Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి రాబడి డీలా

gst

అక్టోబర్ కంటే నవంబర్ నెలలో తగ్గిన వసూళ్లు

హైదరాబాద్ : జిఎస్‌టి విధానం అమల్లోకి వచ్చిన అనంత రం దేశవ్యాప్తంగా వసూళ్ళు ఐదు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇది దేశవ్యాప్త పరిస్థితే అయినా, తెలంగాణలో సైతం ప్రతిబింబిస్తోంది. అక్టోబరు నెలలో రూ.1472.33 కోట్ల మేరకు వసూలు కాగా, నవంబరులో అది 1404.08 కోట్ల కు తగ్గింది. ఎక్సైజ్ పన్ను నుంచి జరిగే సర్దుబాటు సైతం రూ. 368 కోట్ల నుంచి రూ. 336.31 కోట్లకు తగ్గింది. ఇక రాష్ట్ర జిఎస్‌టి వసూళ్ళు కూడా రూ. 850. 66 కోట్ల నుంచి రూ.750.51 కోట్లకు తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన ఐజిఎస్‌టి వాటా మాత్రం స్వల్పంగా పెరిగింది. అక్టోబరులో జిఎస్‌టి పన్ను వసూ ళ్ళ వృద్ధిరేటు 26.34 శాతం ఉంటే నవంబరులో అది 25.69 శాతానికి తగ్గిపోయింది. పండుగల సీజన్‌లో పన్ను వసూళ్ళు పెరగడానికి బదులుగా తగ్గడంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో వివిధ శ్లాబుల్లో ఉన్న వస్తువులపై పన్నును తగ్గించి 5 శాతం పరిధిలోని శ్లాబ్‌లో చేర్చినందువల్ల రెవెన్యూ తగ్గిందని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి అని ఉదహరించారు. జిఎస్టి అమల్లోకి వచ్చిన జూలై నెలలో దేశం మొత్తంమీద 94,063 కోట్ల మేరకు వసూళ్ళు జరిగితే ఆ తర్వాత ప్రతి నెలా ఇది తగ్గుతూ నవంబరు నాటికి రూ. 80,808 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలో సైతం ఆగస్టులో రూ. 1417.72 కోట్లు, సెప్టెంబరులో రూ. 1499.41 కోట్లు, అక్టోబరులో రూ. 1472.33 కో ట్లు ఉంటే నవంబరులో అది రూ. 1404.08 కోట్లకు తగ్గింది. జిఎస్టి అమల్లోకి రాకపూర్వం గతేడాది నవంబరులో వ్యాట్ వసూళ్ళు రూ. 2746.03 కోట్లు. జిఎస్టి వచ్చిన తర్వాత ఎక్సయిజ్, కేంద్ర వాటా, జిఎస్టి నష్టపరిహారం కింద వచ్చిన రూ. 162 కోట్లు కలిపితే నవంబరు మాసానికి మొత్తం రూ. 3451.46 కోట్లుగా తేలింది. జిఎస్టి విధాన వలన దేశం మొత్తంమీద పన్ను చెల్లింపుదారుల సంఖ్య 80 లక్షల నుంచి 99 లక్షలకు పెరిగినా ప్రతి నెలా లేదా త్రైమాసికంగా పన్నులు చెల్లిస్తున్నవారు మాత్రం 53.06 లక్షల మంది మాత్రమే. రాష్ట్రంలో సైతం పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 80% మంది జిఎస్టి పరిధిలోకి వచ్చారని అధికారి వివరించారు. జిఎస్టిపై ఇంకా అవగాహన కలిగించా ల్సి ఉన్నదని అన్నారు. ఆర్థికరంగంలోనే ఒక భారీ సంస్కరణ అయినందువల్ల అలవాటుపడడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆర్థిక శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, వ్యాట్ విధానంలో వ్యాపారస్తులకు, రాష్ట్ర రెవిన్యూ అధికారులకు స్పష్టమైన అవగాహన, అనుభవం ఉన్నదని, అయితే జిఎస్టి వయసు కేవలం ఐదారు నెలలు మాత్రమేనని, ఇంకా నడక నేర్చుకునే దశలోనే ఉన్నదని, పరుగులు పెట్టాలంటే కనీసం ఒకటి రెండు సంవత్సరాలు పడుతుందని అభిప్రాయపడ్డారు. జిఎస్టి వల్ల దేశం మొత్తంమీద వసూళ్ళు మందగించిన మాట వాస్తవమే అయినా అందుకు చాలా కారణాలు ఉన్నాయని, అయితే తెలంగాణలో పన్ను వసూళ్ళు పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి స్థాయిలో లేవని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అంతా సర్దుకుంటుందని, ఆర్థిక పరిస్థితి కూడా కుదుట పడుతుందని అన్నారు. అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి చాలా సంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు.

Comments

comments