Home బిజినెస్ కోలుకున్న ఈక్విటీ మార్కెట్లు

కోలుకున్న ఈక్విటీ మార్కెట్లు

bs

వరుసగా మూడు వారాల నష్టాల తర్వాత కొనుగోళ్ల జోరు

న్యూఢిల్లీ: వరుసగా మూడు వారాలుగా నష్టాలను నమోదు చేసిన తర్వాత ఎట్టకేలకు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వారాంతం శుక్రవారం మాత్రం షేర్లు తగ్గి ఉండడంతో కొనుగోళ్లు వెత్తి.. లాభాలు నమోదు చేశాయి. అయితే ఎల్‌ఒయు(లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్) ద్వారా నీరవ్ మోడీ పిఎన్‌బిని రూ. 11,500 కోట్ల మేర మోసగించిన కేసు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీని కారణంగా బ్యాంకింగ్ షేర్లు, జువెలరీ షేర్లు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కుంభకోణం, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అంచనా వెరసి మార్కెట్లు గత కొద్ది రోజులుగా పతన బాటలో పయనిస్తున్నాయి. వారాంతాన విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో పుంజుకున్నాయి. మొత్తానికి సెన్సెక్స్ గతవారంలో 131 పాయింట్లు(0.4 శాతం) మాత్రమే లాభపడింది. ఆఖరి సెన్సెక్స్ 34,142 వద్ద స్థిరపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 39 పాయింట్లు(0.4 శాతం) లాభపడి 10,491 వద్ద ముగిసింది. చిన్న షేర్లు మార్కెట్ల మాదిరిగానే నష్టాలను నమోదు చేశాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.25 శాతం మేరకు బలహీనపడ్డాయి. రూపాయి బలహీనపడటంతో సెన్సెక్స్ దిగ్గజాలలో టిసిఎస్ 5 శాతం, ఇన్ఫోసిస్ 3 శాతం పెరిగింది. ఇదే బాటలో యస్‌బ్యాంక్ 4 శాతం, కొటక్ బ్యాంక్ 3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఆటో బ్లూచిప్స్ బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ 4 శాతం, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్ 3 శాతం నష్టపోయాయి. కాగా ఆఖరి రోజు శుక్రవారం మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగాల్లో భారీ కొనుగోళ్లు లాభాల ముగింపునకు కారణమయ్యాయి. రంగాల వారీగా చూస్తే అన్ని సెక్టార్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో సెంటిమెంటు బలపడింది. దీంతో దేశీయంగానూ ఎలాంటి ప్రతికూలాంశాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. చివరి అరగంటలో సెన్సెక్స్ సూచి అత్యధికంగా 347 పాయింట్ల లాభపడి 34168 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసింది. బ్యాంకింగ్, లోహ, లోహ, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన షేర్లు ర్యాలీ బాటపట్టాయి. అయితే మార్కెట్లో ప్రధానంగా మెటల్, ఫార్మా షేర్లు మంచి లాభాలతో దూకుడుగా ఉన్నాయి. మెటల్ సూచి 3.19 శాతం లాభపడి 4,028.80 వద్ద, ఫార్మా సూచి 2.64 శాతం ర్యాలీ 9,095.40 వద్ద ముగిసింది.