Home తాజా వార్తలు ఆకాశంవైపు చూపు

ఆకాశంవైపు చూపు

ph

వానలు లేక రైతన్న పరేషాన్
పది రోజులుగా ఇదే పరిస్థితి
ఇంట్లో విత్తనాలు, బయట కానరాని చినుకు
ఖరీఫ్‌కు మించిపోతున్న అదును
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఎండిపోతున్న పత్తి మొలకలు

మన తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్ :తొలకరి జల్లులు కురవడంతో ఖరీఫ్‌పై గంపె డాశలు పెట్టుకుని దుక్కులు దున్నిన రైతులు గత పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో దిక్కు లు చూసే దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వరుణుడి కరుణ లేక ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ ఖరీఫ్ గం డం ఎలా గడుస్తుందోనని దిగులు చెందుతున్నా రు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడిచినా కూడా రెండు వర్షాలు మాత్రమే పడ్డాయి. ఇప్పటివరకు చెప్పుకోదగిన రీతిలో పెద్ద వర్షం కురియకపోవడంతో రైతన్న విత్తనం వేసుకోవడానికి ధైర్యం చేయడం లేదు. పలు జిల్లాల్లో వేసుకున్న విత్తనం మొలకెత్తినా చినుకు రాకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయి. అదును దాటిపోతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు వరి నారుమళ్లు పోసుకోలేదు. ఆరుతడి పం టలకు మాత్రం దేవుడిపై భారం వేసి పొడి దుక్కిలోనే విత్తనం వేసుకుంటున్నారు. గత నెల 22వ తేదీన కురిసిన వర్షంతో రైతులు 50 శాతం మేర కు పంటలను వేసుకున్నారు. నాటి నుంచి మేఘా లు మురిపిస్తున్నా వర్షం మాత్రం పడడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వేసుకున్న పత్తి, మొక్కజొన్న, పెసర, మినుములు, కందులు, సోయాబీన్, పలు చోట్ల వరి పంటలను నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే పంటల గతి అంతేనని రైతులు దీనం గా రోధిస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల్లోకి కొత్త నీరు చేరకపోవడంతో వరి నారుపోసే పరిస్థి తి కనిపించడం లేదు. భూగర్భ జల నీటిమట్టం పెరగకపోవడంతో వ్యవసాయ బోర్ల కింద సాగు కు ముందుకు వెళ్లే  పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్న నీరు లేకపోవడంతో వ్యవసాయ మోటార్లకు పనిలేకుండా పోయింది. మొత్తంగా చూసినప్పుడు ఖరీఫ్ కష్టాలతోనే మొదలైంది.ఉమ్మడి మెదక్ జిల్లాలో వానలు రైతులను మురిపించి మాయమవ్వడంతో ఈ ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. నిత్యం వాన కోసం ఎదురు చూడడమే తప్ప ఏమి చేయాలో దిక్కుతోచని స్థితికి అన్నదాత చేరుకున్నాడు. వానలు కొంతైనా పడితే ఈ పాటికి వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతు దీనంగా కనపడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఈ పరిస్థితే కనపడుతోంది. సంగారెడ్డి జిల్లాలో లక్షా 74 వేల హెక్టార్లకు గాను కనీసంగా 20 శాతం భూముల్లో కూడా ఇంకా పనులు సాగడం లేదు. సింగూరు కాల్వల కింద గత సీజన్‌లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. మెదక్ జిల్లాలో 94 వేల హెక్టార్లకు గాను, ఇప్పటి వరకు 36 వేల హెక్టార్లలో మాత్రమే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో రెండు లక్షల 20 వేల హెక్టార్లకు గాను 20 శాతం కూడా నాట్లు పడలేదు. విత్తనాలు వేయలేదు.
జిల్లాలో మూడెళ్లుగా వర్షాభావం
నిజామాబాద్ జిల్లాలో మూడేళ్లుగా వర్షాలు ఆశించిన మేరకు కురవక భూగర్భ జలాలు అడుగంటి పంటలు పండక రైతులు అప్పుల పాలవుతున్నారు. జూలై మాసం వచ్చినా చెరువులు కుంటలు నిండలేదు. వరి నాట్లు పడలేదు. ఆరుతడి పంటలను వేసుకోలేదు. వర్షాలు లేనందున ఇప్పుడే పంటలు వేయవద్దని అధికారుల సూచిస్తున్నారు. ఈ ఖరీఫ్ ఎలా గడుస్తుందోనని రైతులు దిగులు చెందుతున్నారు. పోచారం ప్రాజెక్టు నిజాం సాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టుల్లో నీరు లేక వెలవెల పోతున్నాయి. పెద్ద చెరువులైన కామారెడ్డి, దోమకొండ అడ్లూర్, ఎల్లారెడ్డి, పెద్ద మల్లారెడ్డి, జంగంపల్లి, బీబీపెట, లింగంపేట, కచాపూర్, తిమ్మరెడ్డి చెరువుల్లో పది శాతం నీరు లేదని రైతులు వాపోతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాలలో వరి, పత్తి, మొక్కజొన్న అధికంగా పండిస్తారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలలో ప్రాజెక్టులు నీటి కాలువలు లేక రైతులు వర్షాలపైనే అధారపడి పంటలు పండిస్తారు. గత మూడేళ్లుగా వర్షాలు లేక నీటి వనరులు నిండలేదు. ఈ సారి కూడా నిరాశే ఎదురవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
చినుకు రాలదు విత్తు మొలవదు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు అంచనా వేసిన లక్షంలో ఇప్పటి వరకు 50 శాతం పంటలు మాత్రమే సాగు మొదలైనట్లు తెలుస్తోంది. మారో రెండు మాడు రోజులు వర్షాలు పడక పోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారే విధంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఈ యేట అనుకూలమైన వర్షాలు కురుస్తాయని రైత్తంగం భావించినప్పటీకీ వారి ఆశ మాత్రం నెరవేరలేదని చేప్పవచ్చు. వరి నారుమళ్లు వేసి నాటాడానికి సిద్ధంగా ఉండగా అనుకున్నంతగా వర్షాలు లేకపోవడంతో రైతన్న ధైర్యం చేయడం లేదు . బోరు, బావుల ద్వారా నీరు వస్తున్న రైతులు మాత్రమే నెమ్మదిగా నాట్లు వేయడం మొదలు పెట్టారు.
రైతాంగానికి తప్పని అవస్థలు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతున్నా పంటల సాగుకు అనుకూలంగా వర్షాలు కురవక పోవడంతో రైతాంగానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలాఉంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మండలంలోని ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుండగా, మరో ప్రాంతంలో చుక్క వర్షం కూడా పడని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖరీఫ్ ప్రారంభంతోనే ఆదిలాబాద్ జిల్లాలో పంటల సాగును ప్రారంభించారు. జిల్లాలో రెండు లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా, లక్ష 20 వేల హెక్టార్లలో పత్తి, 45 వేల హెక్టార్లలో సోయాబీన్, 25 వేల హెక్టార్లలో కందులు, 7 వేల హెక్టార్లలో జొన్న, 3 వేల హెక్టార్లలో మినుములు, 2 వేల హెక్టార్లలో పెసర పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది రైతులు తమ పంట చేలల్లో విత్తనాలు వేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4 లక్షల హెక్టార్లు కాగా 1.50 లక్షల హెక్టార్లలో పత్తి, 85 వేల హెక్టార్లలో సోయాబీన్, 50 వేల హెక్టార్లలో వరి, 50 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 15 వేల హెక్టార్లలో పసుపు పంటను సాగు చేస్తుండగా, మిగిలిన 50 వేల హెక్టార్లలో ఇతరత్రా పంటలను సాగు చేస్తున్నారు. వరి మినహా మిగిలిన పంటల సాగు ప్రారంభం అయినట్లు చెబుతున్నారు. మంచిర్యాల, కొమ్రంభీం జిల్లాల్లో రైతులు ఖరీఫ్ పనులను ముమ్మరం చేశారు. ప్రధానంగా రెండు జిల్లాల్లో పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే రైతులు విత్తనాలను కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల వరి నాట్లు మొదలయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 50 వేల ఎకరాల్లో పత్తి, 32 వేల ఎకరాల్లో వరి పంటలను సాగు చేస్తున్నారు. అదే విధంగా కుమ్రంభీం జిల్లాల్లో 63 వేల ఎకరాల్లో పత్తి, 52 వేల ఎకరాల్లో వరి పంటలను సాగు చేస్తున్నారు.
మొక్కలను కాపాడుకునేందుకు నానా ఇక్కట్లు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షపు జాడ కనిపించడం లేదు. మృగశిర కార్తి మొదట్లో వర్షం కురిసినప్పటికీ భారీ వర్షాలు ఇంత వరకు కురవ లేదు. వర్షాలు వస్తాయన్న నమ్మకంతో రైతులు విత్తులు వేసుకున్నారు. అయితే వాన దేవుడు మొఖం చాటేయడంతో వేసిన విత్తులు మొలకెత్తడం లేదు. వర్షాలు కురవ పోతే వేసిన విత్తనాలు భూమిలోనే చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పంటలు మెలకెత్తిన్పటికీ వర్షాలు లేక పోవడంతో చచ్చిపోతున్నాయి. మరోవైపు ఎండలు తీవ్రంగా ఉండడంతో భూమిలోని ఉన్న నీటి శాతం కూడా ఇంకి పోతుండడంతో మొలకలు ఆదిలోనే ఎండిపొతున్నాయి. వేసిన పంటల మొక్కలను కాపాడుకునేంపదకు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది అన్ని పంటలు కలిసి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో పంటలు సాగు జరగగా, ఈ ఏడాది ఆయికట్టు పెరగడం, రైతు బంధు ద్వారా వ్యవసాయ సాగుకు డబ్బలు ఉండడంతో అదనంగా మరో 30 వేల ఎకరాల్లో ఆయికట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు విద్యుత్ సౌకర్యం ఉండడం, ఎరువులు, విత్తనాలు సిద్దంగా ఉండడంతో ఏరువాక పున్నమి తర్వాత ఖరీఫ్‌సాగు జోరుందుకునే అవకాశాలు ఉన్నాయని భావించినా వర్షం కురవక పోవడంతో రైతులు వాన దేవుని కోసం పూజలు చేపడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నదాతలకు కష్టం వచ్చింది. ఖరీఫ్ కన్నీరు మిగిల్చే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని అందించడం, ఖరీఫ్ సీజన్ సైతం మొదట్లో దొందరపెట్టడంతో రైతుల ఆశలు ఆకాశానంటాయి. కానీ ఆదే ఆశలతో ప్రస్తుతం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితితులు నెలకొన్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగుకు సిద్దమైన రైతులు పత్తి, మొక్కజోన్న, పసుపు లాంటి పంటలకు విత్తనాలు వేశారు. రేగడి దుక్కులు అనువుగా ఉన్నాయని ఆశించినప్పటికీ వర్షాలు అనుకూల వాతావరణం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడం నీరు సక్రమంగా అందకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 50 శాతం విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు.
వరపటి కాలమే& వాడిపోతున్న మొక్కలు
ఖమ్మం జిల్లాలో ఆదిలోనే హంసపాదుగా అన్నట్లుగా తయారైంది ఖరీఫ్ పరిస్థితి. ఒక వారం వర్షం, మరోక వారం ఎండలు అన్న రీతిలో సాగుతుంది. అసలే కష్టాల కార్ఖానాగా ఉన్న వ్యవసాయ రంగంపై ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విత్తు మొలవక సగం మొలిచి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పత్తి తప్ప మరో పంట వేసే పరిస్థితి కన్పించడం లేదు. పునాస పంటల పరిస్థితి దయనీయం. వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పరిస్థితి కన్పించడం లేదు. అత్తు, బిత్తు వర్షాలతో సాగు ముందుకు సాగే పరిస్థితులు కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటగా అదును కుదిరిన చోట మాత్రమే పూర్తి స్థాయిలో మొలిచాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదును సరిపోక సగం మొలకెత్తలేదు. మొలిచిన మొక్కలకు పాటు లేక మొలవని చోట తిరిగి విత్తు నాటేందుకు వర్షం లేక రైతులు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పత్తి పరిస్థితి ఈ విధంగా ఉంటే పునాస పంటలైన కంది, మొక్కజొన్న, పెసర, మినుమును ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా లక్షన్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. సాగు చేసిన చోట భూమిలో సరైన పదును లేక రైతులు విలవిలలాడుతున్నారు.
విపరీతంగా ఎండకాస్తుండడంతో మిడతలు ఆకులను తినేస్తున్నాయని దీనికి తోడు పురిటి మొక్కలనే చీడ తినేస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలే వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. మధ్యలో ముఖం చాటేయడం ఇది చాలదన్నట్లు విపరీతమైన ఎండలు రైతును మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
నల్లగొండలో సా..గుతున్న ఖరీఫ్ సాగు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖరీఫ్ సాగు మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. వరుణుడు ముఖం చాటేయం కారణంగా రైతన్నలు ఎటూపాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు సాధారణ విస్తీర్ణం అంచనా 3లక్షల 14వేల 398 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటికి కేవలం 19శాతం అంటే 57వేల 956హెక్టార్లలో మాత్రమే వివిద పంటలను రైతులు సాగు చేశారు. వర్షాలు సమృద్దిగా కురిస్తే ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే దాదాపు 40 శాతం పైచిలుకు దాదాపు లక్షా 30వేల హెక్టర్ల విస్తీర్ణంలో సాగుబడి కావాల్సి ఉండగా వర్షాలు వెనుకపట్టుపట్టడంతో సాగు చేసేందుకు రైతు కూడా వెనుకడుగు వేస్తున్నాడు.