Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అనాథ, తప్పిపోయిన బాలబాలికల కోసం పునరావాస చర్యలు

వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య

DIVYA

మనతెలంగాణ/ వికారాబాద్ జిల్లా : అనాధ, తప్పిపోయిన బాలుర, బాలికల కోసం పునరావాసం కల్పించడానికి స్త్రీ, శిశు సంక్షేమ, సంక్షేమ వసతి గృహాల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చైల్డ్‌లైన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, మండలాలలో బాలల పరిరక్షణ కమిటీలు వేసి వారి పునరావాసానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలో ఉన్న కెజిబివి, ఆశ్రమ పాఠశాలలు, శిశు గృహాలు, బాల సదన్, ఆనంద నిలయాలు, వసతిగృహాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆపదలో ఉన్న బాలలను చేరదీసి పాఠశాలల్లో చేర్పించాలని దీనికి ప్రత్యేకంగా ఓపెన్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. బాలలను కాపాడే విషయంలో ఏవైనా సమస్యలు వచ్చినట్లు అయితే స్థానిక పోలీస్, తహసీల్దార్ల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు.

14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు బాలల నిమిత్తం బ్రిడ్జి కోర్సులను ఏర్పాటు చేసి విద్యనభ్యసించిన వారిని రెగ్యులర్ విద్యార్థులతోపాటు పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. వసతి గృహాలు, కస్తూర్భా గాంధీ పాఠశాలల్లో తప్పనిసరిగా నెలలోపు ఫోన్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పునరావాసం కొరకు బాలలను తరలించేందుకు కావాలసిన రవాణా సదుపాయాల నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
నిర్భందంగా పనిచేసే బాలలను గుర్తించి వారిని తమ వద్ద పని చేయించుకుంటున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని దీనిపై పోలీసు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. చైల్డ్‌లైన్ సబ్ సెంటర్‌ను తాండూరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించడంతోపాటు ఏవరైతే బాల్య వివాహాలు ప్రోత్సహిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఇట్టి విషయాలలో స్వచ్చంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు. చైల్డ్‌లైన్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్‌లైన్ ప్రొటెక్షన్ పాలసీ చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ ముంబాయి నుంచి పని చేస్తుందని వివరించారు. జిల్లాలోని అధికంగా అనాథ బాలలున్న ప్రాంతాలైన రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి గుర్తించాలని తెలిపారు. ఆనాథ బాలలను గుర్తించి గ్రామీణ, పట్టణ, మండల, జిల్లా అధికారుల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్‌పి లతామాధూరి, ఐసిడిఎస్ జిల్లా అధికారిణి సునంద, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ దశరథ్, డిపిఓ మాజీద్, డిఎస్‌డిఒ మోహన్ రెడ్డి, డిటిడిఒ సత్యనారాయణ, డిఎడబ్లుఒ ఈశ్వర్‌రావు, ఎస్‌డిఓటి శ్రీనివాస్, రైల్వే సిఐ రమేష్‌రెడ్డి, డిప్యూటీ డిఇఒ హరిశ్చందర్ నాయక్, చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటేష్, కౌన్సిలర్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments