Search
Thursday 15 November 2018
  • :
  • :

పంచాయతీకి కార్యదర్శి

recruitment process in course of week, completed in two months

త్వరలో 9200 మంది నియామకం 

ఇన్‌చార్జ్ విధానానికి స్వస్తి
కొత్త కార్యదర్శులకు మూడేళ్ల ప్రొబేషన్ కాలం
వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ, రెండు నెలల్లో పూర్తి
పల్లెలను ప్రగతి సీమలుగా మార్చడంలో కార్యదర్శులకు కీలకపాత్ర
సమీక్షలో సిఎం 

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతీ గ్రామ పంచాయితీకి కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలని, ఇందుకోసం ఇప్పుడున్న 3,562 మంది కార్యదర్శులకు అదనంగా కొత్తగా 9,200 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీలను చిన్న పెద్దా అనే తేడా చూడొద్దని, ప్రతీ పంచాయతీకి కార్యదర్శి కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం పంచాయతీలలో కొనసాగుతున్న ‘ఇన్‌చార్జ్జ్ కార్యదర్శి’ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. ప్రగతిభవన్‌లో ఆదివారం పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరుల తో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి పై ఆదేశాలు జారీచేసిన ట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నియామక ప్రక్రియతో పాటు పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలను రూపొందించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు సిఎం ప్రకటించారు. పల్లెసీమలను ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకమని, కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయితీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలని, విధులు నిర్వహించలేనివారిని క్రమబద్ధీకరించకుండా ఉండే విధంగా విధానాన్ని రూ పొందించాలని సిఎం స్పష్టంచేశారు. ప్రొబేషన్ సమయంలో వారికి నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకంలో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ను పాటించాలని చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్ స్థాయిలో కార్యదర్శుల నియామకం జరగాలని సూచించారు. రాష్ట్రం లో పాత, కొత్త పంచాయతీలు మొత్తం 12,751 ఉన్నాయని, ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులున్నారని, మిగిలినచోట్ల ‘ఇన్‌ఛార్జి’లు ఉన్నారని కెసిఆర్ పేర్కొన్నారు. ఇటీవలే ప్రభుత్వం కొత్తగా గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసిందని, పాత గ్రామ పంచాయితీల్లో కూడా పలు కార్యదర్శి పోస్టులు ఖాళీలున్నాయని, అన్ని గ్రామాలకు విధిగా పంచాయితీ కార్యదర్శులుండాలని, ఒక కార్యదర్శి మరో పంచాయితీకి ఇన్ చార్జిగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని సిఎం స్పష్టం చేశారు.అందులో భాగమే కొత్తగా 9200 మందిని పంచాయితీ కార్యదర్శులను నియమించాలని నిర్ణయం తీసుకోవడం అని పేర్కొన్నారు.

వికాస కేంద్రాలుగా గ్రామాలు
‘గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు అని ప్రభుత్వం నమ్ముతోంది. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి గ్రామాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.పరిపాలనా సౌల భ్యం కోసం, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే కొత్త పంచాయితీలను ఏర్పాటు చేసింది’ అని సిఎం వ్యాఖ్యానించారు. పంచాయితీల పరిధిలో హరితహారం కార్యక్రమం అమలు చేయడం, గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూలు, మురికి కాలువలు, విద్యుత్ దీపాల నిర్మాణం-తో పాటు నిర్వహణ, అంటువ్యాధులు ప్రబలకుండా చూడడం, దోమల నివారణ, స్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు లాంటి ఎన్నో బాధ్యతలు గ్రామ పంచాయితీకున్నాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ పాలకవర్గంతో కలిసి గ్రామ కార్యదర్శి ఈ బాధ్యతలన్నింటినీ నిర్వహించాల్సి ఉంటుందని, అందుకే ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శి విధిగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కనీస స్థాయిలో 200 జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శితో పాటు మొత్తం పాలకవర్గం కలిసి కష్టపడి పనిచేస్తే రెండు మూడేళ్లలోనే ఎంతో మార్పు వస్తుందని, తెలంగాణ గ్రామాలు యావత్తు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా వెలుగొందుతాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలెక్కడున్నాయంటే తెలంగాణలోనే అనే గుర్తింపు రావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Comments

comments