Home ఎడిటోరియల్ బిహార్, బెంగాల్‌లో మత చిచ్చు

బిహార్, బెంగాల్‌లో మత చిచ్చు

ediy

బిహార్, బెంగాల్ రాష్ట్రాలలో ఇటీవల జరిగిన ఘర్షణలను గమనిస్తే 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి బిజెపి మతాలవారీగా జనాన్ని చీల్చే పాత కుయుక్తులనే అనుసరిస్తున్నట్టు రుజువు అవుతోంది. ఈ రెండు రాష్ట్రాలలో శ్రీ రామనవమి సందర్భంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లను రెచ్చగొట్టడానికి బిజెపి తన సామాజిక మాధ్యమాలను, సంస్థాగత యం త్రాంగాన్ని చాలా చాకచక్యంతో వినియోగించింది.
ఈ ఏడాది రామనవమి సమయంలో కయ్యానికి కాలు దువ్వే రీతిలో యువకులు కత్తులు కఠార్లు, కాషాయ జెండాలు చేతబూని మోటార్ సైకిళ్ల మీద భీకరమైన ఊరేగింపులు నిర్వహించారు. ఈ ఊరేగింపులన్నీ హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలనుంచే మతపరమైన భజనలు, కీర్తనలు, పాటలు ఆలాపిస్తూ మొదలైనాయి. ఆ తర్వాత ఆ ఊరేగింపులు ముస్లింలు నివసించే ప్రాంతాలలోకి ప్రవేశించాయి. ఆ చోట్లకు వెళ్లే సరికి పాటలు, నినాదాలు హోరెత్తేవి. దీని అసలు ఉద్దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి అనేక ఊరేగింపులకు సంఘ్ పరివార్ జాతీయ నాయకులు, కార్యకర్తలు నే తృత్వం వహించారు. ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ నుంచి కూడా పరివార్ కార్యకర్తలు ఈ రెండు రాష్ట్రాలకు వచ్చి ఊరేగింపుల్లో పాల్గొన్నారు.
2018 మార్చిలో బిహార్‌లోని అరరియా ఉప ఎన్నికలలో రాష్ట్రీ య జనతాదళ్ (ఆర్.జె.డి.) చేతిలో బిజెపి పరాజయం పాలైన తర్వాత మత ఘర్షణలు మొదలైనాయి. అవి రామనవమి ఉత్సవాల దాకా కొనసాగాయి. జిల్లాలలో కూడా ఈ ఘర్షణలు సాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. 65 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో రామనవమి నేపథ్యంలోనే అసన్సోల్‌లో మత ఘర్షణలు జరిగి నలుగురు మరణించారు. బిజెపి జాతీయ నాయకులు, ఇతర నాయకులు అక్కడ అమలులో ఉన్న నిషేధాజ్ఞలను బాహాటంగా ఉల్లంఘించి ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాలలో పర్యటించి పరిస్థితి మరింత విషమించేట్టు చేశారు. ఆ నాయకులు కేవలం హిందువులు ఉన్న ప్రాంతాలలోనే పర్యటించారు. బిహార్‌లో ఘర్షణలలో పాల్గొన్నాడన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి కొడుకును అరెస్టు చేశారు. ఇలాంటి సందర్భాలలో రాజకీయ నాయకులు వివేచనను ప్రదర్శించి బాధ్యతాయుతంగా మెలగాలి. కాని ఆ పని చేసింది అల్లర్లలో మృతుని తండ్రి ఇందాదుల్లా రషీదీ మాత్రమే. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడిని మతకలహాలు బలి తీసుకున్నందుకు విచారం వ్యక్తం చేస్తూనే శాంతియుతంగా ఉండాలని, ప్రతీకారం కోసం ప్రయత్నించకూడదని తోటి ముస్లింలను కోరారు.
బిహార్‌లో లోహియావాదుల, బెంగాల్‌లో వామపక్ష రాజకీయాల ప్రభావం మొదటి నుంచి ఎక్కువ. అక్కడ మితవాద, అగ్రకులాలకు ప్రాతినిధ్యం వహించే బిజెపి ఎన్నడూ బలంగా లేదు. జె.డి.(యు)తో పొత్తు కుదర్చుకోవడంవల్ల తప్ప బిజెపికి అస్తిత్వమే లేదు. బిహార్, బెంగాల్ రాష్ట్రాలు జాతీయ స్థాయిలో సామాజిక రాజకీయ రంగాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని వ్యతిరేకించే సంప్రదాయం ఉంది. ఎందుకంటే బీహార్ లో చాలా కాలం రాష్ట్రీయ జనతా దళ్, బెంగాల్ లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. కాని రాష్ట్రాలలోనూ, జాతీయ స్థాయిలోనూ బిజెపి దూకుడు రాజకీయాలను అమలు చేసి ఆర్.జె.డి.నే కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న జె.డి.(యు)ని బిహార్ లోనూ, తృణమూల్ కాంగ్రెస్ ను బెంగాల్ లోనూ బలహీనపరుస్తోంది.
తూర్పున ఉన్న ఈ రెండు రాష్ట్రాలు భిన్న మతాల సహజీవనానికి ప్రతీకలుగా ఉండేవి. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ మత కలహాల ఊసే లేదు. ఇదివరకు రామ నవమికి అంత ప్రాచుర్యం కూడా లేదు. కాని బిజెపి తన బలాన్ని నిరూపించుకోవడానికి యుద్ధ పిపాసతో ఊరేగింపులు నిర్వహిస్తున్నందువల్ల ఈ పరిస్థితి త్వరితంగా మారిపో యింది. ఈ ధోరణి ఇంకాఅనేక రాష్ట్రాలలోనూ కనిపిస్తోంది. భిన్న దేవతలను ఆరాధించే తత్వం ఉన్న హిందువులను ఏకం చేయడం కోసం బిజెపి శ్రీ రాముడిని బాగా వాడుకుంది. హిందూ రాష్ట్రం ఏర్పాటు కోసం హిందువులను కూడగట్టడమే బిజెపి లక్ష్యం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం బిజెపి ప్రచారాస్త్రాలలో ప్రధానమైంది. దీనికి అనుగుణంగానే బిహార్, బెంగాల్ రాష్ట్రాలలో రామ భక్తిని పెంచి పోషిస్తోంది. లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి బేటీ బచావో, బహు లావో నినాదాలు ఇస్తోంది. ముస్లిం యువకులను రావణులుగా చిత్రిస్తోంది. హిందూ యువతులు మాత్రం సీత లాంటి వారని సంఘ్ పరివార్ ప్రచారం చేస్తోంది. గౌరవనీయులైన హిందూ పురుషులు సీతను కాపాడాలని చెప్తోంది.
2014 ఎన్నికలలో బిహార్ లో బిజెపి 29.9 శాతం, బెంగాల్ లో 17 శాతం ఓట్లు సంపాదించింది. కాని 2015, 2016లో ఆ రాష్ట్రాలలో జరిగిన వివిధ ఎన్నికలలో బిజెపి ఓట్లు బిహార్ లో 24.4 శాతానికి, బెంగాల్ లో 10.2 శాతానికి తగ్గిపోయాయి. వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకోవడం, కులం ఆధారంగా ఉద్రిక్తతలు పెరగడంవల్ల బిజెపి మీద అనేక రాష్ట్రాలలో వ్యతిరేకత పెరిగింది. అందువల్ల బిహార్, బెంగాల్ రాష్ట్రాలలో పట్టు సంపాదించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో ఇటీవల విజయం సా ధించడంతో బిజెపి లో ఆశలు మరింత పెరిగాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ పొత్తు కుదుర్చుకోవడంవల్ల బిజెపి పరాజయంపాలైంది. అందుకని పట్టు సంపాదించాలంటే తన పాత విధానమైన మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బిహార్ లో 17 శాతం మంది, బెంగాల్ లో 27 శాతం మంది ముస్లింలు ఉన్నారు కనక వారిపై వ్యతిరేకత పెంచడానికి సంఘ్ పరివార్ నిరంతరం ప్రయత్నిస్తోంది.
జనాభా రీత్య బిహార్ దేశంలోకెల్లా అధిక జనాభా ఉన్న రాష్ట్రాలలో మూడవ స్థానంలో, బెంగాల్ నాల్గవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల జనాభా కలిపితే దేశ జనాభాలో 16 శాతం ఉంటుంది. అయినా ఈ రాష్ట్రాలలో అభివృద్ధి అంతగా కనిపించదు. పారిశ్రామికీకరణ తక్కువ. పేదరికం ఎక్కువ. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఆధారంగా బిజెపి కేంద్రం లో అధికారంలోకి వచ్చింది. ఉద్యోగాల కల్పన, అభివృద్ధి అన్న నినాదాలు బిజెపికి అనుకూలంగా పరిణమించాయి. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవనంలో మార్పు తీసుకురావడంలో బిజెపి విఫలమైంది. అందుకే మళ్లీ పట్టు సంపాదించడానికి కులతత్వాన్ని, మతోద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది.బిహార్, బెంగాల్ రాష్ట్రాలలోని సామాన్య ప్రజానీకం ఈ హింసాకాండను, మతోద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రచారాన్ని తీవ్రంగా నిరసించిం ది. కాని తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీలు ఈ హింసా కాండను వ్యతిరేకించడానికి బదులు తమ పద్ధతిలో మత రాజకీయాలను అనుసరిస్తూ బిజెపితో పోటీపడాలని ప్రయత్నిస్తున్నా యి. జె.డి.(యు) లాంటి ఇతర పార్టీలు ప్రభుత్వంలో తమ భాగస్వా మి అయిన బిజెపిని నిలవరించడానికి బదులు నిర్లిప్తంగా ఉండిపోయాయి. బిజెపి కుటిల రాజకీయాల నేపథ్యంలో ఈ ఆగడాలను నిరోధించడానికి ప్రత్యామ్నాయ ఐక్య సంఘటనను ఏర్పాటు చేయడంలో కనక ఇతర పార్టీలు విఫలమైతే అది అంతిమంగా జాతికే నష్టం.