Search
Sunday 18 November 2018
  • :
  • :

ధర తగ్గిన కూరగాయలు

దిగాలు పడుతున్న రైతన్నలు
ఏదైనా కిలో రూ. 20 లోపే
టమాటా ధరైతే మరింత అధ్వాన్నం
కిలో ధర ఐదు రూపాయలే

VEG

మన తెలంగాణ/ వికారాబాద్ : ఆరుగాలం కష్టపడి కూరగాయలను పండించిన రైతన్నలకు ఈ శీతాకాలంలో చెదు అనుభం ఎదురవుతుంది. వికారాబాద్ కూరగాయల మార్కెట్‌లో ఏ కూరగాయ ధర చూసినా రూ. 20 లోపే అమ్మకాలు చేస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు బిక్కమొహం వేస్తున్నారు. కూరగాయల కోసం సంచి పట్టుకోని రైతు బజార్‌కు వెళితే సార్ మా దగ్గర కూరగాయలను తీసుకోండి అంటూ రైతులు వేడుకుంటున్నారు. రైతన్న పరిస్థితి తమ కూరగాయలను తీసుకోండని అడుక్కునే పరిస్థితి దాపురించింది.

వేల పెట్టుబడులు పెట్టి పండించిన కూరగాయలు ధరలు లేక, తగిన డిమాండ్ లేక రైతులు నష్టపోతున్నారు. వికారాబాద్ పట్టణంలో రైతులు పండించిన కూరగాయలకు తగిన గిట్టుబాటు రావాలన్న ఉద్దేశ్యంతో గత ఎడాదిన్నర క్రితం పశువుల మార్కెట్ సమీపలో రైతు బజార్‌ను ప్రారంభించారు. రైతు బజార్‌ను ప్రారంభించినప్పటి నుంచి కొన్ని నెలలు సజావుగా సాగినా కూరగాయలన విక్రయం ఇక్కడ కొనసాగకుండా పాత కూరగాయల అమ్మకం చేసే ప్రాంతంలోనే రైతులు కూరగాయలను విక్రయించే వారు. మార్కెట్ అధికారులు, అప్పటి సబ్ కలెక్టర్ తగిన చోరవ తీసుకోవటంతో రైతు బజార్‌లోనే రైతులు తామ పండించిన కూరగాయలను విక్రయించాలని గట్టి చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులు తాము పండించిన కూరగాయలను రైతు బజార్ వద్దకు తెచ్చి విక్రయించటం ప్రారంభించారు.

రైతు బజార్‌లో సుమారుగా 100 మంది రైతులు తాము పండించిన కూరగాయలను తెచ్చి విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే 50 మంది వరకు రైతులు ఇక్కడకు వచ్చి కూరగాయలను విక్రయించగా అంగడి రోజు అయిన అదివారం మాత్రం పరిసర గ్రామాలకు చెందిన రైతులు ఇక్కడకు వచ్చి కూరగాయలను విక్రయిస్తున్నారు. అంగడి రోజు రైతు బజార్ ప్రాంతంలో కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా పట్టణ ప్రజలు వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు.
తాజాగా తక్కువ ధరలకే కూరగాయలు ….
వికారాబాద్ రైతు బజార్‌లో కూరగాయలను ఒక సారి పరిశీలిస్తే తాజాగా కనిపిస్తాయి. రైతులు తాము పండించిన కూరగాయలను తెంపి సరాసరి విక్రయానికి రైతు బజార్‌కు తెస్తారు. దీంతో ఈ మార్కెట్‌లో కూరగాయలను చూస్తే తాజాగా కనిపిస్తాయి. మిగతా మార్కెట్‌ల కన్నా ధర కూడా తక్కువగానే ఉంటుంది. హైదరాబాద్ నగరం నుంచి ఉద్యోగ రీత్యా వచ్చే ఉద్యోగులు సాయంత్రం వెళల్లో ఇక్కడే కూరగాయలను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకవెళుతున్నారు. కూరగాయల ధర కన్నా ఇక్కడ తాజాగా దొరుకుతాయని ఉద్యోగులు అంటున్నారు. ఆకు కూరలైన పాలకూర, చుక్క కూర. తోట కూర గొంగూర లను బావులు కింద బోర్ల కింద పండిస్తున్నారు. ఆకు కూరలు కూడా 10 రూపాయలకు 10 కట్టలు చోప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో విపరీతంగా ఉన్న పప్పుల ధరలతో వినియోగదారులు కూరగాయలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్‌కు తరలిస్తున్న కూరగాయలు
ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలను హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, మూసాపేట,మోహిదిపట్నం మార్కెట్‌లకు తరలిస్తున్నారు. అంతే కాకుండా పక్క రాష్ట్రాలకు చెందిన సెడం, చితాపూర్ ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులు వికారాబాద్ రైతు బజార్‌లో కూరగాయలను కొనుగోలు చేసి అక్కడికి తీసుకవెళుతున్నారు. ఎక్కువగా రైళ్లలో కూరగాయలను తీసుకవెళుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన కూరగాయలను రెండింతల ధరలతో వారు తీసుకెళ్లిన ప్రాంతాల్లో అమ్మకం చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోగా మధ్య దళారీలు మాత్రం బాగానే లాభపడుతున్నారు. వికారాబాద్ కూరగాయల మార్కెట్ పరిసర మండలాల కన్నా అతి పెద్ద మార్కెట్. ఇక్కడ 1947లోనే వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ అధీనంలో నడిచే కూరగాయల మార్కెట్ 1950లో ప్రారంభించారు. పరిసర మండలాలు, గ్రామాల నుంచి ఇక్కడికి కూరగాయలు విక్రయానికి వస్తాయి.
టమాట ధర మరింత చౌక …
అందరూ ఇష్టపడే టమాట కిలో రూ. 5 చోప్పున విక్రయిస్తున్నారు. కొందరు రూ. 10 కిలో విక్రయించగా బేరం చేస్తే టమాటను తక్కువ ధరకు కూడా విక్రయిస్తున్నారు. గత నెల రోజుల నుంచి మార్కెట్‌కు టమాట విపరీతంగా వస్తుంది. దీంతో టమాట ధర పడిపోయింది. ఇక క్యారేట్ కిలో చిల్లరగా రూ. 20 చొప్పున అమ్మకం చెస్తున్నారు. ఆలుగడ్డ, పెద్ద చిక్కుడు, బెండ చిల్లరగా కిలో రూ. 20 చొప్పున విక్రయిస్తున్నారు. బీర కాయ కిలో రూ. 30, కాలిఫ్లవర్, క్యాబేజి ఒక్కటి రూ. 10, 5 లకు విక్రయిస్తున్నారు.

క్యాఫ్సికం కిలో రూ. 20, వంకాయ కిలో రూ. 20, ఉల్లిగడ్డ కిలో రూ. 10 లకు అమ్మకం చెస్తున్నారు. ఆకు కూరలు కూడా 10 రూపాయలకు 10 కట్టలు చొప్పున విక్రయిస్తున్నారు. టమాట ధర తగ్గిపోవటంతో మార్కెట్‌కు తీసుక వెళ్లి విక్రయిస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉన్న ప్రస్తుత తరుణంలో కూరగాయలు పండించటానికి ఎంతో కష్టపడుతున్నా వాటి ధరలు మాత్రం ఆశించిన విధంగా లేవని రైతులు వాపోతున్నారు. వికారాబాద్ పరిసర గ్రామాల ప్రజలు బోర్ల వద్ద, బావులు వద్ద కూరగాయలను పండిస్తున్నారు.
ధరల పట్టిక కన్నా తక్కువ ధరలకే
రైతు బజార్‌లో ఎర్పాటు చేసిన కూరగాయల ధరల పట్టిక కన్నా రైతులు తమ కూరగాయలను తక్కువగా విక్రయిస్తున్నారు. ధరల పట్టికలో టమాట కిలో రూ. 20 పేర్కొనగా రైతులు మాత్రం రూ. 10లకు విక్రయిస్తున్నారు. వంకాయ ధర కిలో రూ. 35 పేర్కొనగా కిలో 30, 20లకు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయలు ధరలు కూడా పట్టికలో పేర్కొన్న విధంగా కాకుండా దాని కన్నా తక్కువగా విక్రయిస్తున్నారు.

Comments

comments