Home ఆఫ్ బీట్ రియల్ లో ‘రెరా’ అధ్యాయం

రియల్ లో ‘రెరా’ అధ్యాయం

ఇళ్లను, ప్లాట్లను, ఫ్లాట్లను కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఇక ముందు రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్స్‌తో మీకు ఎదురయ్యే సమస్యలు సమసిపోనున్నాయి. కొనుగోలుదారుల డబ్బుకు భద్రతను, వారికి సకాలంలో ఆస్తి చేతికి రానున్నది. రియల్టర్లు తమ ప్రాజెక్ట్ నిర్మాణాలు పూర్తిచేయడంలో, లేఅవుట్లను అభివృద్ధి పరచడంలో జాప్యం చేసే పరిస్థితికి ఇక కాలం చెల్లనున్నది. ఇటు కొనుగోలుదారులకు, అటు రియల్టర్లకు మేలు చేసేవిధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టంతో పనిచేసే స్థిరాస్తి నియంత్రణ సంస్థ(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ- రెరా)ను ఏర్పాటు చేసింది. 

Realestate

నగరంలో ఆగష్టు నుండి ‘రెరా’ కొనుగోలుదారుల సమస్యలకు చెక్ ఇక ప్రతి ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ నిర్ణీతగడువులోపే నిర్మాణాలు, లేఅవుట్లు జాప్యం చేస్తే జరిమానా, వడ్డీ వడ్డన విక్రయ ఒప్పందానికి 10 శాతమే చెల్లింపులు రెరా చైర్మన్‌గా రాజేశ్వర్ తివారీ, కార్యదర్శిగా విద్యాధర్

ఈ సంస్థ మరో నెల రోజుల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నది. ప్రధానంగా రియల్టర్లలో పారదర్శకతను, జవాబుదారీతనం స్పష్టంగా ఉండేలా, నిర్ణీత గడువులోపల రియల్టర్లు ప్రారంభించే ప్రతి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేలా చూస్తుంది. నిర్మాణాలు, లేఅవుట్లలో నాణ్యతకు పెద్దపీటపడనున్నది. ఈ రంగం వారు చేసే ప్రతి ప్రాజెక్ట్‌కు సంబంధించి కొనుగోలుచేసిన భూములు వివాదరహితంగా ఉన్నవాటికే రిజిస్ట్రేషన్ చేస్తుంది. రెరా అమలుతో ఇక ముందు రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రచారాలు, ప్రకటనలు, విక్రయాలు, అడ్వాన్సులు తీసుకోవడం జరగదు. ఇలా చేస్తే ప్రాజెక్ట్ మొత్తంలో 10 శాతం జరిమానాగా విధించనున్నది. కొనుగోలుదారులకు, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మరింత భరోసాను రెరా కల్పించనున్నది.ఈ రంగంలోని వ్యాపారుల మధ్య నాణ్యత, నిర్ణీతగడువులోపు పూర్తిచేసే విధంగా ఆరోగ్యకరమైన పోటీ పెరగనున్నది.

ఇదీ రెరా: నిర్మాణాలు, ఖాళీ ప్లాట్లను కొనుగోలు చేసేవారికి భద్రత కల్పించడం. నష్టం వాటిల్లకుండా చూడటం. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పారదర్శకంగా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ -2016 ను తీసుకువచ్చింది. 2016 మార్చి 10న రాజ్యసభ, 2016 మార్చి 15 లోక్‌సభ ఈ చట్టపు బిల్లుకు ఆమోదం తెలిపాయి. దీంతో ఈ చట్టం మే 1, 2016లో అమలులోకి వచ్చింది. ఈ చట్టానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ యాక్ట్(రెరా)కు రూపొందించిన నియమనిబంధనలు మే 1, 2017 నుండి అమలులోకి తీసుకువచ్చింది కేంద్రం.

ఈ రెరాను 6 మాసాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కేంద్ర మంత్రిమండలి ఆదేశించింది. ఈ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన తమ పరిధిలో నెలకొన్న పరిస్థితులకు వీలుగా కార్యాచరణను సిద్ధం చేసుకుని అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల్లో రెరాను ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించింది.

రెరా వెల్లడిస్తుంది ఇలా: ప్రతి డెవలపర్, నిర్మాణదారుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి లేదా కన్సల్టెంట్ తమతమ ప్రాజెక్ట్‌లను రెరా వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేరు. డెవలపర్ లేదా రియల్టర్ లేదా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ చేసుకున్న దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేయడమా లేదా తిరస్కరించడమా ? అనేది 30 రోజుల్లో రెరా తెలియపరుస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు తమ పథకం పనులు చేపట్టేందుకు ఒక నిర్వాహణ వ్యయపు బ్యాంక్ ఖాతాను తెరవాలి. చేపట్టిన ప్రాజెక్ట్ వ్యయం మొత్తంలో 70 శాతం నిధులను ఆ ఖాతాలోనే జమచేసి వాటిని ఆ పథకానికి మాత్రమే ఖర్చుచేయాలి. డెవలపర్లు తాము చేపట్టిన ప్రతి పథకం పూర్తిచేసే గడువును తెలియపరిచాలి. రెరాకు అధికారిక వెబ్‌సైట్ ఉంటుంది. అందులో డెవలపర్‌కు ఒక పేజీని కేటాయిస్తూనే యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను అందజేస్తారు. ప్రతి మూడు మాసాలకు ఒక మారు తమ ప్రాజెక్ట్ నిర్మాణ దశ వివరాలను తెలియపరచాలి. తమ పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రెరా వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ప్లాట్ విస్తీర్ణం 500 చ.మీ.లకు తక్కువగా, 8 ఫ్లాట్స్‌కు మించకుండా నిర్మించే రియల్ ఎస్టేట్ పథకాలను రెరాలో రిజిష్టర్డ్ చేసుకోవాల్సిన అవసరంలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో పథకం పూర్తిచేస్తామని తెలిపిన పరిమితి కాలం ప్రకారమే పూర్తిచేయాలి. లేని పక్షంలో రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం రెరాకు ఉంటుంది. ప్రాజెక్ట్‌ను రెరా నియమనిబంధనల ప్రకారం చేపట్టకపోతే జరిమానాను విధిస్తుంది.

కొనుగోలుదారులకు అనుకూలంగా: ఆస్తి ఖరీదు చేసుకునేవారి సొమ్ముకు భద్రతను, భరోసాను కల్పిస్తుంది. నష్టం కలగకుండా చూస్తుంది. మోసం చేసేవారి రియల్టర్లపై చర్యలు తీసుకుంటుంది. నిర్మాణాలను, లేఅవుట్లను సమయానుకూలంగా పూర్తిచేసి కొనుగోలుదారులకు అప్పగించేలా చూస్తుంది. భవనం, ఇల్లు, ఫ్లాట్, ప్లాట్ ఏదేని ఖరీదు చేసుకునే సమయంలో ముందస్తుగా అడ్వాన్స్‌గా చెల్లించాల్సింది కొనుగోలుచేసే ఆస్తి ఖరీదు మొత్తంలో 10 శాతం మాత్రమే ఇచ్చి ఒప్పంద పత్రం రిజిష్టర్డ్‌గా చేసుకునే వీలున్నది. ఒప్పందం ప్రకారంగా నిర్ణీత గడువుకు పథకాన్ని పూర్తిచేయని ఎడల లేదా కొనుగోలుదారుడికి ఆస్తిని ఒప్పందం ప్రకారం అప్పగించని పక్షంలో ఆ అడ్వాన్స్‌ను పూర్తిగా వడ్డీతో సహా వెనక్కి తీసుకోవచ్చును. లేదా అతడి వద్ద నుండి ప్రతినెలా వడ్డీని తీసుకుంటూ పథకం పూర్తిచేసే వరకు ఉండవచ్చును. పథకాన్ని సమయానికి పూర్తిచేయకపోవడం, సేకరించిన అడ్వాన్స్‌లను ఇచ్చేందుకు నిరాకరించడం, వడ్డీని చెల్లించకుండా ఉండే వారిపై రెరాకు ఫిర్యాదు చేయవచ్చును. రెరా తగిన విచారణ చేపట్టి అతడి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో పాటు మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశా లున్నాయి. ఎవరిదైనా నమోదు చేసిన రిజిస్ట్రేషన్ రద్దుపరిస్తే ఆ పథకంలోని నిర్మాణాలు లేదా ప్లాట్లు విక్రయించడానికి వీలుండదు.

జాప్యానికి చెల్లుచీటి: ఇప్పటి వరకు రియల్టర్లు తమ ప్రాజెక్ట్‌ను ప్రచారం చేసుకుని కొనుగోలుదారుల నుండి అడ్వాన్స్‌గా లేదా బుకింగ్ రూపేణా అధిక నగదును తీసుకుని తమ ప్రాజెక్ట్‌ను ఆ నిధులతోనే పూర్తిచేస్తున్నారేని బహిరంగ రహస్యం. మరికొందరు పలు పథకాలను చేపట్టి సరిపడ నిధులులేక జాప్యం చేయడం నగరం, శివారులో సర్వసాధారణం. ఒక్కొక్క ప్రాజెక్ట్‌ను కనీసంగా 5-6 సంవత్సరాలు చేస్తున్నట్టు కొందరు రియల్టర్లపై విమర్శలున్నాయి. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక వ్యవస్థగానీ, అధికారిక సంస్థగానీ లేదు. రియల్టర్లు తమ వ్యవహారాలను, కార్యకలాపాలను ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఫలితంగా కొనుగోలుదారులు బిల్డర్ల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంటున్నది. ప్రస్తుతం ప్రభుత్వ తీసుకువస్తున్న రెరా చట్టంతో ఈ పరిస్థితి కనుమరుగుకానున్నది.

రెరా ఇక్కడే: రెడ్‌హిల్స్‌లోని డిటిసిపి విభాగపు భవన సముదాయం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కార్యాలయ పనులు జరుగుతున్నాయి. రెరా కార్యాలయం ఏర్పాటుకు హెచ్‌ఎండిఎ ఆర్థిక సహకారాన్ని అందించింది. వచ్చే నెల ఆగష్టు మొదటి వారంలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రెరాకు చైర్మన్‌గా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి, కార్యదర్శిగా డిటిసిపి డైరెక్టర్ విద్యాధర్, ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు, ఇద్దరు జాయింట్ డైరెక్టర్లును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డైరెక్టర్ల బృందం ముంబయికి వెళ్ళి శిక్షణను తీసుకున్నది. ప్రస్తుతం ముంబైకి సాంకేతిక వ్యవస్థను అందించిన సంస్థనే హైదరాబాద్‌కు కూడా అందిస్తుంది.

ఆదాయమిలా: రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ప్రాజెక్ట్‌కు రుసుం రూ. 750లు డెవలపర్లు, నిర్మాణదారులు, రియల్ ఎస్టేట్ రంగం వారు చెల్లించాల్సి ఉంటుంది. కన్సల్టెంట్స్, ఏజెంట్స్ మాత్రం రూ. 500లు చెల్లించాలి. ఎన్ని ప్రాజెక్ట్‌లు వస్తే అన్ని రూ. 750, రూ. 500లుగా ఆదాయం, ఇక జరిమానాల రూపేణా కూడా చేకూరుతుంది.

అక్రమంగా వెలిసేవాటికి తావుండదు

ప్రధానంగా కొనుగోలుదారులకు, ఆ రంగంలో పెట్టుబడులు చేసేవారికి ప్రయోజనం చేకూరుతుంది. అనుమతులులేకుండా వెలిసే నిర్మాణాలు, లేఅవుట్లు తగ్గుతాయి. ప్రతి రియల్టర్ తమ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వ సంస్థల నుండి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించడం ఉంటుంది. విక్రయాలు చేయడం చాలా కష్టసాధ్యమవుతుంది. కొనుగోలుదారుల నిర్మాణాలు, ప్లాట్లు సకాలంలో చేతికి అందుతాయి. నిర్మాణదారులు, లేఅవుట్ల వారికి బ్యాంక్‌ల నుండి రుణాలు సులువుగా మంజూరవుతాయి. వారికి వడ్డీ భారం తగ్గుతుంది. రియల్టర్లు నాలుగు దిక్కుల్లో పెట్టుబడిపెట్టి ఏదీ సకాలంలో పూర్తి చేయలేని ఇబ్బందులకు పుల్‌స్టాప్ పడుతుంది. ప్రాజెక్ట్‌లు పూర్తిచేసే ఆర్థిక స్థోమత ఉన్నవారే ముందుకు వెళ్తారు. ప్రస్తుతం ముంబై, పూణే నగరాల్లో రెరా అమలుతో సత్ఫలితాలు వస్తున్నాయి.

టి. చిరంజీవులు,
కమిషనర్ హెచ్‌ఎండిఎ

ఉభయ కుశలోపరి రెరా

స్థిరాస్తి నియంత్రణ సంస్థ ఇటు రియల్టర్లకు, అటు కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉన్నది. ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నాం. ఈ చట్టం ద్వారా రియల్ ఎస్టేట్ ఒక పరిశ్రమగా గుర్తించబడుతుందనేది మా నమ్మకం. మేమెప్పుడూ కొనుగోలుదారుల వైపే ఆలోచిస్తుంటాం. వారు బాగునే ఈ రియల్ రంగం మెరుగవుతుందనేది మా నమ్మకం. నిర్మాణాలు, ప్లాట్లు వేగంగా విక్రయాలు జరుగుతాయనేది మా అభిప్రాయం.ఈ పరిశ్రమ పురోగతిని సాధించడంలో ఈ రెరా చక్కని పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నాం.

 రవీందర్‌రావు, అధ్యక్షుడు ట్రెడా

మంచె మహేశ్వర్
మన తెలంగాణ/ సిటీ బ్యూరో