Home అంతర్జాతీయ వార్తలు సౌదీ.. సంస్కరణల బాట

సౌదీ.. సంస్కరణల బాట

నిర్ణయాల్లో  రాజు తనయుడి ముద్ర   

సుదీర్ఘ నిషేధాలకు చరమగీతాలు 

మహిళల  చేతికి స్టీరింగ్

వినోద సంస్థ ఏర్పాటు

Saudi

దుబాయి : సౌదీ అరేబియా రాజుగా ప్రస్తుతం కింగ్ సల్మాన్ (81) కొనసాగుతున్నారు. 2015లో ఆయన రాజ్యాధికారాన్ని చేపట్టారు. ఛాందసవాద దేశంగా విమర్శకులు పేర్కొనే ఈ ఎడారి దేశంలో గత మూడేళ్లుగా అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. సంస్కరణల ద్వారా సౌదీ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా డ్రైవర్లుగా మహిళలకు అనుమతినిస్తూ ఇటీవల ఆ దేశం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎనిమిది పదుల వయసులో కింగ్ సల్మాన్ పేరుకే రాజుగా ఉన్నారు. కానీ, పెత్తనమంతా ఆయన ముద్దుల తనయుడు, తదుపరి సింహాసనాధీశుడు మహ్మద్ బిన్ సల్మాన్‌దే. ఆయనను క్లుప్తంగా ఎంబిఎస్ అని పిలుస్తుంటారు. దేశ రక్షణ, ఆర్థిక, అంతర్గత భద్రత, సామాజిక సంస్కరణలు, విదేశీ విధానానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. దేశంలో అమలవుతున్న విప్లవాత్మక సంస్కరణల వెనుక మూల పురుషుడు ఆయనేనని రాజ్యంలోని ఆంతరంగీకులు చెబుతున్నారు. తన తండ్రి రాజయ్యాకే ఎంబిఎస్‌కి ప్రాధాన్యం పెరిగిందని వారంటున్నారు. ఒకవేళ వయోభారంతో కింగ్ సల్మాన్ తన అధికారాన్ని వదులుకుంటే బహుశా వచ్చే ఏడాదిలోనే యువరాజు సౌదీ రాజుగా అవతరించవచ్చు. యువరాజు ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు విమర్శలపాలు కాగా మరికొన్ని ఆయనకు పేరుతీసుకొచ్చాయి. ఆ జయాపజయాల సమాహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం…
ఖతార్‌తో కటీఫ్
ఈజిప్ట్, బహ్రెయిన్ దేశాల మద్దతుతో ఈ ఏడాది జూన్ మొదట్లో ఖతార్‌పై నెరిపిన దౌత్యపరమైన దాడి వెనుక ఎంబిఎస్, అబూదాబీ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ కీలక పాత్ర పోషించారు. మధ్యప్రాశ్చ అంతటా అలజడులకు కుట్ర పన్నుతోందని, ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు మద్దతిస్తోందంటూ ఖతార్ నాయకత్వంపై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వాటిని ఖతార్ అదే స్థాయి లో ఖండించింది. దోహాపై చర్యలు రాజకీయ ప్రేరేపితమైనవని వివరణ ఇచ్చుకుంది. సౌదీ, యుఎఇ నేతృత్వంలో ముట్టడి జరిగినప్పటికీ, దానివల్ల ఖతార్‌లో ప్రజా జీవితం పెద్దగా ప్రభావితం కాలేదు.ఈవివాదం ఇస్లామిస్ట్ గ్రూపు ల పట్ల ఖతార్ తన విధానాలను మార్చుకునేటట్లు చేయడంలో విఫలమయింది. టర్కీతోపాటు సౌదీ అరేబియా ప్రత్యర్థి ఇరాన్ సాయానికి ఖతార్ చేతులు చాచిం ది. మరోవైపు వివాదాస్పద డిమాండ్ల జాబితాను ఖతార్ సర్కార్ తిరస్కరించడాన్ని సౌదీ అరేబియా, యుఎఇ వైఫల్యంగా చెప్పుకోవాలి. ఖతార్‌తో సంక్షోభం వల్ల గల్ఫ్‌లోని ప్రజల మధ్య ఏళ్లుగా ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితి అమెరికాని కూడా ఆందోళనకు గురిచేసింది.
యెమెన్‌లో విధ్వంసక పోరుపై పర్యవేక్షణ
యెమెన్‌లో సుమారు రెండేళ్ల పాటు సాగిన యుద్ధాన్ని రక్షణ మంత్రిగా ఎంబిఎస్ పర్యవేక్షించారు. ఈ యుద్ధం లో పది వేల మందికి పైగా మరణించారు. అరబ్ ప్రపంచంలో యెమెన్ అత్యంత నిరుపేద దేశం. యుద్ధం వల్ల ఆ దేశం పరిస్థితి దారుణంగా దెబ్బతింది. ఒకే ఏడాదిలో మరే దేశంలోనూ సంభవించని రీతిలో అక్కడ కలరా విపరీతంగా వ్యాప్తి చెందింది. యెమెన్‌పై సౌదీ సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది పౌరులు మృత్యువాత పడటం యుద్ధ నేరాలతో సమానమే అవుతుందని మానవ హక్కుల సంస్థలు దుయ్యబట్టాయి. ఈ యుద్ధం ఇరాన్ అనుబంధ తిరుగుబాటుదారులను రాజధాని నగరం, సానా నుండి వెనక్కి పంపడంలో విఫలమయింది. కాగా, యెమెన్‌లో హౌతీస్‌గా పిలవబడే షియా ముస్లింలు 2014లో సౌదీ అండదండలతో సాగే ప్రభుత్వాన్ని గద్దెదించారు. యెమెన్‌పై యుద్ధా న్ని పలువురు ప్రపంచ నాయకులు కూడా ఖండించారు. అంతేకాక సౌదీకి ఆయుధాలను విక్రయాన్ని నిలిపివేసే దిశగా పాశ్చాత్య దేశాల చట్టసభలు తీర్మానాలను ఆమోదించేందుకు ఆ యుద్దం పురిగొల్పింది.