Home మెదక్ ఫుట్‌పాత్‌లు అద్దెకు లభించును

ఫుట్‌పాత్‌లు అద్దెకు లభించును

యథేచ్ఛగా అక్రమ వ్యాపారం
కబ్జాకు గురవుతున్న పార్కింగ్ స్థలాలు
దుకాణ యజమానులకు కాసులు
పాదచారులకు కష్టాలు
మెతుకుసీమలో కొనసాగుతున్న ఫుట్‌పాత్ దందా

FOOTPATHమన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఫుట్‌పాత్ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. బయటకు కనిపించకపోయినా ఈ దందా ద్వారా కొందరు వ్యాపారులు ప్రతినెలా రూ.50 వేలకు పైగా అక్రమంగా సంపాదిస్తున్నది మాత్రం వాస్తవం. ఆయా జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లో రహదారుల్లో ఉన్న వాణిజ్య, వ్యాపార సంస్థల దుకాణ సముదాయం వారు తమ ముందున్న ఫుట్‌పాత్‌లను సైతం కబ్జా చేస్తున్నారు. ఆయా ఫుట్‌పాత్‌లను తోపుడు బండ్ల వారికి, చిన్న చిన్న కొట్టులు నిర్వహించే వారికి అద్దెకిస్తున్నారు. దీంతో ప్రతిరోజు వారి నుంచి రూ.500 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు నుంచి ముగ్గురు చిరు వ్యాపారులకు ఫుట్‌పాత్‌లను అద్దెకిస్తున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, రామచంద్రపురం, ఇస్నాపూర్, సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్, చేగుంట, మెదక్, జోగిపేట తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సంస్థల ముందు వాహనాలను నిలుపడానికి కేటాయించిన స్థలాలతో పాటు పాదచారులు నడవడానికి కేటాయించిన స్థలాల్లో ఈ వ్యాపారాలు నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల దుకాణాల ముందు వాహనాలు నిలుపడానికి కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలకు, వ్యాపారాలకు అనుమతులు ఇవ్వకూడదనే నిబంధనలు వున్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడంతో పాదచారులు నడిచేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు, రామచంద్రపురం, జహీరాబాద్ పట్టణాల్లో రద్దీ ఎక్కువగా వుంటుంది. ఈ కారణంగా పాదచారులు రోడ్డుపై నడవడానికి వీలు లేకుండా వుంది. పాదచారులు నడిచేందుకు కేటాయించిన స్థలాలను ఆయా దుకాణాల యజమానులు కబ్జా చేయడంతో పాదచారులు రోడ్డుపై నుంచే వెళ్లాల్సివస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్లే పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.

ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చేపట్టే వ్యాపార వాణిజ్య సముదాయానికి తప్పనిసరిగా పార్కింగ్ కోసం సెల్లార్లను కేటాయించాలి. కానీ సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ని ప్రధాన పట్టణాల్లో వ్యాపార వాణిజ్య సముదాయాలు సెల్లార్లను సైతం వ్యాపారానికి అద్దెకిస్తున్నారు. దీంతో పార్కింగ్ స్థలాల కోసం ఏర్పాటు చేసిన సెల్లార్లు వ్యాపారా నికి వాడుతుండటంతో వాహనాలన్నీ రోడ్లపై పార్కింగ్ చేయాల్సి వస్తోంది. 200 చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణం చేపడితే ముందు భాగంలో పార్కింగ్ ఖాళీ స్థలం కేటాయించాలి. 750 చదరపు మీటర్ల పరిధి దాటినట్లయి తే సెల్లార్లు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న ఇటువంటి పెద్ద వ్యాపార సముదాయాలు, ఆసుపత్రులు ఈ నిబంధనలను ఖాతరు చేయడం లేదు. నిర్మాణ సమయాల్లో కాగితాల్లో వాహనాల పార్కింగ్‌కు స్థలాలను చూపిస్తున్నప్పటికీ భవన నిర్మాణాలు పూర్తి కాగానే వాటిని కూడా వ్యాపారానికి వాడుకుంటున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఇటువంటి అక్రమ వ్యాపారంపై ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.