Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

దుమ్మురేపిన రిలయన్స్

Reliance Industries posts net profit of Rs 9435 crore

 క్యూ4లో నికర లాభం రూ.9,435 కోట్లు
 గతేడాదితో పోలిస్తే 17.26 శాతం వృద్ధి
అంచనాలను మించిన కంపెనీ లాభాలు

న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది. సంస్థ నికర లాభం రూ.9,435 కోట్లతో 17.26 శాతం వృద్ధిని సాధించింది. అయితే కంపెనీ రూ.9,350 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని విశ్లేషకుల అంచనా వేయగా.. అంచనాలను మించి లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో రిలయన్స్ లాభం రూ.8,046 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ సేల్స్ రూ.92,889 కోట్ల నుంచి రూ.1.2 లక్షల కోట్లకు అంటే 29 శాతం వృద్ధిని సాధించాయి. ఇంతకుముందు 2013 డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.1,18,038 కోట్ల సేల్స్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో విక్రయాలతో రికార్డు నెలకొల్పింది. ఆదాయం రూ.92,889 కోట్ల నుంచి రూ.1,29,120 కోట్లకు పెరిగింది.

జియో లాభం రూ.510 కోట్లు
సంస్థ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చి ముగింపు త్రైమాసికంలో రూ.510 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంతకుముందు క్యూ3తో పోలిస్తే 1.20 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2017 డిసెంబర్ త్రైమాసికంలో జియో లాభం రూ.504 కోట్లుగా ఉంది. తీవ్రమైన పోటీ వాతావరణంలోనూ జియో పటిష్ఠమైన లాభాలను నమోదు చేసిందని, జియో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా నెట్‌వర్క్ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు.

రూ.1000 క్రాస్ చేసిన షేరు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీ షేరు రూ.1000 మార్కును క్రాస్ చేసి మళ్లీ దిగువకు చేరింది. నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడింగ్‌లో జోష్‌ను చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు 2.17 శాతం లాభంతో రూ.996 వద్ద స్థిరపడింది. కంపెనీ ఫలితాలు బాగుంటాయనే సానుకూల సంకేతాలతో షేరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా రిలయన్స్ దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది. పెట్రో కెమికల్, రిఫైనరీ బిజినెస్‌లను మాత్రమే కాక, పెట్టుబడిదారులు టెలికాం రంగంపై కూడా ఎక్కువగా దృష్టిసారించింది. మొత్తంగా ఈ ఏడాది కంపెనీ షేర్లు 34 శాతం ర్యాలీ జరిపాయి.

Comments

comments