Home హైదరాబాద్ జలమండలిలో ఖాళీల భర్తీపై కసరత్తు

జలమండలిలో ఖాళీల భర్తీపై కసరత్తు

HMWSSB

సిటీబ్యూరో: ఖాళీల భర్తీపై జలమండలి కసరత్తు ప్రారంభించింది. ఒక వైపు ప్రతి నెల పెద్ద సంఖ్యలో ఉద్యోగుల పదవీ విరమణ, ఖాళీల భర్తీలో  జాప్యం తదితర కారణాలు బోర్డును ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో 1400 పోస్టులను తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరముంది. 1989లో మహానగర మంచినీటి, మురుగునీటి  పారుదల విభాగంగా అవిర్భవించింది. అప్పట్లో నగరవ్యాప్తంగా ఉన్న 169.30 చదరపు కిలోమీటర్ల మేర నీటి సరఫరా వ్యవస్ధలో 6200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తూ నగరవాసులకు తాగునీటిని అందించేవారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్( ఎంసీహెచ్) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషగా (జీహెచ్‌ఎంసీ)గా రూపాంతరం చెందినది. ఈ నేపథ్యంలో జలమండలి  518.9 స్కేర్ కిలోమీటర్ల మేర పరిధిలో సేవలు అందించే బాధ్యతలు తీసుకుంది. ఇదే క్రమంలో 2007 జూలైలో నగర శివారు పన్నెండు మున్సిపాలిటీలకు సంబంధించిన తాగునీటి, మురుగునీటి బాధ్యతను సైతం ప్రభుత్వం జలమండలికి అప్పగించింది. అలాగే  ఔటర్ లోపల గ్రామాల పరిధిని జలమండలి పరిధిలోకి వచ్చాయి.

ఈ క్రమంలో జలమండలి పరిధి  768 స్కేర్ కిలోమీటర్ల మేర  విస్తరించింది. పెరుగుతున్న జనాభాకనుగుణంగా నగరంలో మంచినీటి, మురుగునీటి అవసరాలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా జలమండలి ఉద్యోగులు, సిబ్బంది నిరంతరంగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అయితే  బోర్డు ఉద్యోగులకు సంబంధించి ప్రతినెల వరుస పదవీ విరమణలు జరుగుతుండటంతో భారీ స్ధాయిలో ఖాళీలు ఏర్పడుతున్నాయి.  ప్రతి నెల గణనీయ సంఖ్యలో పదవీ విరమణ పొందుతున్న స్ధానంలో ఆశించిన స్ధాయిలో కొత్త ఉద్యోగుల నియామకాలు జరగడం లేదు. ప్రస్తుతం కోటికి చేరిన మహానగర  జనాభాకు తగ్గట్టుగా జలమండలి ప్రతినిత్యం వివిధ జలాశయాలు, నదుల నుంచి తాగునీటిని సేకరించి దాదాపు 9.60 లక్షల నల్లా కనెక్షన్లకు సరఫరా చేస్తోంది.  ఒకవైపు అదనపు నీటి సేకరణ, మరోవైపు తాగునీటి అవసరాలను తీర్చడంలో  బోర్డు ఉద్యోగులు విశేషంగా కృషి చేస్తున్నారు.  అయితే వరుస పదవీవిమరణలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో బోర్డు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటుంది.

ప్రస్తుతం జలమండలిలో అన్ని విభాగాలు కలిపి 6109 పోస్టులకు గాను 5021 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో కూడ వెయ్యి మంది అవుట్‌సోర్సీంగ్ సిబ్బంది పని చేస్తున్నారు. పలు విభాగాల్లో ఏర్పడిన ఉద్యోగుల కొరతతో ప్రస్తుతం ఒక్కో అధికారి రెండేసీ పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండంటంతో ఆ  ప్రభావం పౌరసేవలపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే అన్నీ క్యాండర్‌లో ఉద్యోగుల ఖాళీలపై కసరత్తు  చేసిన జలమండలి ఉన్నతాధికారులు దాదాపు 1400 పోస్టులు తక్షణం అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల జలమండలిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట తారకరామరావుతో జరిపిన సమీక్ష సమావేశంలో ఉద్యోగుల భర్తీ అంశాన్ని ఉన్నతాధికారులు  ఆయన దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలిసింది.  దీనిపై స్పందించిన మంత్రి బోర్డులో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ ఖాళీల  భర్తీ ప్రతిపాదనలో కదలిక వచ్చింది.  త్వరలోనే ఈ పోస్టుల నియమాకానికి సంబంధించి ప్రభుత్వం అనుమతి కోరుతూ జలమండలి లేఖ రాయనున్నట్లు బోర్డు అధికార వర్గాలు వెల్లడించాయి.