Home తాజా వార్తలు పారా మెడిక‌ల్ కోర్సుల సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

పారా మెడిక‌ల్ కోర్సుల సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

 Release notification for paramedical courses

హైదరాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం 2018-19 సంవత్సరానికి పారా మెడిక‌ల్ కోర్సుల సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వివిధ కోర్సుల్లో సీట్లు, ఆయా సీట్ల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు సంబంధించిన తేదీల వివ‌రాల‌ను తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డు వెల్ల‌డించింది. వివిధ కోర్సుల్లో మొత్తం 33,871 సీట్లు ఉండ‌గా, అందులో ప్ర‌భుత్వ శిక్ష‌ణా సంస్థ‌ల్లో 591 సీట్లు, ప్రైవేట్ శిక్ష‌ణా సంస్థ‌ల్లో 33,280 సీట్లు ఉన్నాయని సమాచారం. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివరి తేదీ జులై 12 . జులై 24వ తేదీ నాటికి కౌన్సిలింగ్, అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేయాల్సి ఉంది. జులై 30 లోగా అభ్య‌ర్థుల ఎంపిక జాబితాల‌ను తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డుకి పంపించాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్ కోటా అభ్య‌ర్థుల ఎంపిక‌ను ఆగస్టు 1లోగా పూర్తి చేసి, ఆగస్టు 4వ తేదీలోగా ఎంపిక చేసిన అభ్య‌ర్థుల జాబితాల‌ను పారా మెడిక‌ల్ బోర్డుకు పంపించాలి. ఆగస్టు 7 నుంచి క్లాసులు ప్రారంభమ‌వుతాయి. ఇంట‌ర్మీడియ‌ట్ బిపిసి/ఎంపిసి పూర్తి చేసిన అభ్య‌ర్థులు మాత్ర‌మే ఈ కోర్సుల‌కు అర్హులు. ద‌ర‌ఖాస్తుల తేదీలు, అర్హ‌త‌లు, జ‌త ప‌ర‌చాల్సిన ప‌త్రాలు, ఫీజులు వంటి పూర్తి వివ‌రాల‌కు www.tspmb.telangana.govt.in అనే వెబ్ సైట్‌లో చూడొచ్చ‌ని పారా మెడిక‌ల్ బోర్డు కార్య‌ద‌ర్శి టి.గోపాల్ రెడ్డి తెలిపారు. పారామెడికల్ కోర్సుల‌ను అర్హ‌త‌ గ‌ల అభ్య‌ర్థులు సద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కొరారు.