Home ఆఫ్ బీట్ రెరాలో నిపుణుల కొరత..

రెరాలో నిపుణుల కొరత..

Registration is mandatory for real estate projects

రియల్ ఎస్టేట్ పథకాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జనవరి 2017 నుంచి అనుమతులున్న పథకాలకు వర్తింపు
రెరాతో పెరుగుతోన్న ప్రాజెక్టుల నిర్మాణ కాలం
నవంబర్ 30న నమోదుకు తుది గడువు.

భవిష్యత్తు అంతా నాణ్యతకే పెద్దపీట
ఆగష్టు 31న తెలంగాణలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ప్రారంభమైంది. వాస్తవానికి జనవరి 1, 2017 నుంచి రెరా అమలులోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు అమలులోకి వచ్చింది మాత్రం ఆగష్టు నుంచి. అయితే, జనవరి, 2017 తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రారంభమైన ప్రతి ప్రాజెక్ట్ రెరాలో నమోదు కావాల్సిందే. వాస్తవానికి రెరాలో ప్రాజెక్టులను నమోదు చేసుకోవడానికి తుది గడువు ఈ నెల 30తో ముగిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2017 జనవరి నుంచి మొదలైన ఆకాశహర్మాలు, బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు, లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు ఇలా అన్నిరకాల పథకాలు రెరాలో నమోదు చేసుకోవాల్సింది. రేరా అనేది హైదరాబాద్ మహానగరానికి సంబంధించింది మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ రంగానికి వర్తిస్తుంది. ఈ నెల 30 లోపు ప్రారంభించిన, అనుమతులు పొందిన ప్రతి పథకం రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. లేని పక్షంలో జరిమానాలు, కేసులు, జైలుకు పంపించడం వంటివి ఉంటాయి.

నమోదు తప్పని సరి
హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి, డిటిసిపి, టిఎస్‌ఐఐసి, పురపాలక సంఘాలు, పురపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు పొందిన ప్రతి నిర్మాణ, లేఅవుట్లకు సంబంధించిన పథకాలు రెరాలో నమోదుచేసుకోవాలి. అధికారుల సమాచారం మేరకు తెలంగాణలో 2017 తర్వాత డిటిసిపి నుంచి 1,140. హెచ్‌ఎండిఏ 860. జిహెచ్‌ఎంసి 2,990 పథకాలు అనుమతులు పొందినట్టు సమాచారం. ఈ పతకాలన్నీ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. అయితే, ఇప్పటి వరకు సుమారు 20 ప్రాజెక్టులు మాత్రమే రెరాలో నమోదు చేసుకున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. తుది గడువులోపు నమోదు చేసుకోకుండా ప్రారంభమైన పథకాలకు నిర్మాణ వ్యయంలో 10 శాతం జరిమానా విధింపు ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పాటికే రియల్ రంగంలోని ప్రధాన సంస్థలతో పాటు ఇతర సంస్థలకు నమోదు విషయమై ప్రకటనల ద్వారా తెలియజేయడం జరిగిందని రెరా అధికారులు స్పష్టంచేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ ఇలా
తెలంగాణలో కార్యరూపంలోకి వచ్చిన రెరాలో దాదాపు 460 మంది డెవలపర్లు, 20 పథకాల వివరాలు మాత్రమే రిజిష్టర్డ్ అయినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ రెగ్యులేటరీ అథారిటీలో పథకాల నమోదు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నిర్మాణ రంగ సంస్థ ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లు నామమాత్రపు రుసుంను చెల్లించి ఈ సంస్థలో నమోదు చేసుకావాలి. రెండవ దశలో నిర్మాణ, లేఅవుట్లకు సంబంధించిన పథకాల వివరాలను, దస్తావేజులను అప్‌లోడ్ చేయాలి. ఈ రెండు ప్రక్రియల అనంతరం రెరా అధికార యంత్రాంగం రంగంలోకి దిగి ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతికపరమైన అంశాలను, దస్తావేజులు, అనుమతులు వంటివి స్క్రూటినీ, పర్యవేక్షణ చేసి అన్నీ సజావుగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని రెరాలో నమోదు చేస్తూ అధికారిక పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. నమోదు చేసుకునేందుకు ఒకమారు రిజిస్ట్రేషన్‌కు నిర్మాణదారులకు రూ. 750లు, ఏజెంట్లకైతే రూ. 500లు ఉంటుంది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేశాక ప్రతి మూడు మాసాలకు ఒకమారు పథకాలకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలు, వివరాలు రెరా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి 1000 చ.మీ.ల వరకు ఉండే గ్రూప్ హౌసింగ్ పథకానికి ప్రతి చ.మీ.కు రూ. 5, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉం ప్రతి చ.మీ.కు రూ. 10లు, గరిష్టంగా మొత్తం పథకం రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. నివాసాలు- వ్యాపార పథకంకు గరిష్టంగా మొత్తం రూ. 7 లక్షలు, వెయ్యి చ.మీ.లకు లోపు ఉండే వ్యాపారనిర్మాణ పథకంకు చ.మీ.కు రూ. 20లు, వెయ్యి చ.మీ.లకు కన్నా అధిక విస్తీర్ణంలో ఉన్న వాటికి ప్రతి చ.మీ.కు రూ. 25 గరిష్టంగా మొత్తం రూ. 10 లక్షలు చెల్లించి నమోదు చేసుకోవాలి. ఖాళీ ప్లాట్లు అంటే లేవుటుకు మాత్రం ప్రతి చ.మీ.కు రూ. 5లు గరిష్టంగా రూ. 2 లక్షలు చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

పెరుగుతోన్న నిర్మాణ పూర్తి గడువు
రెరా వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి జరిగే ప్రయోజనం ఎలా ఉన్నా… నైపుణ్యం, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, కార్మికులు కరువవుతున్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత రియల్ రంగంలో నాణ్యతకు, నిర్ణీత గడువుకు ప్రాధాన్యతనివ్వాల్సిన పరిస్థితులు మొదలయ్యాయి. దీంతో సాంకేతికపరంగా నిర్మాణరంగంలో అనుభవజ్ఞులు అందుబాటులో ఉండటంలేదు. దీనికి తోడు అనుభవమున్న కార్మికులు సైతం కొరత ఏర్పడటంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడం గగనమవున్నట్టు గ్రహించిన పలు సంస్థలు ప్రాజెక్టు పూర్తి సమయాన్ని పెంచుతున్నారు. మూడేళ్ళలో పూర్తిచేసే ప్రాజెక్టును నాలుగేళ్ళలో పూర్తిచేస్తామని ముందే స్పస్టంచేస్తున్నారు. దీంతో పథకాలు సాగుతూ వస్తున్నాయి. తద్వారా నిర్మాణ వ్యయం పెరుగుతుందని, ఫలితంగా ధరలు పెంచడం సాధారణంగా మారుతోందని పలు సంస్థల ప్రతినిధుల అభిప్రాయం. అనుభవజ్ఞులను, సాంకేతిక నిపుణులను ప్రాజెక్టులకు వినియోగించడం వల్ల వారి వేతనాలు అధికమొత్తంలో చెల్లించాల్సి వస్తున్నది. కార్మికులను కూడా సాధారణవారికన్నా కొంత ఎక్కువగానే వేతనాలు చెల్లించాల్సి రావడంతో పథకం వ్యయం పెరుగుతోందని, తద్వారా కొనుగోలుదారులపై భారం మోపడం తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని సంస్థల వారు వెల్లడిస్తున్నారు. రెరాలో పథకం నిర్మాణ గడువును నమోదు చేస్తున్నందున ఆ గడువులోపు పూర్తిచేయని పక్షంలో సమస్యలు, జరిమానాలు, కేసులు ఉంటాయని భావిస్తున్న సంస్థలు రెరాలో నమోదు చేసే సమయంలోనే పథకం పూర్తిచేసే గడువును పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నారు.

టెక్నాలజీకి ప్రాధాన్యత
రెరా కార్యరూపంలోకి రావడంతో రియల్ రంగంలో నాణ్యతకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఎవరైనా కొనుగోలుదారులు నాణ్యతపై రెరాను ఆశ్రయిస్తే సమస్యలు కొనితెచ్చుకునే పరిస్థితులున్నాయని సంస్థు ముందుగానే నాణ్యతతోనే ముందుకు వెళ్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో టెక్నాలజీకి రియల్ రంగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే, టెక్నాలజీతో వెళ్లే సంస్థలు ప్రభుత్వం నుంచి రాయితీలను ఆశిస్తున్నాయి. ప్రోత్సహకాలు అందిస్తేనే ఈ రంగం మరింత అభివృద్ది చెందుతుందని లేని పక్షంలో ఇతర రాష్ట్రాలకు పోవడం ఖాయమని వెల్లడిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగా దేశంలోని ప్రధాన నగరాలలో రియల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అధికంగా ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గడ్, అస్సాం, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు దినసరి కూలీల కొరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ప్రస్తుతం గ్రామీణ, చిన్నచిన్న పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో పనిచేయడానికి అంతగా ఆసక్తిని కనబరచడంలేదు. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, ప్లానర్లు అధికశాతం మంది బహుళజాతి సంస్థల్లో పనిచేయడానికే మొగ్గుచూపుతున్నారు. కానీ, రియల్ రంగంలోకి అడుగుప్టెందుకు అయిష్టతను చూపుతున్నారు. ఫలితంగా నైపుణ్యమైన ఇంజనీర్లు రియల్ రంగానికి కరువవుతున్నారు. దీంతో ఉన్న ఇంజనీర్లు డిమాండ్‌ను అమాంతం పెంచేస్తున్నారు

                                                                                                                                                                                    మంచె మహేశ్వర్
మన తెలంగాణ/ సిటీ బ్యూరో

Registration is mandatory for real estate projects

Telangana Latest News