Home ఎడిటోరియల్ రీసెర్చ్ విద్యపై చన్నీళ్లు!

రీసెర్చ్ విద్యపై చన్నీళ్లు!

 

స్టయిపెండ్ పెంచాలని గత సంవత్సరం ఏప్రిల్ నుంచి అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధక విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలకు అనుగుణంగా పిహెచ్‌డి స్టయిపెండ్ పెంచాలని కోరుతున్నారు.
ప్రస్తుతం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు పాతికవేల రూపాయలు లభిస్తుంది. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌గా 28 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇందులో ఇంటి అద్దె లేదు. ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడి ఇంటి అద్దెల ప్రకారం ప్రత్యేకంగా చెల్లించాలి. విద్యార్థులు 80 శాతం పెంపు కోరుతున్నారు. దీనికి కారణం తాము చెల్లించవలసిన ట్యూషన్, మెస్ ఇతర ఫీజులు చాలా పెరిగిపోయాయి కాబట్టి ఆ ఖర్చులను భరించడానికి ఈ పెంపుదల అవసరమని వాదిస్తున్నారు. జనవరి 16వ తేదీన ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు కొందరిని అరెస్టు చేసి నిర్బంధంలోకి తీసుకున్నారు.
చివరకు స్టయిపెండ్ 24 శాతం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇప్పుడు 31 వేల రూపాయలు, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 35 వేల రూపాయలు. ఈ స్టయిపెండ్ పెంచడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవాలని కేంద్రం భావించినప్పటికీ అలా జరగలేదు. రీసెర్చ్ స్కాలర్లు అసంతృప్తితోనే ఉన్నారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో చదువుతున్నవారు. ఐఐటిలు, ఐఐయస్‌సి, ఎయిమ్స్ వగైరా సంస్థలకు చెందినవారు. దేశంలో ఉన్నత విద్యారంగానికి కేటాయించే నిధుల్లో అత్యధిక శాతం ఈ విద్యా సంస్థలకే వెళతాయన్నది కూడా గమనించాలి. గమనించవలసిన మరో విషయమేమంటే, ఈ ఆందోళనల్లో ఎక్కడా సామాజిక శాస్త్రాల విద్యార్థులు కనబడలేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, విజ్ఞాన సాంకేతిక శాస్త్రాల విభాగం పత్రికా ప్రకటనలో స్టయిపెండ్ పెంపు కేవలం సైన్సు విద్యార్థులకు మాత్రమే అని స్పష్టం చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన చేస్తున్న స్కాలర్లు దేశంలో జ్ఞానసంపద పెంచడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారని, దేశంలో పారిశ్రామిక ప్రగతికి, విద్యాపరమైన ప్రగతికి, సాంకేతిక ఆవిష్కరణలకు కారణమవుతున్నారని ప్రశంసించింది.
బెంగళూరులోని అశోకా ట్రస్ట్ ఫర్ ఎకోలజీ అండ్ ది ఎన్విరాన్ మెంట్ లో పరిశోధన చేస్తున్న పిహెచ్‌డి స్కాలర్ ఓవీ థోరాట్ జీవ వైవిధ్యం, శక్తివనరుల ప్రణాళికాబద్ధ వాడకంపై పరిశోధన చేస్తున్నాడు. కేవలం సైన్సు విద్యార్థులు మాత్రమే దేశానికి సేవ చేస్తున్నారనే ఈ ప్రకటన ఇలాంటి విద్యార్థులను నిరాశకు గురిచేసింది. సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన, సామాజిక శాస్త్రాలకు మధ్య వారధిగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ శాస్త్రాలను అభ్యసిస్తున్నవారందరికీ ఈ ప్రకటన నిరాశ కలిగించింది. సామాజిక శాస్త్రాలను చదివే వారు సమాజానికి తిరిగి ఇచ్చేది ఏదీ ఉండదన్న అభిప్రాయమే ప్రబలంగా ఉంది. సామాజిక శాస్త్రాలను అభ్యసించే ప్రతి విద్యార్థి తన చదువు ప్రాముఖ్యం ఏమిటో సమాజానికి నిరూపించుకోవలసిన పరిస్థితిలో ఉన్నాడు. విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు చదివే విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. సైన్సులో రీసెర్చ్ చేసేవారి ప్రాముఖ్యం పెరిగింది. వారికి చెల్లించే స్టయిపెండ్ గురించి మాట్లాడేవారు ఎక్కువయ్యారు. సామాజిక శాస్త్రాల్లో పరిశోధన చేస్తున్నవారు కూడా స్టయిపెండ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కూడా తమ విద్యాసంస్థల నుంచి అవసరమైన సహాయం లభించని పరిస్థితులు ఉన్నాయి. మద్రాస్ ఐఐటిలో ఫిల్మ్ స్టడీస్ చదువుతున్న విద్యార్థి సయాంతి చటర్జీ ఈ విషయమై మాట్లాడుతూ సైన్సులో రీసెర్చ్ చేసేవారికి బయటి నుంచి ఫండింగ్ లభిస్తుంది. అలాంటి ఫండింగ్ ఏదీ సామాజిక శాస్త్రాల్లో పరిశోధన చేస్తున్న వారికి లభించదు. పరిశోధన చేస్తున్న విద్యార్థి ఎంతో తిరగవలసి వస్తుంది. కొన్ని నెలల పాటు అనేక ప్రదేశాలు సందర్శించి సమాచారం సేకరించవలసి వస్తుంది. పురాతత్వశాస్త్రం, సామాజికశాస్త్రం, భాషాశాస్త్రం వంటి విభాగాల్లో పరిశోధనలు చేస్తున్నవారు నెలల తరబడి తిరిగి సమాచారం సేకరించే పరిస్థితులుంటాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా తక్కువగా లభించే స్టయిపెండ్‌తో విద్యార్థులు ఇబ్బందుల పాలు అవుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు హాజరైనప్పుడు విద్యాసంస్థలు ఆ ఖర్చులను తర్వాత చెల్లిస్తుంటాయి. కాని పరిశోధన కోసం వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్నప్పుడు ఆ ఖర్చులను చెల్లించే నిబంధనలేవీ లేవు. అలాగే సమావేశాలకు హాజరైనప్పుడు కూడా చాలా చిన్న చిన్న విద్యాసంస్థల్లో చెల్లింపులు జరగడం లేదని అన్నాడు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్టయిపెండ్ అందరికీ లభించదు. సామాజికశాస్త్రాల్లో ఈ స్టయిపెండ్ దొరకడం చాలా కష్టం. అత్యధిక ర్యాంకు సాధించిన వారికి మాత్రమే లభిస్తుంది. అందువల్ల చాలా మంది ఇతర స్కాలర్ షిప్పుల కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ స్కాలర్ షిప్పులను పెంచాలన్న డిమాండ్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అందరూ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు ద్వారా లభించే స్కాలర్ షిప్పుల గురించి మాత్రమే మాట్లడుతుంటారు. కాని చాలా మంది నాన్ ఎన్‌యిటి స్కాలర్ షిప్పులతోనే పరిశోధన చేస్తున్నారు. అంతంత మాత్రంగా వచ్చే ఈ స్కాలర్ షిప్పు చాలదు కాబట్టి చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ పరిశోధన కొనసాగించవలసి వస్తోంది.
ఏది ఏమైనా, సైన్సు పరిశోధనలు చేస్తున్న స్కాలర్లకు సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న వారి కన్నా ఎక్కువ స్టయిపెండ్ చాలా చోట్ల లభిస్తోంది. అలాగే లాభేతర పరిశోధనా సంస్థలు సాధారణంగా విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ విధంగా ఈ సంస్థల్లో పిహెచ్‌డి చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కాలర్లు పిహెచ్‌డి ఈ విశ్వవిద్యాలయం నుంచి పొందినా వారికి స్టయిపెండ్ మాత్రం ఈ సంస్థలే చెల్లించాలి. ఇలాంటి విద్యార్థులకు కూడా స్టయిపెండ్ అంతంతమాత్రంగానే దొరుకుతుంది. జూనియర్ రీసెర్చ్ స్కాలర్లకు, సీనియర్ రీసెర్చ్ స్కాలర్లకు అంటే ఎన్‌యిటి ద్వారా స్టయిఫండ్ పొందుతున్న వారికి స్టయిపెండ్ పెరిగినా ఇలాంటి వారికి పెరగదు. విద్యారంగంలో ఈ సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సామాజిక శాస్త్రాలకు తగిన ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరమూ ఉంది.

Research Students protests to increase stipend