Home బిజినెస్ తగ్గిన జిఎస్‌టి వసూళ్లు

తగ్గిన జిఎస్‌టి వసూళ్లు

 అక్టోబర్‌లో రూ.83,346 కోట్లు నమోదు
 గణాంకాలను వెల్లడించిన ఆర్థిక మంత్రిత్వశాఖ

GSTన్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.83,346 కోట్లతో తగ్గుముఖం పట్టాయి.  అంతకుముందు సెప్టెంబర్ నెలలో రూ.92 వేల కోట్లు వసూళ్లతో పోలిస్తే ఈసారి తగ్గడం విశేషం. అక్టోబర్ మాసానికి గాను నవంబర్ 27 నాటి మొత్తం జిఎస్‌టి వసూళ్లు రూ.83,346 కోట్లు వచ్చాయని, దాదాపు 50.1 లక్షల రిటర్న్‌లు దాఖలు చేశారని ఆర్థిక మంత్రిత్వశాఖ నివేదిక పేర్కొంది. జులై, ఆగస్టు నెలలకు రాష్ట్రాలకు కేంద్రం రూ.10,806 కోట్లు పరిహారంగా విడుదల చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు రూ.13,695 కోట్ల పరిహారం విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 201516 సంవత్సరం ఆధారంగా రాష్ట్రాల ఆదాయాలు పూర్తిగా సురక్షితమని, రెవెన్యూ వృద్ధి రేటు 14 శాతం ఉందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. జులై నెలకు గాను జిఎస్‌టి వసూళ్లు రూ.95 వేల కోట్లకు పైగా నమోదు కాగా, ఆగస్టు నెలలో ఇది రూ.91 వేల కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలలో రూ.92,150 కోట్లు జిఎస్‌టి వసూళ్లు వచ్చాయి. జిఎస్‌టిని అమలు చేసిన తర్వాత అక్టోబర్ నాలుగో నెల.. అయితే జిఎస్‌టి వరుసగా చూస్తే తగ్గుముఖం పడుతూ వస్తోంది.  ఎక్సైజ్ సుంకం వంటి కేంద్ర, రాష్ట్రాల పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా జిఎస్‌టిని అమలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జిఎస్‌టి కౌన్సిల్ పలుమార్లు సమావేశమై పన్నులపై నిర్ణయాలు తీసుకుంది. జిఎస్‌టిలో విలీనం చేసే పన్నులు ప్రాథమికంగా వస్తువుల సరఫరా, సేవల సరఫరాపై విధించే పరోక్ష పన్నులు ఉంటాయి.పరోక్ష పన్ను వ్యవస్థలో రాష్ట్రంలోపల, రాష్ట్రాల మధ్య పన్నుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు విధిస్తున్న17 రకాల పన్నులను ఒకే పన్ను విధానమైన జిఎస్‌టి పరిధిలోకి వచ్చాయి. జులై నుంచి అమలులోనికి వచ్చిన జిఎస్‌టిలో ఆరు శ్లాబులు వున్నాయి.  సెంట్రల్ జిఎస్‌టిలో కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ సుంకాలు, అదనపు ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్ సుంకాలు, సర్వీస్ టాక్స్‌లు విలీనం అయ్యాయి.