Home ఎడిటోరియల్ గడ్కరీ సత్యవాక్కు

గడ్కరీ సత్యవాక్కు

Reservation is not a guarantee for a job

“రిజర్వేషన్ మంజూరు ఉద్యోగానికి గ్యారంటీ కాదు. ఎందుకంటే దేశంలో ఉద్యోగాలు కుదించుకుపోతున్నాయి”. ఇది కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సత్యవాక్కు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కొరకు మరాఠాలు రెండు వారాలకు పైబడి సాగిస్తున్న ఆందోళనను గడ్కరీ దృష్టికి తెచ్చినపుడు ఆయన ఈ కఠోరసత్యం వెల్లడించారు. సాపేక్షికంగా అభివృద్ధి చెందిన మరాఠాలు (మహారాష్ట్ర), జాట్‌లు(పలు రాష్ట్రాల్లో), పటీదార్లు(గుజరాత్) రిజర్వేషన్‌ల కొరకు గట్టిగా ఆందోళన చేస్తున్నారు. పేదలు అన్ని కులాల్లో ఉన్నారు. శతాబ్దాల తరబడి అణచివేతకు, పీడనకు గురిచేయబడిన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు వారి జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది. సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన తరగతులు మండల్ కమిషన్ సిఫారసు ప్రకారం 27 శాతం రిజర్వేషన్ పొందుతున్నారు. అయితే హక్కుగా రిజర్వేషన్ ఉన్నప్పటికీ ప్రభుత్వోద్యోగాల్లో ఈ కేటగిరీల బ్యాక్‌లాగ్ (అర్హులు లేరన్న కారణాన) పెద్దగా కొనసాగుతూనే ఉంది. అగ్రవర్ణాల్లో ఆర్థికం గా వెనుకబడిన తరగతులకు (ఇబిసిలు), పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌లున్నాయి. మొత్తం రిజర్వేషన్‌లు 50 శాతం దాటరాదనే సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో గుజ్జార్‌లు, పటీదార్లు, జాట్‌లు, మరాఠాలు తమకు రిజర్వేషన్‌లు కల్పించాలంటూ దఫదఫాలుగా ఆందోళనకు దిగు తున్నారు. మరాఠాల ప్రస్తుత ఆందోళనలో 8మంది మరాఠా యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, పలుచోట్ల పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. బిజెపి మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గినట్లు కనిపిస్తున్నది. మరాఠాల సామాజిక వెనుకబాటుతనాన్ని నిర్థారిస్తూ బిసి కమిషన్ నివేదిక రాగానే నవంబర్‌లోపు రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం మరాఠాల రిజర్వేషన్ కొరకు చర్యలు చేపడుతామని, 36 వేల ప్రభుత్వోద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నావిస్ ప్రకటించారు.

అయితే దేశంలో ఉద్యోగాలేవీ? అన్న గడ్కరీ ప్రశ్న వాస్తవిక దృష్టితో కూడినది. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఐటిలో, బ్యాంకుల్లో ఉద్యోగాలు రానురాను తరుగుతున్నాయి. ప్రభుత్వంలో రిక్రూట్‌మెంట్ దాదాపు స్తంభించింది. ఔట్ సోర్సింగ్ తప్ప రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లేదు. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణ పెరుగుతున్నందున వాటిలో రిజర్వేషన్‌లు పాటించాల్సిన పనిలేదు. రిజర్వేషన్‌లను ప్రభుత్వ రంగానికి విస్తరించాలన్న జాతీయ ట్రేడ్ యూనియన్‌ల డిమాండ్‌ను అటు పరిశ్రమ, ఇటు ప్రభుత్వం వ్యతిరేకి స్తున్నాయి. అందువల్ల రిజర్వేషన్ కేటగిరీలకే ఉద్యోగాలు తరుగుతున్నాయి, ఇక కొత్త కులాలకు చోటెక్కడ?

నయా ఉదార ఆర్థిక విధానాలవల్ల ఉపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది. ఇది తెలిసికూడా రాజకీయ పార్టీలు యువత ఓట్లను ఆకర్షించేందుకు ఉద్యోగ కల్పనను వాగ్దానం చేస్తుంటాయి. తమకు అధికారమిస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ గత ఎన్నికల సందర్భంలో చేసిన వాగ్దానం అటువంటిదే. ఆచరణలో అది మరొక ఎన్నికల జుమ్లా(తమాషా)గా మారింది. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిపక్షాలు తూర్పారపడుతూ, ఏవీ మీరు కల్పించిన ఉద్యోగాలని నిలదీస్తే పకోడీలు అమ్ముకోవటాన్ని కూడా లాభదాయక ఉపాధిగానే పేర్కొని మోడీ ప్రభుత్వం వ్యంగ్యాత్మక విమర్శలకు గురైంది. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ ఇపిఎఫ్, ఎన్‌పిఎస్ గణాంకాల ప్రకారం 70 లక్షలమంది ఉపాధులు పొందారని చెప్పటంతోపాటు కార్లు, ఆటోలు, వాణిజ్యవాహనాల విక్రయాల పెరుగుదల లెక్కలు, చార్టర్డ్ అక్కౌంటెంట్లు, లాయర్లు, డాక్టర్ పట్టా పొందిన వారి సంఖ్యలు ఉదహరించి వారందరూ ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. అందువల్ల ప్రభుత్వానికి ఇబ్బందికరమైనా, గడ్కరీ చెప్పింది నిజం. ప్రభుత్వోద్యోగాలు లేవు, రిజర్వేషన్ కొరకు పోరాడి లాభమేమి? అయితే ఈ ఆందోళనవల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయరాదు. తాము రిజర్వేషన్‌లకు కట్టుబడి ఉన్నామని మోడీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సామాజిక వెనుకాబటుతనం ప్రాతిపదిక రిజర్వేషన్‌ల స్థానంలో ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ వాదనకివి బలం చేకూర్చుతాయి. ఇది అగ్రకులాల డిమాండ్.