏర్పాటు చేస్తే అందులో 90 లేఆవుట్‌లు కనీస అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తుండటంతో రెవెన్యూ, పంచాయతీ, హెచ్‌యండిఎ అధికారులకు జెబులు నిండుతున్నాయి. జి.ఓ 111 అమలులో ఉన్న మొయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, షాబాద్, చెవెళ్ళ మండలాల పరిధిలోని గ్రామాల్లో పనిచేయడానికి అధికారులు పోటి పడుతుండటం చూస్తే పరిస్థీతులు అర్ధం చేసుకోవచ్చు. గండిపేట్, హిమాయత్‌సాగర్ చెరువులకు అనుకోని వెలుస్తున్న లేఆవుట్‌లు అధికారులకు బంగారు కోడిని తలపిస్తుండటంతో పండుగ చేసుకుంటున్నారు. గతంలో జి.ఓ 111 ఉన్న ప్రాంతాల్లో లేఆవుట్‌లు ఏర్పాటు చేయాలన్న, ప్లాట్లు కొనుగోలు చేయాలన్న ప్రజలు బయపడుతుండగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారులు, హెచ్‌యండిఎ యంత్రాగం రియల్టర్‌లకు సహకారం చేస్తుండటంతో ఎటువంటి భయం లేకుండా లేఆవుట్‌లు ఏర్పాటు చేయడం ప్లాట్లు విక్రయించడం జరుగుతుండటంతో ఖజానాకు, అధికారులకు కలసివస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రస్తుత ఆర్థీక సంవత్సరంకు నిర్దేశించిన లక్ష్యాలను మించి నిధులు వచ్చి చేరుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో జనవరిలో 10148 డాక్యుమెంట్‌ల ద్వారా 65.48 కోట్లు, ఫిబ్రవరిలో 12861 డాక్యుమెంట్‌ల నుంచి 106.16 కోట్లు, మార్చిలో 16938 డాక్యుమెంట్‌ల నుంచి 140.87 కోట్లు, ఎప్రిల్‌లో 115.68 కోట్లు, మేలో 107.69 కోట్లు, జూన్‌లో 160.49 కోట్లు, జూలైలో 131.59 కోట్లు, ఆగస్టులో 112.18 కోట్లు, సెప్టెంబర్‌లో 116.26 కోట్లు, అక్టోబర్‌లో 112 కోట్లు ఖజానాకు వచ్చి చేరాయి. మేడ్చల్ జిల్లాలో సైతం ఇదే దూకుడు కనిపిస్తుంది. లక్ష్యాలను మించి నిధులు ఖజానాకు వచ్చి చేరుతున్నాయి. వికారాబాద్ గ్రామీణ జిల్లాలో సైతం రియల్ జోష్‌తో చాలా మందికి కలసివస్తుంది. రియల్ రంగం దూకుడు మీద ఉండటంతో స్థానికంగా ప్రజా ప్రతినిధులు, మాజీలకు సైతం మంచి డిమాండ్ వచ్చింది.